
ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్ల సమ్మెతో హైదరాబాద్‌లోని పెట్రోల్ బంక్‌లకు వాహనదారులు పోటెత్తారు. బంకుల వద్ద వాహనదారులు బారులు తీరడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ముఖ్యంగా ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే ఉద్యోగులకు అయితే చుక్కలు కనిపిస్తున్నాయి. కొద్దీ దూరం వెళ్లాలన్న గంటల సమయం పడుతుంది.
ఇక డెలివరీ బాయ్స్ పరిస్థితి అయితే అయ్యో పాపం అనేలా ఉంది. ఒకవైపు ఫుడ్ ఆర్డర్లు రావడం.. మరోవైపు ట్రాఫిక్ సమస్యతో అక్కడే చిక్కుకుపోయారు. దీంతో డెలివరీ సంస్థలు కూడా ఆర్డర్లును సైతం తీసుకోవడం లేదని తెలుస్తోంది.
మరోవైపు ఆయిల్ ట్యాంకర్ల యజమానులు చేపట్టిన ధర్నాను విరమించారు. దీంతో ట్యాంకర్లు యథావిధిగా నడుస్తున్నాయి. ఉదయం నుంచి ఆయిల్ ట్యాంకర్ల యజమానులు ధర్నాకు దిగడంతో పలు పెట్రోల్ బంకుల వద్ద ఎంట్రీ క్లోజ్ అంటూ నో స్టాక్ బోర్డులు కనిపించాయి. దీంతో వాహనదారులు బంకుల వద్ద క్యూ కట్టారు. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ అయిపోవడంతో.. నగరంలో పలు చోట్ల బంకుల యజమానులు నో స్టాక్ బోర్డులు పెట్టారు.