లాటరీలో ప్రేమికున్ని దక్కించుకున్న యువతి

లాటరీలో ప్రేమికున్ని దక్కించుకున్న యువతి

ప్రేమ.. ఆ తర్వాత పెళ్లి. పెద్దలు ఒప్పుకుంటే సరే.. లేకుంటే మాత్రం లవ్ మ్యారెజ్. ఇదంతా బాగానే ఉంది. కానీ, అదే ట్రయాంగిల్ లవ్ స్టోరీ అయితే.. ఇద్దరు యువతులు ఒకే అబ్బాయిని ప్రేమిస్తే.. ఎవరు త్యాగం చేస్తారు? ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఇలాంటి ట్రయాంగిల్ లవ్ స్టోరీ కర్నాటకలో వెలుగులోకి వచ్చింది. లాటరీ ద్వారా ఓ వధువు తన ప్రేమికున్ని సొంతం చేసుకుంది.

హాసన జిల్లాలోని సకలేశపుర గ్రామానికి చెందిన ఓ యువకుడు సోషల్ మీడియా ద్వారా వేర్వేరు ప్రాంతాల్లోని ఇద్దరు యువతులను ప్రేమించాడు. ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమాయణం కొనసాగించాడు. ఇద్దరు యువతులు ఆ యువకున్ని గాఢంగా ప్రేమించారు. విషయం తెలిసిన తర్వాత కూడా ఇద్దరూ అతనే కావాలని పట్టుబడ్డారు. ప్రేమికుడు  లేకుండా బతకలేమన్నారు. ఖచ్చితంగా అతన్ని పెళ్లి చేసుకుంటామని చెప్పారు. 

దాంతో తనను ఇష్టపడ్డ ఇద్దరు యువతుల్లో ఎవరిని పెళ్లి చేసుకోవాలో యువకుడికి అర్థం కాలేదు. గ్రామస్తులు పంచాయితీ పెట్టినా ఫలితం లేదు. ఓ యువతి ప్రేమికుడు లేకుండా జీవించలేనంటూ విషం తాగింది. కుటుంబ సభ్యులు సకాలంలో ఆస్పత్రికి తరలించడంతో ఆమె ప్రాణగండం నుంచి బయటపడింది. 

వ్యవహారం మరింత ముదరడంతో.. ఇద్దరు యువతులు యువకుడి గ్రామానికి వెళ్లారు. స్థానికులు ఎంత చెప్పినా వినకుండా యువకుడు తనకే అంటే తనకే దక్కాలని పట్టుబట్టారు. సమస్య పరిష్కారం కోసం గ్రామస్తులు ఓ ఉపాయం ఆలోచించారు. లాటరీ ద్వారా వధువును ఎంపిక చేస్తామన్నారు. లాటరీలో పేరు రాని వారు మౌనంగా వెళ్లిపోవాలని కండీషన్ పెట్టారు. దీనికి ఇద్దరు యువతులు అంగీకరించారు. లాటరీలో విషం తాగిన అమ్మాయి పేరు వచ్చింది. దాంతో పెద్దలు యువకుడితో ఆమె వివాహం జరిపించారు. కాగా, లాటరీలో పేరు రాని యువతి.. పేరొచ్చిన యువతికి ఆల్ ది బెస్ట్ చెప్పి, షేక్ హ్యాండ్ ఇచ్చి మరీ సపోర్ట్ చేసింది. దాంతో అక్కడున్న వారంతా చప్పట్లతో సపోర్ట్ చేసిన యువతిని అభినందించారు.