
బీహార్ లో మరో వంతెన కుప్పకూలిపోయింది. సివాన్‌లో జూన్ 22న ఉదయం మహారాజ్‌గంజ్ జిల్లాలోని పటేధీ బజార్ మార్కెట్లను దర్భంగాలోని రామ్‌గఢ్ పంచాయితీతో కలిపే వంతెన కుప్పకూలిపోయింది. ఈ వంతెన పై ప్రతిరోజూ వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. ఇవాళ ఉదయం ఒక్కసారిగా భారీ శబ్ధంతో వంతెన కూలిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. ఈ వంతెన సుమారు 40 లేదా -45 సంవత్సరాల క్రితం నిర్మించబడిందని స్థానికులు చెప్పారు.వంతెన కుప్పకూలిపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కల్గుతోందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
బిహార్‌లోని అరారియా జిల్లాలో బక్రా నదిపై 12 కోట్లతో నిర్మించిన వంతెన జూన్ 18న కూలిపోయిన సంగతి తెలిసిందే. మంగళవారం జరిగిన ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. వారం రోజులు కూడా కాకముందే సివాన్ లో ఇవాళ మరో వంతెన కూలడంతో నిర్మాణంలో నాణ్యతా లోపాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.