Brendan Taylor: 42 నెలల నిషేధం తర్వాత జింబాబ్వే స్టార్ క్రికెటర్ రీ ఎంట్రీ

Brendan Taylor: 42 నెలల నిషేధం తర్వాత జింబాబ్వే స్టార్ క్రికెటర్ రీ ఎంట్రీ

జింబాబ్వే మాజీ కెప్టెన్ బ్రెండన్ టేలర్ పై ఐసీసీ నిషేధం ముగిసింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు మూడున్నర సంవత్సరాల నిషేధం అనుభవించిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి పునరాగమనం చేయనున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగే రెండో టెస్ట్ మ్యాచ్‌తో బ్యాన్ తర్వాత క్రికెట్ లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైపోయాడు. టేలర్ నిషేధం జూలై 25న ముగిసింది. ఆగస్టు 7 నుండి న్యూజిలాండ్‌తో ప్రారంభం కానున్న రెండో టెస్టుకు జింబాబ్వే జట్టులో అతనికి చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

టేలర్ రెండో టెస్ట్ కు అందుబాటులో ఉంటాడని జింబాబ్వే కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ కన్ఫర్మ్ చేశాడు. "గత ఏడాది కాలంగా టేలర్ ఎంతలా కష్ట పడుతున్నాడో నాకు తెలుసు. కొద్ది రోజుల్లో అతను తిరిగి క్రికెట్ ఆడడం పట్ల నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను". అని ఎర్విన్ తెలిపాడు.  39 ఏళ్ల టేలర్ సెప్టెంబర్ 2021లో అకస్మాత్తుగా రిటైర్ అయిన తర్వాత ఎలాంటి క్రికెట్ ఆడుతూ కనిపించలేదు. టేలర్ 2004 నుంచి 2021 మధ్య జింబాబ్వే తరపున 34 టెస్టులు ఆడాడు. 36.25 యావరేజ్ తో 2320 పరుగులు చేశాడు. వీటిలో 6 సెంచరీలు, 12 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 

అసలేం జరిగిందంటే..?
 
2022 లో బ్రెండన్ టేలర్ పై ఐసీసీ బ్యాన్ విధించింది. ఫిక్సింగ్ కు పాల్పడ్డాడని ఒప్పుకున్న టేలర్ కు..ఐసీసీ యాంటీ కరప్షన్ కోడ్ లో  ఐసీసీ యాంటీ డోపింగ్ కోడ్ ను ఉల్లంఘించినందుకు అతడి మీద మూడున్నరేళ్ల పాటు నిషేధం వేసింది. 2019లో ఓ భారత వ్యాపారవేత్త, తనను మ్యాచ్ ఫిక్సింగ్ చేయమని బెదిరించాడని, అందుకు అతను 15 వేల అమెరికన్‌ డాలర్లు ఆఫర్‌ చేశాడని ట్విటర్‌ వేదికగా ఆరోపణలు చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. 

2021 సెప్టెంబర్‌లో ఇంటర్నేషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన టేలర్‌.. 2019లో ఓ ప్రముఖ భారత వ్యాపారవేత్త ఆహ్వానం మేరకు భారత్‌కు వచ్చానని, ఆ సందర్భంగా ఓ పార్టీలో కొందరు తనకు కొకైన్‌ ఆఫర్‌ చేశారన్నాడు. తాను కొకైన్‌ సేవిస్తుండగా వీడియోలు తీసి బెదిరించడం మొదలుపెట్టారని, ఈ క్రమంలోనే మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కూడా చేయమన్నారని సంచలన స్టేట్‌మెంట్‌ను విడుదల చేశాడు.