జహీరాబాద్​ మున్సిపాలిటీకి నిలిచిన రూ.50 కోట్ల నిధులు

జహీరాబాద్​ మున్సిపాలిటీకి నిలిచిన రూ.50 కోట్ల నిధులు

సంగారెడ్డి/జహీరాబాద్, వెలుగు : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపాలిటీకి మంజూరైన రూ.50 కోట్ల స్పెషల్ డెవలప్​మెంట్ ఫండ్స్ (ఎస్ డీఎఫ్)కు బ్రేక్ పడింది. పనుల ప్రతిపాదనల్లో స్పష్టత లేదని శాంక్షన్ చేయకుండా ప్రభుత్వం పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. ఏడు నెలల కింద సీఎం కేసీఆర్ నారాయణఖేడ్ వేదికగా జిల్లాలోని ఎనిమిది మున్సిపాలిటీలు, 647 గ్రామ పంచాయతీలకు స్పెషల్ ఫండ్స్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో సంగారెడ్డి, జహీరాబాద్ మున్సిపాలిటీలకు ఒక్కోదానికి రూ.50 కోట్లు, మిగతా బల్దియాలకు ఒక్కోదానికి రూ.25 కోట్లు, ప్రతి పంచాయతీకి రూ.20 లక్షల చొప్పున సీఎం మంజూరు చేశారు. అయితే మిగిలిన మున్సిపాలిటీల్లో ప్రతిపాదనలకు ముందే ఫండ్స్ రిలీజ్ అయినట్టు ఆఫీసర్లు చెబుతున్నా క్షేత్రస్థాయిలో కొంత ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. 

జహీరాబాద్​లో స్పష్టత లేక.. 

జహీరాబాద్ ​మున్సిపాలిటీలో ఎస్  డీఎఫ్ రూ.50 కోట్లతో చేపట్టే వివిధ అభివృద్ధి పనుల వివరాలను అధికారులు స్పష్టంగా పేర్కొనకపోవడంతోనే నిధులు శాంక్షన్ చేయడంలేదనే 
విమర్శలు వ్యక్తమయ్యాయి. తర్వాత మళ్లీ ఆయా పనుల సమగ్ర వివరాలను స్పష్టంగా ఇవ్వాలని ప్రభుత్వం అధికారులను కోరింది. కానీ ప్రభుత్వం అడిగి ఆరు నెలలు దాటినా అధికారులు మాత్రం ఎస్టిమేషన్స్ ఇప్పటికీ పూర్తి చేయలేకపోతున్నారు. 

పాలకవర్గంలేక.. ఎమ్మెల్యే సిఫార్సుతో...

జహీరాబాద్ మున్సిపాలిటీకి పాలకవర్గం లేకపోవడంతో స్థానిక ఎమ్మెల్యే మాణిక్ రావు సిఫార్సు మేరకు డెవలప్​మెంట్ పనులపై ఎస్టిమేషన్స్ తయారు చేయించినట్టు లీడర్లు చెబుతున్నారు. మున్సిపాలిటీలో చుట్టుపక్కల గ్రామాల విలీనం నేపథ్యంలో అప్పట్లో తలెత్తిన వివాదం కారణంగా సమస్య కోర్టు పరిధిలో ఉండిపోయింది. దాంతో 2018లో జహీరాబాద్ మున్సిపాలిటీకి ఎన్నికలు జరగలేదు. మూడేళ్లుగా అక్కడ స్పెషల్ ఆఫీసర్ పాలన కొనసాగుతోంది. మున్సిపాలిటీలోని సమస్యలను ఎమ్మెల్యే మాణిక్ రావు చూసుకుంటూ టెక్నికల్ గా అధికారుల సపోర్ట్ తో నడిపిస్తున్నారు. అయితే నాలుగు నెలల కింద కోర్టు పరిధిలో విలీన సమస్య పరిష్కారం కావడంతో ప్రభుత్వం జహీరాబాద్ మున్సిపల్ ఎన్నికలపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే పట్టణంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు టీఆర్ఎస్ శ్రేణులు ఉత్సాహ పడుతుండగా, ఎస్టిమేషన్ పనులు త్వరగా పూర్తవుతాయా? లేదా?  అనే సందేహాలు కలుగుతున్నాయి. పైగా ఆశావహులు ఇప్పటి నుంచే వార్డుల్లో పరోక్షంగా ప్రచారం చేపడుతున్నారు.