నిబంధనలకు విరుద్ధంగా ఇటుకబట్టీలు

నిబంధనలకు విరుద్ధంగా ఇటుకబట్టీలు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : నిబంధనలకు విరుద్ధంగా జిల్లాలోని పలు ఏజెన్సీ  ప్రాంతాల్లో  ఇటుక బట్టీలను పెడుతున్నారు. అయినా  అధికారులు  పట్టించుకోకపోవడం లేదు.  యథేచ్ఛగా వెలుస్తున్న ఇటుకబట్టీలు పర్యావరణాన్ని దెబ్బ తీస్తున్నాయి. వీటినిర్వాహణ కోసం చెట్లను నరుకుతున్నారు, మట్టిని అక్రమంగా తవ్వుతున్నారు.  హరితహారం చెట్లు కూడా ఇటుక బట్టీల్లో మసి అవుతున్నాయి.  అటవీ ప్రాంతాల్లోనూ నిబంధనలకు విరుద్ధంగా ఇటుకబట్టీలు నడుస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంలేదు.  

ప్రభుత్వ ఖజానాకు గండి .. 

మైనింగ్​ డిపార్ట్​మెంట్​ నుంచి 20 లోపు మాత్రమే జిల్లాలో ఇటుక బట్టీలకు పర్మిషన్​ ఉంది. కానీ అనధికారికంగా 50 నుంచి 70కి పైగా బట్టీలు వెలిశాయి. కొత్తగూడెం, అశ్వారావుపేట, ఇల్లెందు నియోజకవర్గాల్లో ఎక్కువగా ఇటుక బట్టీలున్నాయి. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్​కు కూత వేటు దూరంలో ఉన్న లక్ష్మీదేవిపల్లి మండలంతో పాటు అనిశెట్టిపల్లి, బొమ్మనపల్లి ప్రాంతాల్లో రూల్స్​కు విరుద్ధంగా  ఇటుక బట్టీ వ్యాపారాలు చేస్తున్నారు. మట్టి తవ్వకాలకు అనుమతి లేకున్నా తవ్వుకుపోతున్నారు. వీటికోసం  సమీప అడవుల్లోని చెట్లను నరుకుతున్నారు.   బట్టీలను కాల్చడం వల్ల వచ్చే పొగతో  కాలుష్యం పెరుగుతోంది. దీంతో పరిసర ప్రాంతాల్లోని ప్రజలు శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బందులు పడ్తున్నారు  కలెక్టరేట్​కు సమీపంలోని కారుకొండ రామారాం, లోతువాగు, మాదిగప్రోలు, రేగళ్ల, అనిశెట్టిపల్లి, పెనగడప పరిసర ప్రాంతాల్లో  ఇటుక బట్టీలు కొనసాగుతున్నాయి.  రైతుల పేర పెద్ద పెద్ద మోటార్లు పెట్టి ముర్రెడు వాగు నీటిని తోడుతూ బట్టీలకు మరిలిస్తున్నారు. దీంతో పంటలు సాగు చేసే రైతులకు పూర్తి స్థాయిలో నీళ్లందడం లేదు. బట్టీల ఏర్పాటుతో పొలాలకు వెళ్లే దారులు  నాశనం అవుతన్నాయని రైతులు వాపోతున్నారు.   రైతులకు కరెంట్​ ఉచితం కావడంతో అదే కరెంట్​ను బట్టీలకు వాడుతున్నారు. అయినా విద్యుత్​ శాఖాధికారులు పట్టించుకోవడం లేదు. పలు శాఖల్లోని అధికారులకు కమిషన్లు ఇస్తూ ఈ తతంగం నడిపిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. తాము కరెక్ట్​గానే ఉన్నామని చెప్పడానికి అధికారులు అప్పుడప్పుడు తనిఖీలు చేస్తూ ఫైన్లు వేసి  వెళ్లిపోతున్నారు. ఎండా కాలంలో దుమ్ము, వర్షాకాలంలో బురదతో తీవ్ర ఇబ్బందులు పడ్తున్నామని  స్థానిక ప్రజలంటున్నారు. బట్టీల్లో బాల  కార్మికులతో పనులు చేయిస్తున్నారు. గతంలో లక్ష్మీదేవిపల్లి మండలంలోని ఓ ఇటుకబట్టీలో అనుమానాస్పదంగా ఒడిశా వాసి మృతి చెందితే గుట్టుచప్పుడు కాకుండా దహనం చేశారు. కుటుంబసభ్యులకు కొంత ఆర్థిక సాయం చేసి చేతులు దులుపుకున్నారు. పనిచేస్తున్న కార్మికులు అనారోగ్యం బారిన పడితే పట్టించుకునే దిక్కుండదు. కూలీలకు డబ్బులు బ్యాంక్​ ఖాతాలో జమచేయాల్సి ఉన్నా ఎంతోకొంత చేతికి ఇచ్చి నడిపిస్తున్నారు.  


తనిఖీలు చేసి చర్యలు తీసుకుంటాం

అనధికారికంగా ఇటుక బట్టీలు నడుస్తున్నట్టు తెలిస్తే తనిఖీలు చేస్తున్నాం. దమ్మపేట, లక్ష్మీదేవిపల్లి మండలాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఇటుకబట్టీలు ఏర్పాటు చేసిన విషయం మా దృష్టికి వచ్చింది. సిబ్బంది లేకపోవడంతో తనిఖీలు చేయడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పర్మిషన్​ లేకుండా ఇటుకబట్టీలు కొనసాగిస్తే యాజమానులకు నోటీసు​లిస్తాం. అవసరమైతే సీజ్​ చేస్తాం. 

- జైసింగ్​, మైనింగ్​ ఏడీఈ,  భద్రాద్రి కొత్తగూడెం