
వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ భారీ సెంచరీ చేసి అదరగొట్టాడు. ఢిల్లీ వేదికగా అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో 175 పరుగులు చేసి విండీస్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చూపించాడు. దాదాపు 70 స్ట్రైక్ రేట్ తో జైశ్వాల్ బ్యాటింగ్ చేయడం విశేషం. ఈ టీమిండియా ఓపెనర్ ను ఔట్ చేయడానికి విండీస్ బౌలర్ల వల్ల కాలేదు. చివరికి రనౌట్ రూపంలో ఔట్ కావడంతో వెస్టిండీస్ జట్టు ఊపిరి పీల్చుకుంది. ఈ మ్యాచ్ లో జైశ్వాల్ ఇన్నింగ్స్ కు విండీస్ దిగ్గజ బ్యాటర్ బ్రియాన్ లారా ఫిదా అయ్యాడు. మ్యాచ్ తర్వాత జైశ్వాల్ ఇన్నింగ్స్ ను ప్రశంసించాడు.
తొలి రోజు మ్యాచ్ ముగిసిన తర్వాత లారా జైశ్వాల్ దగ్గరకు వచ్చి సరదాగా ముచ్చటించాడు. ఈ సంభాషణలో భాగంగా ఈ విండీస్ లెజెండ్ ఓ స్పెషల్ రిక్వెస్ట్ చేయడం గమనార్హం. మరీ ఎక్కువగా మా బౌలర్లను కొట్టొద్దని సరదాగా రిక్వెస్ట్ చేశాడు. ఆ తర్వాత 'సరదాగా అంటున్నాను. నువ్వు చాలా బాగా ఆడావు’ అని ప్రశంసించాడు. యశస్వి కూడా నవ్వుతోనే సమాధానం ఇచ్చాడు. ఆ వీడియోను బీసీసీఐ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మ్యాచ్ లో తొలి రోజు జైశ్వాల్ సెంచరీ బాదితే రెండో రోజు గిల్ శతకం కొట్టాడు.
జైస్వాల్ 604 రోజుల తర్వాత స్వదేశంలో మూడు అంకెల మార్కును చేరుకున్నాడు. చివరిసారిగా 2024లో ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో జైశ్వాల్ సెంచరీ చేశాడు. ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో రెండు డబుల్ సెంచరీలు చేయడం విశేషం. అప్పటి నుంచి స్వదేశంలో ఐదు హాఫ్ సెంచరీలు చేసినా సెంచరీ మార్క్ అందుకోలేకపోయారు. 23 ఏళ్ళ వయసులోనే 7 సెంచరీలు బాదిన జైశ్వాల్ అరుదైన ఘనతలను అందుకున్నాడు. అతిచిన్న వయస్సు (23 ఏళ్లు)లోనే టెస్ట్ ఫార్మాట్లో అత్యధిక (5) సార్లు 150 ప్లస్ స్కోర్లు సాధించిన రెండో ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు. జైశ్వాల్ 23 ఏళ్ల వయసులో 5 సార్లు 150 ప్లస్ స్కోర్ చేశాడు. జైశ్వాల్ కంటే ముందు ఈ రికార్డ్ ఆసీస్ దిగ్గజం సర్ బ్రాడ్ మాన్ పేరిట ఉంది.
బ్రాడ్ మాన్ 23 ఏళ్ల వయసులో 8 సార్లు 150 ప్లస్ స్కోర్ చేసి ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఈయన తర్వాత 5 సార్లు 150 స్కోర్ చేసి జైశ్వాల్ రెండో స్థానంలో ఉన్నాడు. తద్వారా148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో డాన్ బ్రాడ్‌మాన్ మాత్రమే సాధించిన ఘనతను యశస్వి జైస్వాల్ సాధించడం ద్వారా పుస్తకాలలో తన పేరును లిఖించుకున్నాడు. 22 ఫోర్లతో 258 బంతుల్లో 175 పరుగులు చేసిన జైశ్వాల్ టెస్ట్ క్రికెట్ కెరీర్లో ఇది ఏడో సెంచరీ కావడం విశేషం. ఇందులో 5 సెంచరీలు 150 ప్లస్ స్కోర్ కావడం మరో హెలైట్.