ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

సిద్దిపేట రూరల్, వెలుగు : తల్లీబిడ్డల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని మంత్రి హరీశ్ రావు సూచించారు. ప్రభుత్వ దవాఖానాలో నార్మల్ డెలివరీలు ఎక్కువగా జరగాలని ఆరోగ్య శాఖ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. బుధవారం డిల్లీ నుంచి సిద్దిపేట జిల్లాలోని గర్భిణులతో, వైద్య సిబ్బందితో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్కారు దవాఖానాలల్లో  ప్రసవాల సంఖ్య పెంచాలని, ఇందుకోసం ప్రతి మెడికల్ ఆఫీసర్, హెల్త్ వర్కర్లు కృషి చేయాలన్నారు.  ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్నీ రకాల వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. గర్భిణులు ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లకు వెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దన్నారు. డెలివరీ అయిన మొదటి గంట తల్లిపాలు పిల్లలకు పట్టిస్తే టీకా మాదిరిగా పని చేస్తాయని గర్భిణులకు సూచించారు. గ్రామాలవారీగా ఆశాకార్యకర్తలు, ఏఎన్ఏంలు ఇంటింటికీ వెళ్లి ప్రతీ మనిషి ఆరోగ్య స్థితిగతులపై ఆరా తీసి ఎన్సీడీ కిట్లు పంపిణీ చేయాలని ఆరోగ్య శాఖ సిబ్బందిని మంత్రి ఆదేశించారు.

పట్టుదలతో కొలువు సాధించాలి

సిద్దిపేట గ్రౌండ్ లో శిక్షణ పొందుతున్న అభ్యర్థులతోపాటు పోలీసు అధికారులు, నిర్వాహకులు, సీపీ ఎన్. శ్వేతతో మంత్రి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభ్యర్థుల్లోని పట్టుదల చూస్తే ప్రతి ఒక్కరూ పోలీస్​ ఉద్యోగాన్ని పొందుతారనే నమ్మకం కలిగిందన్నారు. ఉద్యోగం సాధించే వరకూ అదే పట్టుదలతో ఉండాలని సూచించారు. 

బీటీ రోడ్లు నిర్మాణానికి నిధుల మంజూరు 

మెదక్​ టౌన్, వెలుగు :  మెదక్, నర్సాపూర్​ నియోజకవర్గాలలోని పలు బీటీ రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని మంత్రి హరీశ్​రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజన తండాలలో బీటీ రోడ్ల నిర్మాణానికి మెదక్ నియోజకవర్గంలో 43.10 కిలో మీటర్లకు రూ.44.33 కోట్లు, నర్సాపూర్​ నియోజకవర్గంలో 89 .01 కిలో మీటర్లకు రూ.69.41 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. పంచాయత్ రాజ్ శాఖ ద్వారా రెండు నియోజకవర్గాల్లో 110 .42 కిలో మీటర్ల రోడ్ల పనులకు రూ.49.14 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.

‘మల్లన్న’ నిర్వాసితులకు న్యాయం చేస్తాం

సిద్దిపేట రూరల్, వెలుగు : మల్లన్న సాగర్ నిర్వాసితులకు న్యాయం చేస్తామని సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. బుధవారం నిర్వాసితులకు అందాల్సిన ప్యాకేజీ, నష్ట పరిహారం, ఓపెన్ ప్లాట్లు, ఆర్ అండ్ ఆర్ కాలనీలో మౌలిక వసతులు కల్పన పై ఆయన కలెక్టరేట్ లో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తో కలసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ  ఓపెన్ ప్లాట్లు సంబంధించిన లేఅవుట్ లను త్వరగా పూర్తయ్యేలా చూడాలని ఆర్డీఓకు సూచించారు. నిర్మాణ ఏజెన్సీల పనుల్లో జాప్యం జరగకుండా వేగంగా పనులు పూర్తి చేయాలని, లేఅవుట్ లో, ఆర్ అండ్ ఆర్ కాలనీలో విద్యుత్ సంబంధించిన పోల్స్, వైరింగ్, లైట్లు  త్వరగా పూర్తి చేయాలని విద్యుత్ శాఖ ఎస్ ఈ ప్రభాకర్ ను ఆదేశించారు. కార్యక్రమంలో సిద్దిపేట, గజ్వేల్ ఆర్డీఓలు అనంతరెడ్డి, విజేందర్ రెడ్డి,  ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

పిల్లలతో పని చేయిస్తే చర్యలు

మెదక్ (శివ్వంపేట), వెలుగు  : పిల్లలతో పనులు చేయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని  నర్సాపూర్ జూనియర్​ సివిల్ జడ్జి అనిత హెచ్చరించారు. బుధవారం శివ్వంపేట మండలం రూప్లా తండా గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న రూప్లా తండా, పోతిరెడ్డిపల్లి తండా పరిధిలోని ఇటుక బట్టీలను ఆమె తనిఖీ చేశారు. అక్కడ పనిచేస్తున్న ఒడిశా కూలీలతో మాట్లాడారు. తమతో పని చేయించుకుని  సరైన వేతనం కూడా ఇవ్వడం లేదని  వారు తెలిపారు. చిన్న పిల్లలతో సైతం పనులు చేయిస్తున్నట్టు ఆమె దృష్టికి వచ్చింది.  దీంతో వెంటనే విచారణ జరిపి సంబంధిత యజమానులపై, మధ్యవర్తులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను జడ్జి ఆదేశించారు. ఆమె వెంట శివ్వంపేట ఎస్సై రవికాంత్ రావు, సీనియర్ అడ్వకేట్ స్వరూపారాణి ఉన్నారు. 

సర్కారు బడుల్లో అటెండెన్స్​ పెంచాలి 

కోహెడ (బెజ్జంకి), వెలుగు : సర్కారు బడుల్లో విద్యార్థుల హాజరు శాతం పెంచాలని సిద్దిపేట అడిషనల్ కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ టీచర్స్ కు సూచించారు. బుధవారం మండలంలోని రేగులపల్లి, గుండారం గ్రామాల్లో  రూమ్ టు రీడ్ ఆర్గనైజేషన్ ద్వారా మంజూరైన లైబ్రరీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నమెంట్​ స్కూళ్లలో తక్కువ స్టూడెంట్స్ ఉండడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. స్కూల్ లో స్టూడెంట్స్ సంఖ్య పెంచేందుకు తల్లిదండ్రుల ద్వారా కృషి చేయాలని టీచర్లకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ లింగాల నిర్మల, ఎంపీడీఓ దమ్మని రాము, సెక్టార్ ఆఫీసర్ భాస్కర్, ఎంఈవో పావని, సర్పంచులు అయిలయ్య, చెట్టి లావణ్య, ఎంపీటీసీ ఎలుక లత, ఎంపీఓ విష్ణు వర్ధన్ పాల్గొన్నారు.

విధుల్లో అలసత్వం వద్దు 

జగదేవపూర్(కొమురవెల్లి), వెలుగు : ఉపాధి హామీ పథకంలో పనిచేసే సిబ్బంది విధులో నిర్లక్ష్యం వహించొద్దని, గ్రామాలలో జరుగుతున్న పనులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఏపీడీ కౌసల్య దేవి అన్నారు. బుధవారం జగదేవపూర్ కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో 13వ విడత సామాజిక తనిఖీ ప్రజా వేదిక కార్యక్రమం నిర్వహించారు. గ్రామాలలో చేపట్టిన పనులు వివరాలు, కూలీలు చేసిన పనికి చెల్లించిన డబ్బులను తనిఖీ బృందం సభ్యులు వివరాలు సేకరించి మండల సభలో చదివి వినిపించారు. విధులో నిర్లక్ష్యం వహిస్తున్న టీఏ కరుణాకర్ రెడ్డి పై ఏపీడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏపీడీ కౌసల్య దేవి మాట్లాడుతూ ఉపాధి హామీ పనుల్లో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామాలలో జరిగే ఈజీఏస్ పనులను టీఏలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బాలేశం గౌడ్, జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, పీఏసీఏస్ చైర్మన్ ఆలేటి ఇంద్రసేనారెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాస్ వర్మ, ఎపీఓ లక్ష్మి పాల్గొన్నారు.

మార్షల్ ఆర్ట్స్ లో సెయింట్ ఆంథోనీస్ విద్యార్థి ప్రతిభ

సంగారెడ్డి టౌన్, వెలుగు : హైదరాబాద్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఈనెల 11న జరిగిన ఫస్ట్​ ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ ఈవెంట్స్ లో సంగారెడ్డి సెయింట్​ ఆంథోనీస్​ ఫోర్త్ క్లాస్ స్టూడెంట్ ఎండీ ఇబ్రహీం అహ్మద్ గోల్డ్​ మెడల్ సాధించాడు. బుధవారం విద్యా సంస్థల అధినేత సలోమేన్ రెడ్డి, ప్రిన్సిపాల్ కరుణాకర్ రెడ్డి విద్యార్థిని అభినందించారు. భవిష్యత్తులోనూ ప్రతి పోటీలో ధైర్యంగా పాల్గొని ముందుకు దూసుకెళ్లాలని సూచించారు.