ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

రమణీయంగా రాములోరి కల్యాణం

భద్రాచలం, వెలుగు: సీతారామచంద్రస్వామి దేవస్థానంలో గురువారం ప్రాకార మండపంలో సీతారాముల కల్యాణం రమణీయంగా జరిగింది. గోదావరి నుంచి తీర్థబిందెను తెచ్చి గర్భగుడిలో సుప్రభాత సేవ చేసి బాలబోగం నివేదించాక కల్యాణమూర్తులను ప్రాకార మండపానికి తీసుకెళ్లారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, ఆరాధన అనంతరం స్వామివారి కల్యాణ క్రతువు మొదలైంది. యజ్ఞోపవీతం, కంకణధారణ, కన్యాదానం, జీలకర్రబెల్లం, మాంగల్యధారణ, తలంబ్రాల వేడుక తర్వాత మంత్రపుష్పం సమర్పించారు. సాయంత్రం దర్బారు సేవ జరగ్గా వేడుకలో స్వామివారికి ఇచ్చే దివిటీ సలాం తిలకించి భక్తులు పులకించారు. హైదరాబాద్​కు చెందిన వి.శివకుమార్, శ్రీదేవి దంపతులు శ్రీసీతారామచంద్రస్వామికి 500 గ్రాములతో చేసిన వెండిపళ్లెం విరాళంగా అందజేశారు. 

టీచర్ల సమస్యలపై పోరాడుతాం

ఖమ్మం టౌన్, వెలుగు: టీచర్ల సమస్యల పరిష్కారానికి దశల వారీగా పోరాటం చేస్తామని టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.నాగిరెడ్డి అన్నారు. ఖమ్మంలోని టీపీటీఎఫ్​ ఆఫీసులో గురువారం ఏపీటీఎఫ్​నిర్మాత రాయల వెంకటప్పయ్య సంతాప సభ జరిగింది. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కేజీబీవీ టీచర్ల సమస్యలపై ఈ నెల 15,16 లలో నిరసన కార్యక్రమాలు, గిరిజన స్కూళ్ల టీచర్ల సమస్యల సాధనకై 19 న చలో హైదరాబాద్​కార్యక్రమం చేపట్టనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.విజయ్, రాష్ట్ర మాజీ కార్యదర్శి పూర్ణచందర్ రావు, రవికుమార్, పాల్గొన్నారు.

రామాలయంలో కలెక్టర్​ దంపతుల పూజలు

భద్రాచలం సీతారామచంద్రస్వామిని కలెక్టర్​ అనుదీప్​ దంపతులు గురువారం దర్శించుకున్నారు. ఈవో శివాజీ ఆధ్వర్యంలో అర్చకులు పరివట్టం కట్టి ఆలయంలోకి ఘనంగా స్వాగతం పలికారు. గర్భగుడిలో ప్రత్యేక పూజల అనంతరం వారికి లక్ష్మీతాయారు అమ్మవారి సన్నిధిలో వేదపండితులు ఆశీర్వచనం ఇచ్చారు. శేషమాలికలు, వస్త్రాలు, ప్రసాదంతో పాటు జ్ఞాపికను ఈవో శివాజీ అందజేశారు. 

పోలవరం ముంపుపై సర్వే ప్రారంభం
బూర్గంపహాడ్, వెలుగు: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో బూర్గంపహాడ్ మండలంలో ముంపునకు గురయ్యే ప్రాంతాలపై గురువారం సర్వే ప్రారంభమైంది. ఇటీవల గోదావరికి భారీ వరదలు రావడంతో  బూర్గంపహాడ్,  భద్రాచలం, అశ్వాపురం, మణుగూరు మండలాలు గతంలో ఎన్నడు లేనివిధంగా ముంపుకు గురయ్యాయి. పోలవరం నిర్మాణంతోనే ముంపు పెరిగిందని తెలంగాణ ప్రభుత్వం సీడబ్ల్యూసీని ఫిర్యాదు చేసింది. దీంతో పోలవరం అథారిటీ, తెలంగాణ ప్రభుత్వాలు సంయుక్తంగా ముంపు సర్వే చేపట్టాలని సీడబ్ల్యూసీ ఆదేశించడంతో రెండు తెలుగు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారుల ఆధ్వర్యంలో బూర్గంపహాడ్ మండలంలో పోలవరం ముంపు సర్వే చేపట్టారు. సర్వేలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇరిగేషన్ ఎస్ఈ  వెంకటేశ్వర రెడ్డి, ఈఈ రాంప్రసాద్, వెంకటేశ్వర్లు, డీఈ శ్రీనివాసరావు, ఏఈ ఎం.రాజీవ్ గాంధీ, గణేశ్, దుర్గాప్రసాద్, పోలవరం ఇరిగేషన్ అధికారులు పరమేశ్, ఎన్వీ రమణ పాల్గొన్నారు

ప్రతీ గిరిజన గ్రామానికి సంక్షేమ పథకాలు అందాలి

భద్రాచలం, వెలుగు: ఏజెన్సీ ఏరియాలో ప్రతీ గిరిజన గ్రామానికి సంక్షేమ పథకం అందేలా చూడాలని పీవో గౌతమ్​ పోట్రు ఆఫీసర్లను ఆదేశించారు. ఐటీడీలో గురువారం యూనిట్​ఆఫీసర్లతో పీవో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ ఏరియాలో అంగన్​వాడీ సెంటర్లలో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు. మీటింగ్​లో ఏపీవో జనరల్​ డేవిడ్​రాజ్​, డీడీ రమాదేవి, జీసీసీ డీఎం వాణి పాల్గొన్నారు.

12 నుంచి ట్రైబల్ ​రాష్ట్ర స్థాయి క్రీడాపోటీలు

ఈనెల 12 నుంచి భద్రాచలంలో4 రోజులపాటు ట్రైబల్​ రాష్ట్ర స్థాయి క్రీడాపోటీలు నిర్వహిస్తున్నట్లు ఏపీవో జనరల్​ డేవిడ్​రాజ్ తెలిపారు. ఈ సందర్భంగా గురువారం పీవో గౌతమ్​ పోట్రును కలిసి ఆహ్వాన పత్రికను అందించారు. పీవో మాట్లాడుతూ అన్ని స్కూళ్ల నుంచి క్రీడాకారులు వచ్చేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. రాష్ట్రం నలుమూలల నుంచి 1500 మంది క్రీడాకారులు 25 క్రీడాంశాల్లో పోటీ పడతారని 
వివరించారు. వారందరికీ వసతితో పాటు భోజనం, సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. 

  • బీటీపీఎస్​ వ్యర్థాలతో ప్రజల ప్రాణాలకు ముప్పు
  • బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సీతారామరాజు

మణుగూరు, వెలుగు: భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి వెలువడే వ్యర్థాలతో ఈ ప్రాంత ప్రజల ప్రాణాలకు ముప్పు ఉంటుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జంపన సీతారామరాజు ఆరోపించారు. గురువారం మణుగూరులోని కొండాయిగూడెం గోదావరిలో బీటీపీఎస్​వ్యర్థాలు వదులుతున్న ప్రాంతాన్ని రైతులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా సీతారామరాజు మాట్లాడుతూ ప్రాజెక్టు నుంచి వచ్చే బూడిదను గోదావరిలో వదలడం వల్ల కలుషితమైపోయి చేపలు చనిపోతున్నాయన్నారు. ఇదే నీటిని సింగరేణి, మిషన్ భగీరథ ద్వారా ప్రజలకు పంపిణీ చేస్తున్నారని ఈ నీటిని తాగితే ఊపిరితిత్తులు, మూత్రపిండాలు పాడవుతాయన్నారు. బీటీపీఎస్​అధికారులు నీటిని శుద్ధిచేసి గోదావరిలో కలపాలని లేదంటే బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.

  • రీయింబర్స్​మెంట్​ బకాయిలను విడుదల చేయాలి 
  • బీసీ సంఘం ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్

ఖమ్మం టౌన్, వెలుగు: ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టూడెంట్ల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గురువారం స్టూడెంట్స్ తో చలో కలెక్టరేట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు రామమూర్తి మాట్లాడుతూ స్టూడెంట్స్ కు మెస్ చార్జ్ లు, స్కాలర్​షిప్​పెంచాలని డిమాండ్​చేశారు. బీసీ స్టూడెంట్స్ కు ర్యాంకులతో సంబంధం లేకుండా ఇంజినీరింగ్, ఫార్మసీ.. తదితర కాలేజీలకు పూర్తి ఫీజులు చెల్లించాలన్నారు. అనంతరం డీఆర్వో కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర యువజన సంఘం ప్రధాన కార్యదర్శి నాగ రామచారి, యూత్ జిల్లా ఉపాధ్యక్షుడు ప్రకాశ్, జయంతి, ఇందు, రమణ, రమేశ్​ పాల్గొన్నారు.

ఏఐఏస్ఎఫ్ ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్

ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్​షిప్​బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్​చేస్తూ గురువారం ఏఐఎస్ఎఫ్​ఆధ్వర్యంలో స్టూడెంట్స్ చలో కలెక్టరేట్​ నిర్వహించారు. ప్రదర్శనగా వచ్చిన స్టూడెంట్స్ కలెక్టరేట్​ముందు ధర్నా చేశారు. కొత్త జాతీయ విద్యావిధానం రద్దు చేయాలని, జిల్లా కేంద్రంగా యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్​చేశారు. స్టూడెంట్స్ కలెక్టరేట్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు  అడ్డుకున్నారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్, సహాయ కార్యదర్శి రామకృష్ణ, జిల్లా అధ్యక్షుడు ఎం.లక్ష్మణ్ పాల్గొన్నారు.

కొత్తగూడెం రైల్వే స్టేషన్​ను తనిఖీ చేసిన డీఆర్ఎం 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: కొత్తగూడెం(భద్రాచలం రోడ్​) రైల్వే స్టేషన్​ను డివిజనల్​ రైల్వే మేనేజర్​ ఏకే గుప్తా గురువారం తనిఖీ చేశారు. ప్లాట్​ఫాంతో పాటు రైల్వే సిగ్నలింగ్​ను పరిశీలించారు. ఆఫీస్​లో బాత్​రూంలు అపరిశుభ్రంగా ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొల్హాపూర్​ట్రైన్​ను కొత్తగూడెం రైల్వే స్టేషన్​ నుంచి తిరిగి పునరుద్ధరించాలంటూ కొవ్వూరు రైల్వే సాధన కమిటీ కన్వీనర్​ పాండురంగాచార్యులు డీఆర్ఎంకు వినతిపత్రాన్ని ఇచ్చారు. డోర్నకల్​నుంచి కొత్తగూడెం రైల్వే స్టేషన్​ వరకు అన్ని స్టేషన్లలో రైళ్లు ఆపాలని కోరారు. సత్తుపల్లి వరకు ప్యాసింజర్​ రైలు నడపాలన్నారు. 

తొలిమెట్టును సక్సెస్​ చేయాలి

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: స్టూడెంట్స్​లో సామర్థ్యాల పెంపే లక్ష్యంగా తొలిమెట్టు ప్రోగ్రాం కొనసాగుతోందని డీఈవో సోమశేఖర శర్మ అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలో కొత్తగూడెం, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్​, చుంచుపల్లి మండలాల ప్రైమరీ స్కూల్​టీచర్లతో తొలిమెట్టుపై రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ టీచర్లు అంకిత భావంతో పనిచేస్తే తొలిమెట్టు సక్సెస్​అవుతుందన్నారు.  స్టూడెంట్స్​లలో భాషా, గణిత సామర్థ్యాల పెంచేందుకు టీచర్లు కృషి చేయాలన్నారు. మీటింగ్​ లో ఎంఈవో జుంకిలాల్​,  అకడమిక్​ కో ఆర్డినేటర్లు నాగరాజ శేఖర్​, సైదులు, జిల్లా సహాయ గణాంక అధికారి సతీశ్, జిల్లా ఉమ్మడి పరీక్షల కార్యదర్శి మాధవరావు, నోడల్​ అధికారులు పాల్గొన్నారు. 

భద్రాచలంలో కిసాన్​మోర్చా శిక్షణ తరగతులు

భద్రాచలం, వెలుగు: భద్రాచలంలో రాష్ట్ర కిసాన్​మోర్చా శిక్షణ తరగతులు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్​రెడ్డి, కిసాన్​మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్​రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ చీఫ్​గెస్ట్​లుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం ఉందని అన్నారు. రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేస్తానని చెప్పి సీఎం కేసీఆర్​ఆ హామీని మరిచారని ఎద్దేవా చేశారు. అనంతరం గుజ్జుల ప్రేమేందర్​రెడ్డి, కొండపల్లి శ్రీధర్​రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ ఈనెల 12న రామగుండంలో తెలంగాణ రైతుల కోసం రూ.6300 కోట్లతో ఎరువుల ఫ్యాక్టరీని ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభిస్తున్నారని చెప్పారు. ప్రకృతి, గో ఆధారిత వ్యవసాయంతోపాటు రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ శిక్షణా తరగతుల్లో చర్చిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో కిసాన్​మోర్చా జిల్లా అధ్యక్షుడు కోనేరు నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి, సుగుణాకర్​రావు, జాతీయ ఉపాధ్యక్షుడు సురేశ్​రెడ్డి,  ఎర్రంరాజు బెహరా పాల్గొన్నారు.

  • అభివృద్ధి పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
  • ఎంపీ నామా నాగేశ్వరరావు

మధిర, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. గురువారం బోనకల్​ మండలంలో  జడ్పీచైర్మన్​ లింగాల కమల్​రాజు, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. కలకోట నుంచి నారాయణపురం వరకు రూ.2.54కోట్లతో బీటీ రోడ్డుకు శంకుస్థాపన, మోటమర్రిలో రూ.10లక్షలతో సీసీ రోడ్డును ప్రారంభించారు. బాధితులను పరామర్శించిన భట్టి మధిర మండలంలో సీఎల్పీ నేత, ఎమ్మెల్యే మల్లు  భట్టి విక్రమార్క గురువారం పలు బాధిత కుటుంబాలను పరామర్శించారు. దెందుకూరు గ్రామంలో కొడవటి కంటి రాధిక దశదినకర్మకు హాజరై నివాళులర్పించి కుటుంబసభ్యలను పరామర్శించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్, రవికుమార్ పాల్గొన్నారు.

ఆర్టీసీ సేవలపై అవగాహన

చండ్రుగొండ, వెలుగు: సురక్షితమైన ప్రయాణానికి ఆర్టీసీ సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని కొత్తగూడెం డిపో మేనేజర్ బి. వెంకటేశ్వరావు కోరారు. గురువారం ప్రజల వద్దకు ‘ఆర్టీసీ’లో భాగంగా చండ్రుగొండ మెయిన్ సెంటరులో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్తీకమాసం సందర్భంగా పుణ్యక్షేత్రాలకు వెళ్ళే భక్తులకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అయ్యప్ప స్వామి భక్తుల కు శబరిమలై వెళ్ళేందుకు ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని కోరారు. ఆర్టీసీ సంస్థ లాభాల కోసం కాకుండా ప్రజలకు సేవలందించే లక్ష్యంగా పని చేస్తున్నట్లు పేర్కొన్నారు.