4 రోజుల ర్యాలీకి బ్రేక్.. స్టాక్ మార్కెట్లు డౌన్.. సెన్సెక్స్ 153 పాయింట్లు పతనం

4 రోజుల ర్యాలీకి బ్రేక్.. స్టాక్ మార్కెట్లు డౌన్.. సెన్సెక్స్ 153 పాయింట్లు పతనం
  • 62 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ

ముంబై: వరుసగా నాలుగు సెషన్లలో లాభాలు సంపాదించుకున్న స్టాక్​మార్కెట్లు బుధవారం (అక్టోబర్ 09) నష్టపోయాయి. -చిప్​ స్టాక్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్​షేర్లలో అమ్మకాల ఒత్తిడితో లాభాలకు బ్రేక్​ పడింది.   బీఎస్​ఈ సెన్సెక్స్ 153.09 పాయింట్లు తగ్గి 81,773.66 వద్ద స్థిరపడింది.  ఒక దశలో 82,257.74 గరిష్ట స్థాయిని, 81,646.08 కనిష్ట స్థాయిని తాకింది. అంటే దాదాపు 611.66 పాయింట్ల హెచ్చుతగ్గులకు లోనైంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 62.15 పాయింట్లు కోల్పోయి 25,046.15 వద్ద ముగిసింది. 

ఆటో, రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్ షేర్లలో ప్రాఫిట్​బుకింగ్​ కారణంగా మార్కెట్లు పడిపోయాయి. సెన్సెక్స్ కంపెనీలలో టాటా మోటార్స్, మహీంద్రా అండ్​ మహీంద్రా, భారత్ ఎలక్ట్రానిక్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ట్రెంట్, సన్ ఫార్మా, పవర్ గ్రిడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎక్కువగా నష్టపోయాయి.  టైటాన్, ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), హెచ్​సీఎల్​ టెక్, టెక్ మహీంద్రా మాత్రం లాభపడిన వాటిలో ఉన్నాయి. 

కీలక సూచీలు ఇటీవల బాగా పెరగడం వల్ల, బుధవారం ప్రాఫిట్​బుకింగ్​ కనిపించిందని జియోజిత్ ఇన్వెస్ట్‌‌మెంట్స్ లిమిటెడ్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అన్నారు.  రెండో క్వార్టర్​ ఫలితాలు వస్తున్నాయి కాబట్టి ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉన్నారని చెప్పారు.  

సెక్టోరల్​  ఇండెక్స్​లు ఇలా..

సెక్టోరల్ సూచీలలో రియల్టీ 1.88 శాతం, పవర్ 1.49 శాతం, ఆటో 1.35 శాతం, యుటిలిటీస్ 1.29 శాతం పడిపోయాయి.  బీఎస్​ఈ ఫోకస్డ్ ఐటీ 1.67 శాతం, ఐటీ ఇండెక్స్ 1.50 శాతం, టెక్ 1.34 శాతం, కన్స్యూమర్ డ్యూరబుల్స్ 0.37 శాతం పెరిగాయి. బీఎస్​ఈ మిడ్​క్యాప్ సూచీ 0.74 శాతం, స్మాల్‌‌క్యాప్ సూచీ 0.42 శాతం తగ్గింది. బీఎస్​ఈలో మొత్తం 2,434 స్టాక్స్​ నష్టపోగా, 1,740 స్టాక్స్​ లాభపడ్డాయి. 156 స్టాక్స్​లో ఎటువంటి మార్పూ లేదు.  

ఎఫ్‌‌ఐఐలు మంగళవారం  రూ. 1,440.66 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. ఆసియా మార్కెట్లలో జపాన్ నిక్కీ 225 సూచీ, హాంకాంగ్ హాంగ్‌‌సెంగ్ సూచీ నష్టాలతో ముగిశాయి. చైనా, దక్షిణ కొరియా మార్కెట్లను సెలవుల కారణంగా మూసివేశారు. యూరప్ మార్కెట్లు లాభాలతో ట్రేడ్ అయ్యాయి. యూఎస్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. గ్లోబల్​ చమురు బెంచ్​మార్క్ బ్రెంట్ క్రూడ్ 1.16 శాతం పెరిగి 66.21 డాలర్లకు చేరింది.