ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు
 • ఎట్టకేలకు ధాన్యం కొనుగోలు సెంటర్లు ఓపెన్
 • తెరుచుకుంటున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలు
 • మద్దతు ధరపైనే అన్నదాతల ఆశలు

వెలుగు నెట్ వర్క్: ఉమ్మడి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎట్టకేలకు తెరుచుకుంటున్నాయి. ఎప్పుడెప్పుడు కాంటాలు పెడతారా? అని ఎదురుచూసిన రైతుల నిరీక్షణకు తెరపడింది. రైతుల గోసపై ఇటీవల ‘వెలుగు’లో కథనం రాగా.. ఆఫీసర్లు స్పందించి సెంటర్లు తెరుస్తున్నారు. ఇన్నాళ్లు మునుగోడు బిజీలో ఉన్న ప్రజాప్రతినిధులు.. ఫీల్డ్ మీదికి వచ్చి కొనుగోలు కేంద్రాలకు కొబ్బరి కాయలు కొడుతున్నారు. అయితే పోయిన సీజన్ లో తాలు, తేమ అంటూ కోతలు విధించారు. మద్దతు ధరలోనూ వ్యత్యాసం చూపారు. ఈసారి కోతలు లేకుండా పూర్తి స్థాయిలో వడ్లు కొని, మంచి ధర కల్పించాలని అన్నదాతలు వేడుకుంటున్నారు.

ప్రతి గింజా కొనుగోలు చేస్తాం

తొర్రూరు: రైతులు పండించిన ప్రతి గింజనూ మద్దతు ధరతో కొంటామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, గిరిజన, స్ర్తీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హామీ ఇచ్చారు. శనివారం తొర్రూరు మండలం ఖానాపురం, పెద్దవంగర మండలకేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. దొడ్డు, సన్న అనే తేడా లేకుండా ధాన్యాన్ని సేకరించి గతంలో మాదిరిగానే రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేయనున్నట్లు చెప్పారు. రైతులెవరూ ఆందోళన చెందవద్దని, కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలని సూచించారు. ధాన్యం క్వింటాకు ఏ గ్రేడ్ కు రూ.2060, సీ గ్రేడ్ కు రూ.2040 కనీస మద్దతు ధరగా నిర్ణయించామన్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా పోలీసు, రవాణాశాఖ అధికారులను అప్రమత్తం చేశామన్నారు.

మిల్లర్లకు వార్నింగ్..

మిల్లర్లు కనీస మద్దతు ధర చెల్లించకుండా రైతులను మోసం చేస్తే ఉపేక్షించేది లేదని మంత్రులు స్పష్టం చేశారు. అవసరమైతే టాస్క్‌‌‌‌ ఫోర్స్‌‌‌‌ బృందాలను ఏర్పాటు చేసి మోసాలకు పాల్పడే మిల్లర్లపై చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనకున్నా.. రాష్ట్రమే కొంటోందని తెలిపారు. కేంద్రంలో ఫుడ్ కార్పొరేషన్ ను కూడా ఎత్తేసే యోచనలో ఉందని ఆరోపించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్​డేవిడ్, పీఏసీఎస్ చైర్మన్ కాకిరాలహరి ప్రసాద్, జడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి కమిషన్ డైరెక్టర్ లింగాల వెంకటనారాయణ గౌడ్ తదితరులున్నారు.

రైతుల సంక్షేమమే కేసీఆర్ లక్ష్యం... 

నర్మెట: రైతుల సంక్షేమమే కేసీఆర్ లక్ష్యమని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. శనివారం నర్మెట మండలకేంద్రంలోని పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. బీజేపీ ప్రభుత్వం రైతుల గోసను పట్టించుకోకుండా, వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా, ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు.

ఇప్పుడు తేరుకున్నరు..

కమలాపూర్: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో రెండు వారాల ముందే కోతలు ప్రారంభయ్యాయి. గ్రామాల్లోని రోడ్లపై ఎటుచూసినా వడ్ల రాశులే కనిపిస్తున్నాయి. రోజూ వడ్లు ఆరబోయలేక ఇటీవల ఓ మహిళ కూడా అస్వస్థతకు గురైంది. ‘వెలుగు’ కథనంతో స్పందించిన ఆఫీసర్లు శనివారం ఏకకాలంలో మండల వ్యాప్తంగా 13 సహకార సంఘం కొనుగోలు సెంటర్లు,  3 ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ రాణి, జడ్పీటీసీ లాండిగే కల్యాణి, సింగిల్​విండో చైర్మన్ పేరాల సంపత్ రావు, సర్పంచ్​ల ఫోరం మండలాధ్యక్షులు పెండ్యాల రవీందర్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్ రావు ఉన్నారు.

 • గోవిందరావుపేట మండలం ముమ్మాటికీ ఏజెన్సీనే..!
 • నాన్​ఏజెన్సీ చేయాలని చూస్తే సహించం
 • ఎంపీడీవోకు విన్నవించిన 17మంది సర్పంచులు

ములుగు(గోవిందరావుపేట), వెలుగు: ములుగు జిల్లాలోని గోవిందరావుపేట మండలాన్ని కొందరు నాన్ ఏజెన్సీగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, ఈ మండలం ముమ్మాటికీ ఏజెన్సీయేనని సర్పంచ్​ల ఫోరం మండలాధ్యక్షుడు భూక్య మోహన్ రాథోడ్ స్పష్టం చేశారు. శనివారం గోవిందరావుపేటలో 17మంది సర్పంచులు ఏకమై ఎంపీడీవోకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మోహన్ రాథోడ్ మాట్లాడుతూ.. గత నెలలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఈ మండలాన్ని నాన్​ఏజెన్సీగా ప్రకటించాలని సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేశారని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. 70ఏండ్లుగా కులమతాలకతీతంగా అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి జీవిస్తుంటే.. కొందరు తప్పుడు ప్రకటనలతో గొడవలు సృష్టించాలని చూస్తున్నారని మండిపడ్డారు. 29న చేసిన నాన్ ఏజెన్సీ తీర్మానాన్ని కూడా ఎంపీపీ ఉపసంహరించుకున్నారని, ఈమేరకు ఎంపీడీవోకు లేఖ అందించారని గుర్తు చేశారు. మండలంలోని అన్ని గ్రామాల్లో 1/70, పెసా చట్టాలను పక్కాగా అమలు చేయాలని సర్పంచ్​లు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ముద్దబోయిన రాము, సింగం శ్రీలత తదితరులున్నారు.

నార్మల్ డెలివరీలను ప్రోత్సహించాలి

మహబూబాబాద్, వెలుగు: ప్రభుత్వ ఆసుపత్రుల్లో నార్మల్ డెలివరీలను ప్రోత్సహించాలని కలెక్టర్ శశాంక హెల్త్ ఆఫీసర్లను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్​లో డీఎంహెచ్​వో హరీశ్ రాజు ఆధ్వర్యంలో రివ్యూ నిర్వహించారు. సర్కారు దవాఖాన్లకు నిరుపేదలు ఎక్కువగా వస్తుంటారని సాధారణ ప్రసవాలపై అవగాహన కల్పించాలన్నారు. అంతిమంగా ఆరోగ్యస్థితిని బట్టే నార్మల్ డెలివరీ చేయాలన్నారు. సీ సెక్షన్ డెలివరీలు అధికంగా ఉన్నచోట ఆఫీసర్లు దృష్టి పెట్టాలన్నారు.

కష్టపడి లక్ష్యాన్ని చేరుకోవాలి

మహబూబాబాద్​అర్బన్,  వెలుగు: విద్యార్థులు కష్టపడి లక్ష్యం చేరుకోవాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి సత్యనారాయణ అన్నారు. శనివారం నలంద జూనియర్​కాలేజీలో ఫ్రెషర్స్​డే నిర్వహించగా.. చీఫ్ గెస్టుగా ఆయన పాల్గొని మాట్లాడారు. స్టూడెంట్లు క్రియేటివిటీ, స్కిల్స్ పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో కాలేజీ కరస్పాండెంట్ డాక్టర్​డోలి సత్యనారాయణ, కాలేజీ చైర్మన్ శ్రీరంగారెడ్డి, ప్రిన్సిపల్ శ్రీపాల్ రెడ్డి పాల్గొన్నారు.

కల్వర్టును ఢీకొట్టిన బైక్ యువకుడు మృతి

హసన్ పర్తి, వెలుగు: బైక్ పై వెళ్తూ కల్వర్టు ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన హనుమకొండ జిల్లా హసన్​పర్తి మండలం ఆరెపల్లి గ్రామంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని పెగడపల్లి డబ్బాలు గ్రామానికి చెందిన అవినాశ్(24) తన ఫ్రెండ్ తో కలిసి శనివారం రాత్రి ఓ పని నిమిత్తం ఆరెపల్లి నుంచి వంగపహడ్ వైపు వెళ్తున్నాడు. ఈక్రమంలో వంగపహడ్ సమీపంలో బైక్ కల్వర్టును ఢీకొట్టింది. దీంతో అవినాశ్ స్పాట్​లో చనిపోయాడు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. సీఐ నరేందర్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

బైక్ పై నుంచి పడి రైతు మృతి..

మహాముత్తారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం రేగులగూడెంకు చెందిన పెండ్లి రాజిరెడ్డి(40) అనే రైతు శుక్రవారం రాత్రి బైక్ పై నుంచి కిందపడి స్పాట్ లో చనిపోయాడు. ఏఎస్ఐ మహేందర్ రెడ్డి వివరాల ప్రకారం.. రాజిరెడ్డి కూలీల కోసం పాతరేగులగూడెం వెళ్లి తిరిగి వస్తుండగా మూలమలుపు వద్ద ఎదురుగా వస్తున్న వెహికల్ లైట్ల ఫోకస్ కండ్లలో పడింది. దారి కనిపించక బైక్ అదుపుతప్పి కింద పడిపోయాడు. తీవ్ర గాయమై స్పాట్ లోనే మృతి చెందాడు.

అర్హులందరూ ఓటు నమోదు చేసుకోవాలి

జనగామ అర్బన్, వెలుగు: 18 ఏండ్లు నిండిన యువత కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలని జనగామ కలెక్టర్ శివలింగయ్య సూచించారు. శనివారం కలెక్టరేట్​లో అన్ని రాజకీయ పార్టీల నాయకులతో కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు. అర్హులందరూ ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వారా ఓటు హక్కు ఎన్ రోల్ చేసుకోవాలన్నారు. ఈ నెల 9న అన్ని రాజకీయ పార్టీలకు డ్రాఫ్ట్ ఓటర్ జాబితా, డీవీడీ, పెన్​డ్రైవ్​లు ఇస్తామన్నారు. అంతకుముందు సాధారణ తనిఖీల్లో భాగంగా ఈవీఎం గోదాంను తనిఖీ చేశారు. అడిషనల్ కలెక్టర్​ అబ్దుల్ హామీద్, ఎన్నికల పర్యవేక్షకుడు పి.శ్రీనివాస్, డీటీ శంకర్ తదితరులున్నారు.

మహిళా సంఘాలకు రూ.12కోట్ల లోన్స్

కాశీబుగ్గ(కార్పొరేషన్), వెలుగు: మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేస్తామని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ అన్నారు. శనివారం సిటీలోని 29వ డివిజన్​లో ఎస్ హెచ్ జీ బృందాలకు మంజూరైన రూ.12కోట్ల రుణాలను మేయర్ గుండు సుధారాణితో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. కొత్త ఉత్తత్పుల తయారీకి మహిళా సంఘాలు ఆసక్తి చూపితే, వాటి మార్కెటింగ్ కు తాము అంబాసిడర్లుగా వ్యవహరిస్తామన్నారు. పావలా వడ్డీకే రుణాలు అందజేసే విషయాన్ని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. మేయర్ సుధారాణి మాట్లాడుతూ.. టెక్స్ టైల్ పార్కులో మహిళలకు ఉపాధి కల్పించేందుకు చొరవ తీసుకుంటామన్నారు.

అమ్మకానికి ‘కుడా’ పాట్లు

హనుమకొండ జిల్లా మేడిపల్లిలోని 150 ఎకరాల్లో ‘కుడా’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వెంచర్​లో ప్లాట్లు అమ్మకానికి ఉన్నాయని చీఫ్ విప్ వినయ్ భాస్కర్ చెప్పారు. శనివారం ఇందుకు సంబంధించిన బ్రోచర్ ను ఎమ్మెల్యే అరూరి రమేశ్, కుడా  చైర్మన్ సుందర్ రాజ్, వైస్ చైర్మన్ ప్రావీణ్య, రైతు ఋణ విమోచన కమీషన్ చైర్మన్ వెంకన్న చేతుల మీదుగా ఆవిష్కరించారు.  ఈ నెల 13న లేఅవుట్ ప్లాట్లను వేలం వేయనున్నట్లు చెప్పారు.

 • చికిత్స పొందుతూ గర్భిణి మృతి
 • ఆసుపత్రి ముందు కుటుంబసభ్యులు, బంధువుల ఆందోళన

వరంగల్ సిటీ, వెలుగు: వైద్యం కోసం గర్భిణి ప్రాణాలే పోయాయి. వివరాల్లోకి వెళితే.. భూపాలపల్లి జిల్లా గొర్లవేడు గ్రామానికి చెందిన మామిడి కోమల(35) మూడు నెలల గర్భిణి. గత నెల 25న రక్తస్రావం కావడంతో భూపాలపల్లిలోని ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లింది. పరిస్థితి విషమించడంతో వరంగల్ లోని రియా ఆసుపత్రికి తరలించారు. అదే రోజు రాత్రి కోమలకు డాక్టర్లు వైద్యం చేశారు. రక్తస్రావం ఆగకపోవడంతో బాలసముద్రంలోని మరో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతూ.. శుక్రవారం చనిపోయింది.

‘రియా’ ముందు ధర్నా..

రియా ఆసుపత్రి డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే కోమల చనిపోయిందని కుటుంబసభ్యులు, బంధువులు శనివారం రియా ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. మృతదేహంతో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. డబ్బుల కోసం అన్యాయంగా చంపేశారని ఆరోపించారు. దీంతో మట్టేవాడ పోలీసులతోపాటు హనుమకొండ జిల్లా వైద్యాధికారులు రియా ఆసుపత్రికి చేరుకొని చర్చలు జరిపారు. బాధితులకు నచ్చజెప్పారు.

 • చిట్యాల మార్కెట్ పై సర్కారు నిర్లక్ష్యం!
 • పాలకవర్గం లేదు.. కొనుగోళ్లు లేవు
 • తక్కువ రేటుకే పంటలు కొంటున్న వ్యాపారులు

చిట్యాల, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలకేంద్రంలోని అగ్రికల్చర్​ మార్కెట్​పై నిర్లక్ష్యపు నీడలు కమ్ముకున్నాయి. చిట్యాల సబ్ మార్కెట్ యార్డును రెండేళ్ల క్రితం.. ప్రత్యేక మార్కెట్​గా అప్​గ్రేడ్ చేస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచి చిట్యాల మార్కెట్​కు పాలకవర్గాన్ని నియమించలేదు. పంట దిగుబడులు చేతికొస్తున్న సమయంల్లోనూ స్పందించడం లేదు. దీంతో మార్కెట్ మూతబడింది. రైతులు తమ పంటలను ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుని నష్టపోతున్నారు.

నాడు కలకల.. నేడు ​వెలవెల..

రెండేండ్ల కింద చిట్యాల మార్కెట్ క్రయవిక్రయాలతో కళకళలాడుతూ ఉండేది. పత్తి అమ్మకాలకు ఈ మార్కెట్ పెట్టింది పేరు. ప్రస్తుతం అమ్మకాలు లేక వెలవెలబోతుంది. మార్కెట్ తెరుచుకోకపోవడంతో వ్యాపారుల లైసెన్స్ గడువు కూడా పూర్తయింది. దీంతో కొందరు వ్యక్తులు లైసెన్స్ లేకుండా తక్కువ రేటుకు కొనుగోళ్లు చేపడుతున్నారు. గ్రామాల్లోనే కాంటాలు వేసి, తేమ, తరుగు పేరుతో మార్కెట్ కంటే తక్కువ ధర చెల్లిస్తూ రైతుల్ని నిలువునా ముంచుతున్నారు. ఈ విషయం మార్కెట్​ ఆఫీసర్లకు తెలిసినా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. చిట్యాల మార్కెట్ మూసి ఉండడంతో కొందరు రైతులు దూర ప్రాంతాలైన వరంగల్​, జమ్మికుంట మార్కెట్లకు వెళ్లి పత్తి అమ్ముకుంటున్నారు. రవాణా చార్జీల భారం కూడా పెరిగిపోయింది.

 • లేబర్ బీమా దందాలో ఇంకెవరు?
 • ఇల్లీగల్​ క్లెయిమ్స్ గురించి నిఘా వర్గాల ఆరా

హనుమకొండ, వెలుగు: లేబర్ డిపార్ట్​మెంట్ లో ఆఫీసర్ల ప్రోద్బలంతో ఏజెంట్లు సాగిస్తున్న బీమా దందాపై ఇంటెలిజెన్స్​వర్గాలు ఆరా తీస్తున్నాయి. రెండు నెలల కిందట లేబర్​డిపార్ట్ మెంట్ లోని ఓ పెద్దాఫీసర్​నియమించుకున్న ఏజెంట్​ పట్టుబడగా..  ఫేక్​ డాక్యుమెంట్లతో బీమా సొమ్ము కాజేస్తున్న రెండు గ్యాంగులను పోలీసులు రెండ్రోజుల కిందటే పట్టుకున్నారు. ఇందులో ఇద్దరు ఏఎల్​వోలు కీలకంగా వ్యవహరించడంతో వారిపైనా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   వీరే కాకుండా ఇంకా కొందరు ఏఎల్​వోలు కూడా ప్రైవేటు ఏజెంట్లతో కలిసి రూ.లక్షలు కాజేశారనే ఆరోపణలున్నాయి. దీంతోనే ‘వెలుగు’  పేపర్​లో వరుస కథనాలు పబ్లిష్ కాగా..  ఇంటెలిజెన్స్​ వర్గాలు లేబర్​ బీమా దందాపై ఆరా తీస్తున్నాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆఫీసర్లపై నిఘా పెట్టి.. గుట్టుగా వివరాలు సేకరిస్తున్నట్లు  తెలిసింది.

రూ.7.25లక్షల కరెంట్ బిల్లు!
అవాక్కయిన వినియోగదారుడు

నెక్కొండ, వెలుగు: వరంగల్ జిల్లా నెక్కొం డ టౌన్​కు చెంది న రంగయ్య అనే వినియోగదారుడికి రూ.7.25లక్షల కరెంట్ బిల్లు వచ్చింది. దీంతో కుటుంబసభ్యులంతా షాక్ అయ్యారు. రెండు గదులకే ఇంత కరెంట్ బిల్లు ఏంటని అవాక్కయ్యారు. కరెంట్ ఆఫీసర్లకు ఫిర్యాదు చేయడంతో మళ్లీ చూస్తామని చెప్పి వెళ్లిపోయారు.

టెక్నాలజీని ఉపయోగించుకోవాలి

నర్సంపేట, వెలుగు: మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు టెక్నాలజీని ఉపయోగించుకుని సేద్యం చేయాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్​రెడ్డి సూచించారు. శనివారం తన క్యాంప్​ఆఫీసులో 14 రైతు ఉత్పత్తి సంఘాలకు రూ.58 లక్షల కమీషన్ చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొందరు డ్రోన్ల ద్వారా మందులు పిచికారి చేస్తుండడం అభినందనీయమన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 37 రైతు ఉత్పత్తి సంఘాలు ఉన్నాయని, గతేడాది లక్షా 82వేల క్వింటాళ్ల ధాన్యాన్ని ఈ సంఘాలు కొనుగోలు చేశాయని వెల్లడించారు. ఇలాగే పనిచేస్తే.. ప్రతి సంఘానికి రెండు కోట్ల మేర బ్యాంకులు రుణాలు ఇచ్చే చాన్స్ ఉందన్నారు. వ్యవసాయ శాఖ జేడీ ఉషాదయాల్, జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్ ఉన్నారు. అనంరతం 90 మందికి 30 లక్షల రూపాయల విలువైన సీఎంఆర్​ఎఫ్​ చెక్కులను ఇచ్చారు.

కిట్స్‭లో ఇంటర్​ కాలేజీ టోర్నమెంట్​

కాకతీయ యూనివర్సిటీలో శనివారం ఇంటర్ కాలేజీ టోర్నమెంట్ ప్రారంభమైంది. వివిధ కాలేజీల నుంచి దాదాపు 1200మంది ఈ పోటీలకు హాజరయ్యారు. వీసీ తాటికొండ రమేశ్​ హాజరై  టోర్నమెంట్ ను ప్రారంభించారు. ఈ పోటీల్లో 6 రకాల గేమ్స్ నిర్వహిస్తున్నట్లు వివరించారు.
‌‌-హసన్ పర్తి, వెలుగు

అర్హులందరికీ పోడు పట్టాలు

గూడూరు, వెలుగు: అర్హులందరికీ పోడు పట్టాలు పంపిణీ చేస్తామని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ హామీ ఇచ్చారు. శనివారం ఆయన గూడూరు మండలం దామెరవంచలో పోడు సర్వేను పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడి, సర్వే వివరాలు తెలుసుకున్నారు. ఈ నెలాఖరులోగా సర్వే కంప్లీట్ చేయాలని కోరారు. ప్రతి ఎకరాను సర్వే చేయాలని, నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. అనంతరం ఇటీవల ఏపూర్, బ్రాహ్మణపల్లి, గాజులగట్టు, భూపతిపేట గ్రామాల్లో చనిపోయిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వేం వెంకట క్రిష్ణారెడ్డి, జడ్పీ కోఆప్షన్ మెంబర్ ఖాసీం, సురేందర్, రహీం, లక్ష్మణ్ రావు, సుదాకర్ రావు, వెంకన్న, తులసీరాం, కఠార్ సింగ్,  సురేశ్​ నాయక్, ఎల్లయ్య తదితరులున్నారు.