ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు
  • పేరుకే పెద్ద మున్సిపాలిటీ...  డంపింగ్​ యార్డూ దిక్కులేదు
  • మంచిర్యాలలో వెంటాడుతున్న చెత్త సమస్య 
  • తాత్కాలిక యార్డులో పేరుకుపోతున్న కుప్పలు
  • చెత్తను కాల్చడంతో పట్టణాన్ని కమ్మేస్తున్న పొగ 
  • దుర్వాసనతో ఊపిరాడక పట్టణ ప్రజల తిప్పలు 
  • ఏండ్లు గడుస్తున్నా శాశ్వత పరిష్కారం కరువు 

మంచిర్యాల, వెలుగు:మంచిర్యాల మున్సిపాలిటీని చెత్త సమస్య వెంటాడుతోంది. పేరుకు పెద్ద మున్సిపల్​.. జిల్లా కేంద్రం అయినప్పటికీ డంపింగ్​ యార్డు లేకపోవడం ప్రజలకు శాపంగా మారింది. స్థానిక అండాళమ్మ కాలనీలోని తాత్కాలిక యార్డే దిక్కవుతోంది. ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు పట్టించుకోకపోవడంతో జనం ఇబ్బంది పడుతున్నారు. నిత్యం చెత్త కుప్పలను కాల్చడంతో  పొగ కమ్మేస్తోంది. దుర్వాసనతో ఊపిరాడక రోగాల బారిన పడుతున్నామని పరిసర కాలనీల ప్రజలు వాపోతున్నారు.  

1.10 లక్షల జనం.. 46 టన్నుల చెత్త.. 

పట్టణ ప్రస్తుత జనాభా లక్షా 10 వేలు. ఈ సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు పట్టణానికి వచ్చి స్థిరపడుతున్నారు. ఇలా జనాభా పెరుగుతున్న కొద్దీ అదే స్థాయిలో చెత్త సమస్య తలెత్తుతోంది. రెండేండ్ల కిందట మంచిర్యాల మున్సిపాలిటీలో సింగిల్​ యూజ్​ ప్లాస్టిక్​ను బ్యాన్​ చేశారు. కానీ ప్రజల్లో అవగాహన కల్పించకపోవడం, అధికారుల నిర్లక్ష్యం వల్ల అది కాస్తా ఫెయిలైంది. ప్రస్తుతం రోజుకు 46 మెట్రిక్​ టన్నుల చెత్త వెలువడుతోంది. దీనిలో 44  మెట్రిక్​ టన్నులను సేకరిస్తున్నట్టు మున్సిపల్​ అధికారులు చెప్తున్నారు.  

తాత్కాలిక యార్డే దిక్కు... 

కొన్నేండ్ల కిందట పట్టణ శివారులోని అండాళమ్మ కాలనీలో తాత్కాలిక డంపింగ్​ యార్డును ఏర్పాటు చేశారు. రోజూ పట్టణంలో సేకరిస్తున్న చెత్తను యార్డుకు తరలిస్తున్నారు. అక్కడ స్థలం చాలక కొద్ది రోజులు ఏకంగా గోదావరి ఒడ్డునే డంప్ చేశారు. ఆ చెత్తంతా గోదావరిలో కలిసి నీళ్లు కలుషితం అవుతున్నాయని విమర్శలు రావడంతో ఇప్పుడు అటువైపు మానేశారు. దీంతో తాత్కాలిక యార్డులో చెత్త కుప్పలు పేరుకుపోతున్నాయి. రెండు సంవత్సరాల కిందట తడిపొడి చెత్తను, ప్లాస్టిక్​ను వేరు చేసే ప్రక్రియను ప్రారంభించారు. చెత్తతో వర్మి కంపోస్ట్​ తయారు చేయగా, ప్లాస్టిక్​ను వేరుచేసి అమ్మారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఇది ఆగిపోయింది.  

పొగతో రోగాల బారిన ప్రజలు...  

తాత్కాలిక యార్డులో పోగైన చెత్తకు రోజూ ఉదయం, సాయంత్రం నిప్పు పెడుతున్నారు. దీంతో పెద్ద ఎత్తున పొగ లేస్తోంది. పక్కనున్న అండాళమ్మ కాలనీతో పాటు గ్రీన్​సిటీ, పాత మంచిర్యాల, పవర్​సిటీ, లక్ష్మీనగర్​, వికాస్​నగర్​, బైపాస్​ రోడ్డు ఏరియాలను దట్టమైన పొగ కమ్మేస్తోంది. ప్లాస్టిక్​ కవర్లు, బాటిళ్లు, రబ్బర్లు, ఇతర వ్యర్థాలను కాల్చడం వల్ల పొగలో విషపూరితమైన రసాయనాలు విడుదల అవుతున్నాయి. వీటితో గాలి పూర్తిగా కలుషితం అవుతోంది. దుర్వాసనతో ఊపిరాడక ప్రజలు అవస్థలు పడుతున్నారు. దీంతో శ్వాస సంబంధ, క్యాన్సర్​ వంటి రోగాలు వస్తాయని, మెదడుపై తీవ్రమైన దుష్ర్పభావం చూపుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.  

శాశ్వత పరిష్కారం ఎప్పుడు? 

మంచిర్యాలలో శాశ్వత డంపింగ్​ యార్డు ఏర్పాటు చేయడంలో ఎమ్మెల్యే, మున్సిపల్​ పాలకవర్గం, అధికార యంత్రాంగం విఫలమైంది. పట్టణం చుట్టుపక్కల వందల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నప్పటికీ పట్టుమని 10 ఎకరాలు కేటాయించలేకపోతున్నారు. గతంలో వేంపల్లిలో 25 ఎకరాలు కేటాయించగా స్థానికులు కోర్టుకు వెళ్లడంతో బ్రేక్​ పడింది. తర్వాత నస్పూర్​లో 8 ఎకరాల సింగరేణి భూమిని కేటాయించారు. అక్కడ చెత్త డంప్​ చేయొద్దని స్థానికులు మున్సిపల్​ వాహనాలను అడ్డుకుని ఆందోళన చేశారు. అనంతరం ఏసీసీ నుంచి బొక్కలగుట్ట వెళ్లే రోడ్డులో 8 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారు. గతంలో అక్కడ బండరాయి తీయడంతో పెద్ద గోతులు ఏర్పడి నీళ్లు నిండుతున్నాయి. ఈ రెండు స్థలాలు కూడా డంపింగ్​ యార్డుకు అనుకూలంగా లేవు. చెత్త సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలంటే మరో చోట అనువైన స్థలాన్ని కేటాయించాల్సిన అవసరముంది

సత్యదేవుని సన్నిధికి తరలివచ్చిన భక్తులు 

దండేపల్లి, వెలుగు: కార్తీకమాస ఉత్సవాలలో భాగంగా కార్తీక శుద్ధ త్రయోదశిని పురస్కరించుకొని మండలంలోని గూడెం సత్యనారాయణ స్వామి దేవస్థానానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి క్యూ లైన్లలో బారులు తీరి స్వామి వారిని దర్శించుకున్నారు. మహిళలు కార్తీకదీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. కొందరు నదిలో దీపాలు వెలిగించి ప్రవాహానికి వదిలారు. స్వామివారి వ్రత మంటపాలలో దంపతులు సామూహిక  సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆచరించారు. మరో అన్నవరంగా పేరుగాంచిన గూడెం గుట్టకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్​గఢ్​ రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో గూడెం గుట్ట జనసంద్రంగా మారింది. ఈ నెల 8న కార్తీక పౌర్ణమి ఉన్నప్పటికీ చంద్రగ్రహణం ఉన్నందున పౌర్ణమికి ముందే భక్తులు స్వామివారి దర్శనానికి వస్తున్నారు. భక్తుల కోసం ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్ తాగునీరు, నిత్యాన్నదానం, విద్యుత్ సౌకర్యం, వ్రతాలు ఆచరించడానికి ప్రత్యేక మంటపాలను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా మంచిర్యాల ఏసీపీ తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో లక్సెట్టిపేట సీఐ కరీముల్లాఖాన్, దండేపల్లి ఎస్సై సాంబమూర్తి సర్కిల్ పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. 

టీఆర్ఎస్ ప్రజాస్వామ్యన్ని ఖూనీ చేసి గెలిచింది

ఆదిలాబాద్,వెలుగు: మునుగోడు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రజాస్వామ్యన్ని ఖూనీ చేసి గెలిచిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ ఆరోపించారు. ఆదివారం ఆయన స్థానికంగా మీడియాతో మాట్లాడారు. ఓటుకు రూ.10 వేలు, గ్రామానికి రూ. 30 లక్షలు ఖర్చు చేసి దౌర్జన్యంతో ఓట్లు వేయించుకున్నారని మండిపడ్డారు. బీజేపీ కార్యకర్తలు, లీడర్లు ప్రతికూల పరిస్థితుల్లో టీఆర్ఎస్ అరాచకాలను తిప్పికొట్టారని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న మునుగొడులో యాదవులకు నగదు, దళితులకు దళిత బంధు ఇప్పించారని, ఆదిలాబాద్ లో కూడా ఇప్పించాలని కోరారు. లేదంటే పోరాటం చేస్తామన్నారు.  సమావేశంలో లీడర్లు ఆదినాథ్, దినేశ్​ మాటోలియా, లోక ప్రవీణ్ రెడ్డి, నరేశ్, భీమ్ సేనారెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు.

దేవాలయాల అభివృద్ధిని మరిచిన్రు

ఆదిలాబాద్​టౌన్,వెలుగు: ఎమ్మెల్యే జోగు రామన్న, మంత్రి ఇంద్రకరణ్​రెడ్డిలు ఆలయాల ఆస్తులు, ఆదాయంపైనే దృష్టి పెట్టారు. కానీ.. వాటి అభివృద్ధిని పట్టించుకోవడంలేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్​ శంకర్ ఫైర్​అయ్యారు. జైనథ్​ సూర్యనారాయణ స్వామి దేవాలయ అభివృద్ధి కోసం భక్తులు చేపట్టిన రిలేనిరాహార దీక్షకు ఆయన హాజరయ్యారు. ఎన్నికల టైంలో సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని ఒట్టేసి మరి చెప్పారన్నారు. దీక్షలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వకులాభరణం ఆదినాథ్, లీడర్లు రాకేశ్​రెడ్డి, రమేశ్​, ప్రతాప్, లక్ష్మన్న, లింగారెడ్డి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

  • రవీనా చదువుకు అయ్యే ఖర్చును భరిస్తా..  
  • శ్రీభ్రమర టౌన్​షిప్ అధినేత గల్లా రామచంద్రరావు 

చెన్నూర్,వెలుగు:పట్టుదల ఉంటే ఏదైనా‌‌ సాధ్యమే అని నిరూపించిన కోటపల్లి మండలం అన్నారం గ్రామానికి చెందిన కోట రవీనా ఎంబీబీఎస్​ చదువుకు అయ్యే ఖర్చును భరిస్తానని గుంటూరుకు చెందిన శ్రీభమర టౌన్​షిప్​ ప్రైవేట్​ లిమిటెడ్​ చైర్మన్​ గల్లా రామచంద్రారావు అన్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన రవీనా నీట్​లో ప్రతిభ కనబర్చి మహబూబ్​నగర్​లోని గవర్నమెంట్​ మెడికల్​ కాలేజీలో సీటు సాధించింది. అడ్మిషన్​కు అవసరమైన ఫీజు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్న విషయాన్ని పత్రికల ద్వారా తెలుసుకున్న రామచంద్రారావు ఆదివారం ఇక్కడికి వచ్చారు. రవీనాకు, తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి చదువుకు అయ్యే ఖర్చును తాను భరిస్తానని హామీ ఇచ్చారు. రవీనా ఎంబీబీఎస్​ పూర్తి చేసి పేదలకు వైద్యసేవలందించాలని, సమాజానికి ఆదర్శంగా నిలువాలని ఆయన ఆకాంక్షించారు.  

హక్కుల సాధన కోసం పోరాటం

జన్నారం,వెలుగు: గౌడ కులస్తుల హక్కుల సాధన కోసం పోరాటం చేస్తామని గౌడ జనహక్కుల పోరాట సమితి(మోకుదెబ్బ) నేషనల్ ప్రెసిడెంట్ అమరవేని నర్సాగౌడ్ తెలిపారు. ఆదివారం మండల కేంద్రంలో  నిర్వహించిన గౌడ జనహక్కుల పోరాట సమితి రెండో మహాసభలో ఆయన మాట్లాడారు. ఏజెన్సీల గీత కార్మికులకు లైసెన్సులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. మోకుదెబ్బ ఏ రాజకీయ పార్టీకి తొత్తుగా పనిచేయదన్నారు. కార్యక్రమంలో మోకుదెబ్బ స్టేట్ సెక్రటరీ కేసరి అంజనేయులుగౌడ్, స్టేట్ సెక్రటరీ మొండిగౌడ్, రాష్ర్ట అధికార ప్రతినిధి బాలసాని నారయణగౌడ్, స్టేట్ లీడర్లు రంగు శ్రీనివాస్ గౌడ్, రమేశ్​చందర్ గౌడ్, జిల్లా ప్రెసిడెంట్ బాలసాని శ్రీనివాస్ గౌడ్, డివిజన్ ప్రెసిడెంట్ వొల్లాల నర్సాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మండల కార్యవర్గం ఎన్నిక

జన్నారం మండల తెలంగాణ జనహక్కుల పోరాట సమితి(మోకుదెబ్బ) కు నూతన కార్యవర్గాన్ని సంఘం నేషనల్ ప్రెసిడెంట్ అమరవేణి నర్సాగౌడ్ ప్రకటించారు. గౌరవ అధ్యక్షుడిగా బట్టల నర్సాగౌడ్, మండల ప్రెసిడెంట్ గా బట్టల లచ్చాగౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా బూసనవేని గంగాధర్ గౌడ్, వైస్ ప్రెసిడెంట్లుగా గర్రెపల్లి శంకర్ గౌడ్, ఎనుగంటి రాజాగౌడ్, శ్రీనివాస్ గౌడ్, అంజగౌడ్, మోహన్ గౌడ్, జనరల్ సెక్రటరీగా పొడేటి శ్రీనివాస్ గౌడ్, సెక్రటరీలుగా కాసారపు సత్యగౌడ్, వెంకన్నగౌడ్, చంద్రగౌడ్, శంకర్ గౌడ్, కనకయ్యగౌడ్, ట్రెజరర్​గా కోట రవిగౌడ్, అర్గనైజింగ్ సెక్రెటరీలుగా పుల్ల శ్రీనివాస్ గౌడ్, రవిగౌడ్, ముఖ్య సలహదారులుగా కైరం భీమగౌడ్, వొల్లాల నర్సాగౌడ్, నేరెళ్ల శ్రీనివాస్ గౌడ్ ఎన్నికయ్యారు.

కరెంట్ షాక్​తో సింగరేణి కార్మికుడు మృతి

రామకృష్ణాపూర్,వెలుగు: మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్​ సింగరేణి సబ్ స్టేషన్ పరిధిలోని ఆర్కే1ఏ బొగ్గు గని సమీపంలో 3.3 కేవీ పవర్​లైన్ పై రిపేర్ పనులు చేస్తూ షాక్​కు గురై సింగరేణి కాంట్రాక్ట్​ కార్మికుడు పీట్ల గోపాల్​(26) మృతిచెందాడు.  ఆదివారం సాయంత్రం పవర్​లైన్ పవర్ సరఫరా నిలిపివేసిన తర్వాత  ఆర్కే1ఎ గని సమీపంలో పవర్​లైన్ ఇన్సూలేటర్లు, డిస్క్​లు తొలగించే పనులను ఆరుగురితో కూడిన కాంట్రాక్ట్​కార్మికుల టీం చేపట్టింది. కాంట్రాక్ట్​ కార్మికుడు గోపాల్ పవర్ పోల్ పై ఉండి పనులు చేపట్టాడు.  పనిస్థలంలో సింగరేణి యాక్టింగ్ సూపర్​వైజర్ భారతీశ్రీనివాస్, కాంట్రాక్ట్​ సూపర్​ వైజర్​ పర్యవేక్షణ చేపట్టారు. పనులు పూర్తయ్యాయని భావించిన సూపర్​వైజర్లు కరంటు ఆన్​ చేయాలని మందమర్రిలోని సింగరేణి 132 కేవీ సబ్​స్టేషన్ కు సమాచారం ఇచ్చారు.  పవర్ ఆన్ కావడంతో పోల్​పై ఉన్న గోపాల్​ షాక్​కు గురై కిందపడి మృతిచెందాడు. ఏఐటీయూసీ, టీబీజీకేఎస్​, ఇప్టూ, టీఎన్టీయూసీ, సీఐటీయూ  కార్మిక సంఘాల లీడర్లు ఎండీ అక్బర్​అలీ, ఇప్పకాయల లింగయ్య,  సలెంద్ర సత్యనారాయణ, భీమనాధుని సుదర్శనం, బడికెల సంపత్, డి.బ్రహ్మానందం, సంజయ్​కుమార్, ఎస్​.వెంకటస్వామి  ఘటన స్థలానికి చేరుకొని ఆందోళన చేపట్టారు. ఆదివారంసెలవు దినం ప్లేడే ఇవ్వాల్సి వస్తుందని భావించి సింగరేణి ఆఫీసర్లు కాంట్రాక్ట్​ కార్మికులతో పవర్​లైన్​ రిపేర్లు చేయించారని, కాంట్రాక్ట్​ కార్మికుడు గోపాల్ మృతికి యాజమాన్యం బాధ్యత వహించాలని డిమాండ్​చేశారు.  మృతిచెందిన కార్మికుడు గోపాల్​ కుటుంబానికి రూ.కోటి పరిహారం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు. కాంట్రాక్టర్ రవీందర్​రెడ్డి​, సింగరేణి కంపెనీ ద్వారా వచ్చే నష్టపరిహారం అందిస్తామని  హామీ ఇచ్చారు. దీంతో కార్మిక సంఘాలు  ఆందోళన విరమించాయి. సంఘటన స్థలాన్ని ఏరియా జీఎం చింతల శ్రీనివాస్, ఇంజినీర్​ కృష్ణారెడ్డి తదితరులు సందర్శించారు. మృతుడు గోపాల్​ఆసిఫాబాద్​ జిల్లా కెరమెరి మండలం తిర్యాణి గ్రామానికి చెందినవాడు.

దహెగాంలో కార్తీక సందడి

దహెగాం,వెలుగు: కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఆదివారం మండలంలోని వివిధ ఆలయాల్లో దీపారాదన, ఆలయ ప్రదక్షిణలు, నగర సంకీర్తన, కార్తీక స్నానాలు, కాగడ హారతి, నక్షత్ర హారతి చేపట్టారు. ఐనంలోని శివాలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు, దహెగాం లగ్గాం, చిన్నరాస్పల్లి , కొంచవెల్లి, హత్ని, గిరవెల్లి, ఖర్జి, బీబ్రా గ్రామాల భక్తులు పెద్దవాగులో కార్తీక స్నానాలు చేసి సైకత లింగాన్ని అభిషేకించారు.  

ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయొద్దు

కాగజ్ నగర్,వెలుగు: ఆరోగ్యం విషయంలో ఎవరూ నిర్లక్ష్యం చేయొద్దని ఎస్పీ సురేశ్​కుమార్​సూచించారు. మావోయిస్టులతో ఎవరికీ లాభంలేదన్నారు. ఆదివారం బెజ్జూర్ మండలం సోమినిలో పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరానికి ఎస్పీ హాజరయ్యారు. తాత్కాలిక ప్రయోజనాల కన్నా.. శాశ్వత వ్యవస్థను ప్రజలు నమ్ముకోవాలన్నారు. మావోయిస్టుల కల్లిబొల్లి మాటలకు యువత ఆకర్శితులై జీవితాలు నాశనం చేసుకోవదన్నారు. మెడికల్​క్యాంప్​నిర్వహించిన సీఐ స్వామి, బెజ్జుర్ ఎస్సై వెంకటేశ్, సహకరించిన​ వైద్య సిబ్బందికి ఎస్పీ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం వృద్ధులకు 500 దుప్పట్లు,  యువత కోసం 10 వాలీబాల్ కిట్లు,  క్రికెట్ కిట్ , 150 మంది విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లు, పెన్నులు పంపిణీ చేశారు. శిబిరానికి సర్పంచ్ ఎలాది శారద, జడ్పీటీసీ పుష్పలత, డాక్టర్లు అర్వింద్​చేతన్, చౌహాన్, కుమారస్వామి గౌతమ్, సిరిపురం శ్రీనివాస్, గౌతమ్ మహేశ్, శ్రీధర్ బాబు, ఎస్సైలు ప్రవీణ్ కుమార్, గుంపుల విజయ్, రవికుమార్, సాగర్ తదితరులు వచ్చారు.