ఢిల్లీలో తగ్గుతున్న వరదలు

ఢిల్లీలో తగ్గుతున్న వరదలు
  • శాంతించిన యమున.. నీటిమట్టం తగ్గుముఖం

న్యూఢిల్లీ: భారీ వర్షాలు, వరదలతో నానా అవస్థలు పడ్డ ఢిల్లీ ప్రజలకు కాస్త ఊరట లభించింది. శనివారం యమునా నదిలో నీటిమట్టం తగ్గుముఖం పట్టింది. రాజధానిని ముంచెత్తిన వరద నీళ్లు క్రమంగా తగ్గుతున్నాయి. ఢిల్లీలో భారీ వర్షాలు కూడా లేకపోవడంతో జనానికి ఉపశమనం లభించినట్లయింది. రాజధానిలో వరదల పరిస్థితిపై శనివారం డివిజనల్ కమిషనర్ అశ్వనీ కుమార్ మీడియాతో మాట్లాడారు. ‘‘ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో యమున ఉప్పొంగడంతో ఆయా ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. లోతట్టు ప్రాంతాల్లోని వేలాది మందిని ఖాళీ చేయించాం. 

అయితే, ఇప్పుడు పరిస్థితి మెరుగుపడుతోంది. యమునలో నీటి ప్రవాహం 3 రోజుల తర్వాత శుక్రవారం నుంచి నెమ్మదిగా తగ్గుతోంది” అని ఆయన తెలిపారు. ప్రజలు వరద నీళ్లలో ఈదేందుకు, సెల్ఫీలు తీసుకునేందుకు వెళ్లొద్దని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ శనివారం కూడా విజ్ఞప్తి చేశారు. 

వరద ఉధృతి ఇంకా కొనసాగుతోందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కాగా, యమునా నదిలో శనివారం ఉదయం కల్లా నీటి మట్టం 207.43 మీటర్లకు తగ్గిందని సెంట్రల్ వాటర్ కమిషన్ వెల్లడించింది. అయితే, ఇది డేంజర్ మార్క్ (205.33) కన్నా రెండు మీటర్లు ఎక్కువేనని తెలిపింది.

ఆఫీసర్, మంత్రుల మధ్య వాగ్వాదం 

సెంట్రల్ ఢిల్లీలోని సుప్రీంకోర్ట్, రాజ్ ఘాట్, ఐటీవో వంటి ప్రాంతాల్లో వరదకు కారణమైన డ్రెయిన్ నెంబర్ 12లో దెబ్బతిన్న ఫ్లో రెగ్యులేటర్ ను రిపేర్ చేసేందుకు సాయం చేయాలని ఎన్డీఆర్ఎఫ్​ సిబ్బంది శుక్రవారం కోరితే డివిజనల్ కమిషనర్, అధికారులు పట్టించుకోలేదంటూ ఢిల్లీ వాటర్ మినిస్టర్ సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. దీనిపై అశ్వనీ కుమార్ స్పందిస్తూ.. వరదలను కట్టడి చేసేందుకు నిరంతరం శ్రమిస్తున్న అధికారులపై ఇలా నిరాధారంగా, రాజకీయ ఆరోపణలు చేయడం సరికాదన్నారు. 

వరదల వెనక బీజేపీ కుట్ర: సౌరభ్ భరద్వాజ్

రాజధానిలో వరదల వెనక బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం, హర్యానా సర్కారు కలిసి చేసిన కుట్ర ఉందని ఢిల్లీ వాటర్ మినిస్టర్ సౌరభ్ భరద్వాజ్ శనివారం ఆరోపించారు. హర్యానాలోని హత్నికుండ్ బ్యారేజ్ నుంచి కావాలనే ఒక్కసారిగా నీటికి కిందకు వదలారని, అందుకే యమునా నది ఉప్పొంగి వరదలు వచ్చాయన్నారు. 

దీనిపై హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ స్పందిస్తూ.. హత్నికుండ్​ కేవలం బ్యారేజ్ మాత్రమేనని, పూర్తిస్థాయిలో నిండితే నీటిని తప్పనిసరిగా వదలాల్సిందేనని చెప్పారు. డ్యామ్​ అయితే నీటిని ఆపొచ్చు కానీ బ్యారేజ్​లో నీటిని ఓ పరిమితి మేర నిల్వ చేయడం మాత్రమే వీలవుతుందని చెప్పారు. 

ఢిల్లీలో మళ్లీ వాన

దేశ రాజధాని ఢిల్లీలో శనివారం సాయంత్రం మళ్లీ వర్షం కురిసింది. మూడు రోజులుగా వాన తెరిపివ్వడంతో జనజీవనం ఇప్పుడిప్పుడే కాస్త మెరుగుపడుతోంది. యమునా నదిలో వరద తగ్గుముఖం పడుతోంది. వీధుల్లో వరద తగ్గి రాకపోకలకు వీలవుతోంది. జనం కాస్త ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో మరోమారు వర్షం ముంచెత్తింది. తాజా వర్షం కారణంగా ఢిల్లీలో సాధారణ పరిస్థితులు నెలకొనడం ఇంకా ఆలస్యమవుతుందని చెప్పారు.

వరదలో రూ.కోటి విలువైన ఎద్దు

ఢిల్లీని ముంచెత్తిన వరదల్లో ఇండియాలోనే నెంబర్ 1 బుల్(ఎద్దు) "ప్రీతమ్" చిక్కుకుంది. ఈ ఎద్దు విలువ కోటి రూపాయలు. దీంతో ఎన్డీఆర్​ఎఫ్​టీమ్​ రంగంలోకి దిగి ఈ ఎద్దును కాపాడింది. ఈ ఎద్దుతో పాటు మరికొన్ని పశువులను కూడా వరదల్లో నుంచి కాపాడినట్లు ఎన్డీఆర్ఎఫ్​ టీమ్​ తెలిపింది.