సచిన్ 100 సెంచరీల రికార్డ్ కోహ్లీ బ్రేక్ చేయలేడు..కారణం కూడా చెప్పేసిన బ్రియాన్ లారా

సచిన్ 100 సెంచరీల రికార్డ్ కోహ్లీ బ్రేక్ చేయలేడు..కారణం కూడా చెప్పేసిన బ్రియాన్ లారా

భారత క్రికెట్ దిగ్గజం, క్రికెట్ గాడ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్ లో 100 సెంచరీలు చేసి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. అయితే టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ అసాధారణ ఆటతీరుతో భవిష్యత్తులో టెండూల్కర్ రికార్డ్ బ్రేక్ చెస్ పనిలో ఉన్నాడు. ఇప్పటివరకు 80 సెంచరీలు చేసిన కోహ్లీ మరో 21 సెంచరీలు చేస్తే సచిన్ ఆల్ టైం రికార్డ్ బ్రేక్ చేసి సరి కొత్త చరిత్ర సృష్టిస్తాడు. క్రికెట్ లవర్స్, దిగ్గజాలు, క్రికెట్ నిపుణులు సైతం సచిన్ 100 సెంచరీల రికార్డ్ బ్రేక్ చేస్తాడని ధీమాగా చెప్పుకొస్తున్నారు.
 
ప్రస్తుతం విరాట్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. ఫిట్ నెస్ లోనూ కోహ్లీకి తిరుగులేదు. ఈ నేపథ్యంలో సచిన్ 100 సెంచరీల రికార్డ్ చేయడం పెద్ద కష్టం కాదనే అభిప్రాయలు వినిపిస్తున్నాయి. అయితే సచిన్ 100 సెంచరీల రికార్డును కోహ్లీ బ్రేక్ చేయడం కష్టమేనని విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా చెప్పుకొచ్చాడు. ఫిట్ గా ఉన్నా..  కోహ్లి ఇంకా కుర్రాడేమీ కాదని..లారా తెలియజేశాడు. 

ఆనంద్ బజార్ పత్రికతో లారా మాట్లాడుతూ.. "కోహ్లి వయస్సు ఇప్పుడు 35. కోహ్లీ ఖాతాలో ఇప్పటివరకు 80 సెంచరీలు ఉన్నాయి. కానీ కోహ్లీ 100 సెంచరీల మార్క్ చేరుకోవాలంటే మరో 20 సెంచరీలు అవసరం. ప్రతి సంవత్సరం కోహ్లీ ఐదు సెంచరీలు కొడితే మరో నాలుగేళ్లు సమయం పడుతుంది. అప్పుడు కోహ్లీకి 39 సంవత్సరాలు. ఈ వయసులో సెంచరీలు కొట్టడం చాలా కఠినం". అని ఈ విండీస్ దిగ్గజం జోస్యం చెప్పాడు.
 
భారత్ వేదికగా ఇటీవలే జరిగిన ప్రపంచ కప్ సెమీ-ఫైనల్‌లో కోహ్లీ తన 50వ ODI సెంచరీని ముంబైలోని వాంఖడే స్టేడియంలో చేసి వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్(49) రికార్డ్ బ్రేక్ చేసాడు. ఈ వరల్డ్ టోర్నీ మొత్తం టాప్ ఫామ్ కొనసాగించిన కోహ్లీ.. 11 మ్యాచ్ ల్లో 765 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు. ప్రస్తుతం కోహ్లీ దక్షిణాఫ్రికాతో జరగబోయే టెస్టు సిరీస్ కు సిద్ధమవుతున్నాడు. డిసెంబర్ 26 నుంచి సెంచురియాన్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభం కానుంది.