డబుల్ బెడ్రూం అప్లికేషన్ల వెరిఫికేషన్​ ఎప్పుడు ?

డబుల్ బెడ్రూం అప్లికేషన్ల వెరిఫికేషన్​ ఎప్పుడు ?
  • తాత్కాలికంగా నిలిపివేసిన బల్దియా అధికారులు
  • బిల్​ కలెక్టర్లకు ఇతర పనులు అప్పగింత
  • మళ్లీ చేస్తారో.. లేదోనని దరఖాస్తుదారుల్లో టెన్షన్​

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ లో కొనసాగుతున్న డబుల్ బెడ్రూం ఇండ్ల వెరిఫికేషన్ ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలుస్తోంది. అధికారులు మొన్నటి వరకు దరఖాస్తుదారుల ఇండ్లకు వెళ్లి, అడ్రస్​లలో లేనివారికి ఫోన్లు చేసి టెన్షన్ పెట్టారు. తాజాగా బిల్ కలెక్టర్లకు స్పెషల్ సమ్మరీ రివిజన్–2023కి సంబంధించి ఓటరు నమోదు, మార్పులు చేర్పులకు సంబంధించిన పనులు అప్పగించడంతో వెరిఫికేషన్​ ప్రాసెస్​కు బ్రేక్ పడింది. వీటి తర్వాత బతుకమ్మ చీరల పంపిణీ షురూ అవుతుంది. ఆ పనులు కూడా బిల్​కలెక్టర్లకే అప్పగించనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పట్లో వెరిఫికేషన్​పూర్తయ్యేలా కనిపించడం లేదు.

మరోవైపు డబుల్​బెడ్రూం ఇండ్లు ఎప్పుడొస్తాయా అని ఎదురుచూస్తున్న దరఖాస్తుదారుల్లో ఆందోళన కొనసాగుతోంది. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న దరఖాస్తుదారుల నుంచి ఓటర్ కార్డు, ఇతర వివరాలు సేకరించారు. అందుబాటులో లేనివారికి ఫోన్లు చేసి తెప్పించుకున్నారు. సిబ్బంది రాకపోగా కనీసం ఫోన్లు కూడా చేయలేదని కొందరు మరింత ఆందోళన చెందుతున్నారు. ఇండ్లు వస్తాయో లేవోనని అధికారుల వద్దకు పరుగులు తీస్తున్నారు.

మాన్యువల్​గా అప్లికేషన్లు కానొస్తలే

డబుల్​బెడ్రూం ఇండ్ల కోసం ఆరేండ్ల కింద గ్రేటర్​వ్యాప్తంగా 7.10లక్షల అప్లికేషన్లు వచ్చాయి. ముందుగా కలెక్టరేట్లతోపాటు జీహెచ్ఎంసీ ఆఫీసులోనూ మాన్యువల్​గా సేకరించారు. కుప్పలు కుప్పులుగా అప్లికేషన్లు వస్తుండడంతో అధికారులు మీసేవ ద్వారా అప్లయ్ చేసుకోవాలని సూచించారు. అయితే అప్పటికే లక్షకుపైగా అప్లికేషన్లు మాన్యువల్ గా వచ్చాయి. ఇప్పుడు అప్లికేషన్లు ఎక్కడున్నాయో అర్థం కావడం లేదు. వెరిఫికేషన్​ ప్రాసెస్​లో అధికారులు వాటిని పట్టించుకోవడం లేదు. మాన్యువల్​గా అప్లయ్ చేసిన వారికి ఇండ్లు వచ్చే అవకాశం లేదని కొందరు అధికారులు అంటున్నారు. బిల్​కలెక్టర్లు కూడా ఇదే చెబుతున్నారు. ఇప్పటివరకు మీసేవ ద్వారా అప్లికేషన్లకు సంబంధించిన వివరాలు మాత్రమే సేకరించారు.