ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

అధికారులు.. కండువా లేని కార్యకర్తలు

వేములవాడ, వెలుగు : సిరిసిల్ల మినిస్టర్​ కేటీఆర్ ​జిల్లా కావడంతో అధికారులు కండువా లేని బీఆర్ఎస్​కార్యకర్తలుగా పని చేస్తున్నారని బీజేపీ జిల్లా సిరిసిల్ల  అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ  విమర్శించారు. మంగళవారం వేములవాడలోని భీమేశ్వర్ గార్డెన్స్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో అధికార పార్టీ తరుపున పోటీ చేస్తే చాలు.. అధికారులే వారిని పాస్​ చేస్తారని దుయ్యబట్టారు. సెస్ ఎన్నికల్లో​ బీఆర్ఎస్​ క్లీన్ స్వీప్​ అంటున్నారని కానీ అన్ని స్థానాల్లో బీజేపీ గట్టి పోటీ ఇచ్చిందన్నారు. బీజేపీ గెలిచిన రెండు స్థానాలను బలవంతంగా గుంజుకున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మహేశ్, ఎంపీపీ మల్లేశం, అధికార ప్రతి నిధి గోపు బాలరాజు తదితరులు పాల్లొన్నారు.  

సెస్ ఫుల్ ఫాం చెబితే రాజీనామా చేస్తా.. బండికి రసమయి సవాల్​   

రాజన్న సిరిసిల్ల,వెలుగు: బండి సంజయ్ సెస్ ఫుల్ ఫాం చెబితే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సవాల్​విసిరారు. మంగళవారం సెస్ చైర్మన్ ఎన్నికలో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడారు. సంజయ్​కు రైతుల గురించి, సెస్ గురించి తెలియదని, సెస్ ఎన్నికల్లో బండి సంజయ్ ఐదు సీట్లు గెలిచినట్టు కలగన్నారన్నారు. యువతను రెచ్చగొట్టుడు తప్ప బండి చేసేదేమీలేదన్నారు. కరీంనగర్​ఎంపీగా ఉండి కేంద్రం నుంచి నియోజక వర్గానికి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదని ఆరోపించారు. సమావేశంలో జెడ్పీ చైర్ పర్సన్ అరుణ, చీటి నర్సింగ రావు, చిక్కాల రామారావు, తోట ఆగయ్య  పాల్గొన్నారు. 

పనులు వేగంగా పూర్తి చేయాలి: అడిషనల్ ​కలెక్టర్ మకరంద​  

కోరుట్ల, వెలుగు: కోరుట్ల మున్సిపాలిటీలో చేపడుతున్న డెవలప్​మెంట్​పనులు వేగంగా పూర్తి చేయాలని జగిత్యాల అడిషనల్ కలెక్టర్ మకరంద అధికారులను ఆదేశించారు. మంగళవారం కోరుట్లలో ఆయన పర్యటించారు. తడి, పొడి చెత్త వేరుచేసే విధానాన్ని, మురుగు కాల్వల శుభ్రత తీరును  పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. డంపింగ్ యార్డ్, డీఆర్​సీసీ సెంటర్, కల్లూర్ రోడ్ ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్, నర్సరీలను పరిశీలించారు. అనంతరం మున్సిపల్ ఆఫీస్​లో సిబ్బందితో సమీక్ష జరిపారు. కార్యక్రమంలో కమిషనర్ అయాజ్, డీటీసీపీవీ శ్రీనివాస్, ఏఈ లక్ష్మి, టీపీఎస్ రమ్య, మేనేజర్ శ్రీనివాస్, ఆర్వో తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

నరేందర్ రెడ్డికి జ్యువెల్ ఆఫ్ ఇండియా అవార్డు

కరీంనగర్ టౌన్,వెలుగు: అల్ఫోర్స్ చైర్మన్ నరేందర్ రెడ్డి జ్యువెల్ ఆఫ్ ఇండియా అవార్డుకు ఎంపికైనట్లు ఎకనామిక్ గ్రోత్ ఫౌండేషన్ సిబ్బంది తెలిపారు. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన శిఖరాగ్ర సమావేశాల్లో ఆయనకు అవార్డును అందించారు. మంగళవారం స్థానిక కొత్తపల్లిలోని అల్ఫోర్స్ స్కూల్ లో టీచర్లు ఆయనకు బొకే ఇచ్చి సన్మానించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్, టీచర్లు, స్టూడెంట్లు తదితరులు పాల్గొన్నారు. 

ధరణితో ప్రశాంతత కరువు

కరీంనగర్ టౌన్, వెలుగు: ధరణి పోర్టల్ తో పల్లెల్లోని రైతులకు ప్రశాంతత కరువైందని బీజేపీ కరీంనగర్, జగిత్యాల జిల్లాధ్యక్షులు కృష్ణారెడ్డి, సత్యనారాయణ రావు ఆరోపించారు. మంగళవారం రైతు సమస్యల పరిష్కారం కోసం  బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ఎదుట భారీ నిరసన దీక్ష చేశారు. ఈ సందర్భంగా  కలెక్టరేట్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రైతులకు మేలు చేయని వాళ్లు బీఆర్ఎస్ పేరుతో దేశరైతులకు ఏం మేలు చేస్తారన్నారు. తమది రైతు సర్కారని చెప్పుకునే కేసీఆర్ రుణమాఫీ ఎందుకు చేయడంలేదని ప్రశ్నించారు. రైతును రాజును చేయాలని లక్ష్యంతో మోడీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఫసల్ బీమాను రాష్ట్రంలో అమలు చేయకుండా రైతుల నోట్లో మట్టికొడుతోందని ఆరోపించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేశం, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షులు జయశ్రీ, కార్పొరేటర్ జితేందర్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు రాజిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

తక్షణమే రైతు రుణమాఫీ చేయాలి

జగిత్యాల:  లక్షలోపు ఉన్న రైతు రుణాలను తక్షణమే మాఫీ చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎం.సత్యనారాయణ రావు అన్నారు. జగిత్యాల కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన రైతు దీక్షలో ఆయన మాట్లాడారు. కేవలం రూ.50 వేల లోపు రైతు మాఫీ చేసి సర్కార్ చేతులు దులుపుకుందని విమర్శించారు. ధరణి పోర్టల్ తో రైతు సమస్యలు మరింత పెరిగాయన్నారు. కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ నేత తిరుపతి రెడ్డి, నవీన్ రావు, పట్టణాధ్యక్షుడు అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 

ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఎన్నికలు..

కోనరావుపేట:సెస్ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి పూర్తిగా విరుద్ధంగా జరిగాయని బీజేపీ జిల్లా కార్యదర్శి గోపాడి సురేందర్ రావు ఆరోపించారు. మంగళవారం కోనరావుపేటలో మండలాధ్యక్షుడు రామచంద్రంతో కలిసి మాట్లాడారు. బీఆర్ఎస్ నేతల కనుసన్నల్లో సెస్ ఎన్నికల కౌంటింగ్ జరిగిందన్నారు. కౌంటింగ్ లో వేములవాడ రూరల్, చందుర్తి బీజేపీ అభ్యర్థులు మొదట గెలిచారని ప్రకటించిన ఎన్నికల అధికారులు అధికార పార్టీ నేతలు చెప్పగానే రీ కౌంటింగ్ పేరుతో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారని ప్రకటించడం వారి అధికార దుర్వినియోగానికి నిదర్శనమన్నారు. కార్యక్రమంలో బీజెవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు బాలాజీ, మండల ప్రధాన కార్యదర్శులు రవి,  తిరుపతి, నాయకులు పాల్గొన్నారు. 

గెలుపు బలుపు కాదు.. వాపు మాత్రమే..

కరీంనగర్ టౌన్: సెస్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడారు. సెస్ ఎన్నికల్లో గెలుపును చూసి సంబరపడిపోవద్దని, అది  బలుపు కాదు.. వాపు అని విమర్శించారు. సర్పంచుల అధికారాలను ప్రభుత్వం కాలరాస్తోందని మండిపడ్డారు. 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులను సర్పంచులకు తెలియకుండా డిజిటల్ కీ ద్వారా దారి మళ్లించడం క్రిమినల్ చర్య అని స్పష్టం చేశారు. ఈ అంశంపై కాంగ్రెస్ ఆధ్వర్యంలో కోర్టు ద్వారా న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో పట్టణాధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జగిత్యాల జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ లీడర్లు పాల్గొన్నారు.

వీర్నపల్లి : సెస్​ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని బీజేపీ మండలాధ్యక్షుడు జి.దేవేందర్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం వీర్నపల్లి మండల కేంద్రంలో బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసి నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. కార్యక్రమంలో బీజేవైఎం మండలాధ్యక్షుడు అజయ్, జిల్లా అధికార ప్రతినిధి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. 

పీహెచ్ సీ ని పరిశీలించిన కేంద్ర బృందం

కోనరావుపేట,వెలుగు : స్థానిక పీహెచ్​సీని ఎన్ క్వాస్ (నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్)సెంట్రల్ టీమ్ సభ్యులు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా దేవేంద్ర కుమార్ బిటోరియా, అభిషేక్ సుభాశ్ పీహెచ్​సీ పరిధిలో నిర్వహించే జాతీయ కార్యక్రమాల గురించి సిబ్బందికి సూచనలు సలహాలు ఇచ్చారు. అనంతరం రికార్డులు పరిశీలించారు. కార్యక్రమంలో డీఎంహెచ్​ఓ సుమన్ మోహన్ రావు, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ మహేశ్, డీపీఓ ఉమ, జిల్లా క్వాలిటీ అస్యూరెన్స్ మేనేజర్ విద్యాసాగర్, మండల వైద్యాధికారి చిరంజీవి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. 

బీజేపీలోకి కాంగ్రెస్ లీడర్

సుల్తానాబాద్, వెలుగు: మండలంలోని  మియాపూర్ వార్డ్ మెంబర్ కె. శ్రీనివాస్ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి సమక్షంలో బీజేపీలో చేరారు. బీజేపీ లీడర్ సురేశ్​రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం పలువురు కార్యకర్తలతో కలిసి హైదరాబాద్ లో పార్టీలో చేరినట్టు వెల్లడించారు. 

సింగరేణి లేకుండా చేసేందుకు సీఎం కుట్ర: రాజ్‌‌‌‌ ఠాకూర్‌‌‌‌

గోదావరిఖని, వెలుగు : సింగరేణి సంస్థను నామరూపాలు లేకుండా చేసేందుకు రాష్ట్రంలో కేసీఆర్‌‌‌‌ ప్రభుత్వం కుట్ర చేస్తోందని కాంగ్రెస్ జిల్లాధ్యక్షుడు ఎంఎస్‌‌‌‌ రాజ్ ఠాకూర్ ఆరోపించారు. మంగళవారం గోదావరిఖని‌‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తాడిచర్ల క్యాప్టివ్‌‌‌‌ కోల్‌‌‌‌ బ్లాక్‌‌‌‌ను జెన్‌‌‌‌కో సంస్థకు అప్పగించగా, కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ప్రైవేటు సంస్థకు అప్పగించింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. పైకి పోరాటాలు చేస్తున్నట్లు ప్రజలను నమ్మించి అంతర్గతంగా అక్రమదందాలు చేసుకోవడం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌‌‌‌కు పరిపాటిగా మారిందన్నారు. సమావేశంలో కాంగ్రెస్ లీడర్లు కాల్వ లింగస్వామి, ఎం. రవికుమార్, విజయ తదితరులు పాల్గొన్నారు.

ధరణి సమస్యలు పరిష్కరించండి
ఎమ్మార్వో ఆఫీస్ ఎదుట రైతుల ఆందోళన

జగిత్యాల / బుగ్గారం, వెలుగు : ధరణి పోర్టల్ ద్వారా ఏర్పడ్డ సమస్యలు ఐదేండ్లయినా పరిష్కారం కావడంలేదని బుగ్గారం మండల రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. రైతు సమస్యలు, ధరణి పోర్టల్ ద్వారా ఏర్పడ్డ సమస్యలపై మంగళవారం స్థానిక ఎమ్మార్వో ఆఫీస్ ఎదుట నిరసన వ్యక్తం చేసి మాట్లాడారు. ధరణి పోర్టల్ వెంటనే రద్దు చేయాలని, రైతుల సమస్యలన్నీ వెటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రెవెన్యూ శాఖ రికార్డులలో గల్లంతైన భూముల వివరాలు తెలపాలని, అధికారుల నిర్లక్ష్యం పట్ల నినాదాలు చేశారు. అనంతరం బుగ్గారం ఎమ్మార్వోకు వినతి పత్రం అందజేశారు. ఆందోళనలో నక్క రాజలింగు, పుప్పాల గంగన్న, జంగ నీరజ్, సామల్ల శ్రీను, ముదారి ఉమేశ్, కోలేటి మహేష్ తదితరులు పాల్గొన్నారు. 

నేరాలు తగ్గాయి.. మోసాలు పెరిగాయి
వార్షిక క్రైం రివ్యూలో సీపీ సత్యనారాయణ 

కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్​ పోలీసు కమిషనరేట్ పరిధిలో నేరాల సంఖ్య తగ్గినా హత్యలు, సైబర్ నేరాలు, మోసాలు భారీగా పెరిగాయని సీపీ సత్యనారాయణ తెలిపారు. మంగళవారం నిర్వహించిన ఏడాది క్రైం రివ్యూ సమావేశంలో ఆయన మాట్లాడారు. రేప్​లు 41 నుంచి 32కు తగ్గగా మర్డర్లు 11 నుంచి 22కు పెరిగాయన్నారు. 

కేసుల వివరాలు..

గతేడాది నేరాలసంఖ్య 3,714 ఉండగా ప్రస్తుతం 3,603కు తగ్గాయని, గతేడాది మోసాలతో రూ.22.4లక్షలు నష్టపోగా ఈసారి రూ.1.81కోట్లకు పెరిగినట్లు పేర్కొన్నారు. ఆత్మహత్యలు 274 కాగా ఈసారి 300, పురుషుల ఆత్మహత్యలు 205 నుంచి 233కు పెరిగినట్లు తెలిపారు. డ్రంకన్ డ్రైవ్ కేసుల ద్వారా గతేడాది రూ.46.39లక్షలు వసూలు చేసి, 11,463 కేసులు నమోదు చేసి 34 మందిని జైలుకు పంపగా ఈ ఏడాది 6,683 కేసులతో రూ.86.76 లక్షలు వసూలు చేశామని, ఒక్కరిని కూడా జైలుకు పంపలేదని వెల్లడించారు. డిసెంబర్ 31 రాత్రి  మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ 
హెచ్చరించారు.