ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు :  ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అడిషనల్​కలెక్టర్ మనూ చౌదరి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ‘ప్రజావాణి’ హాల్​లో  ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు  ఫిర్యాదులను తీసుకున్నామని తెలిపారు.  వాటిని వెంటనే పరిష్కరించేందుకు ఆఫీసర్లు  చొరవ చూపాలని కోరారు. జిల్లాలో మొత్తం 33 ఫిర్యాదులు వచ్చినట్లు మనూచౌదరి తెలిపారు.  ఎస్పీ  ఆఫీస్​లో 5 ఫిర్యాదులు తీసుకున్నట్లు ఎస్పీ మనోహర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ నర్సింగరావు, సీపీవో భూపాల్ రెడ్డి, వివిధ శాఖల ఆఫీసర్లు పాల్గొన్నారు.

వడ్ల  కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలి

కలెక్టర్​ కోయ శ్రీహర్ష

నారాయణపేట, వెలుగు: జిల్లాలో  వానాకాలం వరి కోతలు ప్రారంభం కావడంతో వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు.  సోమవారం స్థానిక స్కిల్ డెవలప్​మెంట్​సెంటర్ లో  ఎమ్మెల్యే ఎస్​.రాజేందర్​రెడ్డి,  డీసీసీబీ చైర్మన్​నిజాం పాష తో కలిసి  వడ్ల కొనుగోలుపై  రైస్ మిల్లర్లు, ఏవో, ఏఈవోలు రైతు సంఘాల లీడర్లు, ట్రాన్స్​పోర్టు కాంట్రాక్టర్లతో మీటింగ్​నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు వడ్ల కొనుగోళ్లపై అవగాహన కల్పించే వాల్​పోస్టర్​ను కలెక్టర్​రిలీజ్​చేశారు. అనంతరం మాట్లాడుతూ రైతు వద్ద వడ్లు కొనుగోలు చేసిన 48 గంటల్లో డబ్బులు  ఖాతాలో పడేలా చూడాలన్నారు. క్వింటాల్​కు రూ. 2,060 మద్దతు ధరకు కొనుగోలు చేయాలన్నారు. రైతులు వడ్లను ఇంటివద్దనే ఆరబెట్టుకుని తేమశాతం 17 వరకు ఉండే విధంగా రైతులకు అవగాహన కల్పించాలన్నారు.

ఏ కొనుగోలు కేంద్రం నుంచి ఎంత ధాన్యం ఏ రైస్ మిల్ కు పంపించాలనేది  ముందస్తుగానే మార్క్ చేశామని, దానికి వ్యతిరేకంగా  మిల్లుకు వడ్లను తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.  ప్రతి కొనుగోలు కేంద్రంలో అవసరమైన తేమ యంత్రాలు, టార్పాలిన్ లు, వడ్లు శుభ్రం చేసే మెషిన్లు, తాగు నీటి సౌకర్యం, మరుగుదొడ్లు లాంటి కనీస సౌకర్యాలను కల్పించాలని సూచించారు.   జిల్లా నుంచి ఈ సారి 3,16,446 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయినట్లు అంచనాలు ఉన్నాయన్నారు. అంతకుముందు జిల్లా కేంద్రంలో కొత్తగా నిర్మించిన ఈవీఎం గోదాంను కలెక్టర్​ పరిశీలించారు. కార్యక్రమంలో అడిషనల్​ కలెక్టర్​ పద్మజారాణితో పాటు సంబంధిత శాఖల ఆఫీసర్లు 
పాల్గొన్నారు.

ప్రిన్సిపాల్​పై చర్యలు తీసుకోవాలి

మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ గర్ల్స్  కాలేజీ స్టూడెంట్స్ ను ఇబ్బందులకు గురి చేసిన  ప్రిన్సిపాల్ కౌస్తర్ పై చర్యలు తీసుకోవాలని  తెలంగాణ పట్టభద్రుల సంఘం జిల్లా కార్యదర్శి భరత్, గిరిజన సంఘం నాయకులు సంతోష్ రాథోడ్ లు డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని డీఐఈవో ఆఫీస్​వద్ద స్టూడెంట్లతో కలిసి ఆందోళన చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కాలేజీ స్టూడెంట్ల సెల్​ఫోన్లు తీసుకుని ఇంటికి వెళ్లేముందు ఇస్తామని ప్రిన్సిపాల్ ఆమె చాంబర్​లో పెట్టుకుని వెళ్లిపోయిందన్నారు. దీంతో సాయంత్రం ఇండ్లకు వెళ్లాల్సిన స్టూడెంట్లు ఆందోళనకు గురయ్యారన్నారు. ఫోన్​చేసినా లిఫ్ట్​చేయలేదన్నారు.  చివరకు కొంత మంది స్టూడెంట్లకు సాయంత్రం  తాము  డబ్బులు ఇచ్చి వేరే గ్రామాలకు పంపించామన్నారు. కొంతమంది పేరెంట్స్​కు సమాచారం ఇవ్వగా వారు వచ్చి తీసుకెళ్లారన్నారు.  

‘మనబడి’ పనులను స్పీడప్​ చేయండి

అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్  

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: ‘మన ఊరు- మన బడి’ కింద చేపట్టిన స్కూల్  నిర్మాణ పనులను స్పీడప్​చేయాలని అడిషనల్ కలెక్టర్ తేజస్  నందలాల్ పవార్​ఇంజినీరింగ్​ ఆఫీసర్లను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్​రెవెన్యూ మీటింగ్ హాల్​లో  ‘మన బడి’ పనులపై ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ  పనులు పూర్తయిన చోట  వెంటనే బిల్లులను చెల్లించాలని ఆదేశించారు. ఇప్పటి వరకు 47  స్కూళ్లకు గాను 17  స్కూళ్లలో పెయింటింగ్  పూర్తయిందని ఆఫీసర్లు ఆయన దృష్టికి తీసుకు రాగా, వారం లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ఎఫ్​టీవో జనరేషన్, బిల్లుల చెల్లింపులలో పురోగతి తీసుకురావాలని, పనులలో వెనుకబడిన మండలాలపై ఎక్కువ ఫోకస్​పెట్టాలన్నారు.  కిచెన్ షెడ్లు, ప్రహరీ నిర్మాణ పనులను స్పీడప్​చేయాలన్నారు. టెండర్ పూర్తయిన చోట వారం రోజుల్లో పనులు ప్రారంభించాలని ఆదేశించారు. డీఆర్డీవో యాదయ్య, డీపీవో వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్ ఈఈ నరేందర్,ఆర్​అండ్​బీ ఈఈ స్వామి, టీఎంఐసీడీసీ ఈఈ జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి

ప్రజావాణి ద్వారా స్వీకరించిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సూచించారు. ‘ప్రజావాణి’ లో భాగంగా  సోమవారం ఆయన ప్రజల నుంచి కంప్లైంట్లు తీసుకున్నారు. అనంతరం జిల్లా అధికారులతో సమీక్షిస్తూ ప్రజావాణి ద్వారా తీసుకున్న ఫిర్యాదులను డిలే చేయొద్దన్నారు. క్షేత్రస్థాయికి వెళ్లి అయినా స్పీడ్​గా పరిష్కరించాలన్నారు. స్పెషల్ కలెక్టర్ పద్మశ్రీ, జడ్పీ సీఈవో జ్యోతి, డీపీవో వెంకటేశ్వర్లు, డీఆర్డీవో యాదయ్య పాల్గొన్నారు.

కార్మికులు పోరాటాలకు సిద్ధం కావాలి

మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య

మక్తల్, వెలుగు:  కార్మికులు పోరుబాట పడితేనే బతుకులు బాగుపడుతాయని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే  గుమ్మడి నర్సయ్య, ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు హన్మేశ్​అన్నారు.  సోమవారం పట్టణంలోని రాయల్​ ఫంక్షన్​ హాల్​లో  జరిగిన భవన నిర్మాణ కార్మికుల రాష్ట్ర మహాసభకు వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతు రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు పనిచేస్తున్నారన్నారు. భవన నిర్మాణ కార్మికులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఓటు బ్యాంకు గానే చూస్తున్నాయే.. తప్పా వారి జీవితాలను  బాగు చేసే ఆలోచన చేస్తలేవన్నారు. సంక్షేమ బోర్డులు పెట్టినా కార్మికుల జీవితాలు మారడం లేదన్నారు.

భవన నిర్మాణ కార్మికులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ఆకాశాన్ని తాకే భవనాలను నిర్మించినా.. వారి జీవితాలు మాత్రం గుడిసెలకే పరిమితమవుతున్నాయన్నారు.   భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డులో రూ. 18 వందల కోట్లు ఫండ్స్​మూలుగుతున్నా.. భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చే సంక్షేమ పథకాలు చాలా చిన్నవిగా ఉన్నాయన్నారు.  కార్మికుల సహజ మరణ స్కీం కింద రూ 1.30 లక్షలు ఇస్తున్నారని, దీనిని రూ. 5 లక్షలకు పెంచాలని, ప్రమాద మరణానికి రూ. 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతకు ముందు పట్టణంలో కార్మికులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐఎంఎల్​ప్రజాపంథా రాష్ట్ర నాయకుడు కృష్ణ, ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యం, సీపీఐఎంల్​ప్రజాపంథా  జిల్లా కార్యదర్శి రాము, ఐఎఫ్టీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి రామయ్య తదితరులు పాల్గొన్నారు.  

వైద్యారోగ్యశాఖ అక్రమాలపై కలెక్టర్ ​సీరియస్

గురువారం లోగా రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశం

వనపర్తి టౌన్, వెలుగు: జిల్లా వైద్యారోగ్య శాఖ అవినీతి అక్రమాలపై సోమవారం ‘వనపర్తి వైద్యారోగ్యశాఖలో అక్రమాలకు అడ్డేది?’ అని వెలుగులో పబ్లిష్​అయిన కథనంపై కలెక్టర్​షేక్​ యాస్మిన్​ బాషా స్పందించారు. వైద్యారోగ్య 
శాఖలో అసలు ఏం జరుగుతోంది? అని మండిపడినట్లు తెలిసింది. డీజిల్ కుంభకోణం ఏమిటంటూ..  ఈ నెల 10వ తేదీ లోగా రిపోర్టు ఇవ్వాలని డీఎంహెచ్ వో  డాక్టర్ రవిశంకర్ ను కలెక్టర్ ఆదేశించారు.

మత్స్యకారుల అభివృద్ధికి కృషి

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు :  చేప పిల్లలను అందజేసి మత్స్యకారులను ఆర్థికంగా అభివృద్ధి చేస్తున్నామని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. సోమవారం నాగర్ కర్నూల్ కేసరి సముద్రంలో 4 లక్షల చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో చెరువులు, కుంటలు నిండుకుండలా మారాయని,  వాటిలో చేప పిల్లలు సందడి చేస్తున్నాయన్నారు. మత్స్య సంపద సమృద్ధిగా పెరుగుతుండడంతో స్థానికంగా ఉపాధి లభిస్తుందన్నారు.  సంచార చేపల విక్రయ వాహనాలను 60 శాతం రాయితీతో ప్రభుత్వం అందజేస్తోందన్నారు. డీసీసీబీ డైరెక్టర్ జక్క రఘునందన్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ కల్పన,  జడ్పీటీసీ శ్రీశైలం, మున్సిపల్ కమిషనర్ జయంత్ కుమార్ పాల్గొన్నారు. 

జీపు, కారు ఢీకొని ఒకరు మృతి

ఏడుగురికి గాయాలు 

మరికల్, వెలుగు : మండల పరిధిలో జీపు, కారు ఎదురెదురుగా ఢీకొని ఓ మహిళ చనిపోగా, ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్సై అశోక్​బాబు  వివరాల ప్రకారం.. సోమవారం మరికల్ మండల కేంద్రం ​నుంచి జీపు 20 మంది ప్రయాణికులతో మహబూబ్​నగర్ వైపు వెళ్తుండగా.. పట్టణం దాటగానే మరికల్​వైపు వస్తున్న కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో జీపు పల్టీలు కొట్టడంతో  8 మందికి  తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు  వారిని మహబూబ్​నగర్​ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చిన్నచింతకుంట మండలం బండ్రవల్లి గ్రామానికి చెందిన ఉమాదేవి (70) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ  చనిపోయింది.  

మిగతా ఏడుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఎస్సై  తెలిపారు. చికిత్స పొందుతున్న వారిలో ముగ్గురు  గవర్నమెంట్​టీచర్లు ఉన్నారు. ఒకరు మరికల్​ మండలం ఎక్లాస్​పూర్​ స్కూల్​కు చెందిన వినోద్ కాగా, ఎలిగేండ్ల స్కూల్​లో పనిచేస్తున్న పద్మజ, లక్ష్మి ఉన్నారు.  అలాగే మరికల్​కు చెందిన వీరమ్మ, శ్రీను, ముక్తర్​, మక్తల్​కు చెందిన అపర్ణలకు గాయాలయయన్నారు. కారులోని వ్యక్తికి కూడా స్వల్ప గాయాలయ్యాయన్నారు.  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.   

పందుల గుంపును ఢీకొట్టిన బైక్​..

ఒకరు మృతి, మరొకరికి గాయాలు

మదనాపురం, వెలుగు: మదనాపురం సమీపంలో పందుల గుంపును ఓ బైక్ ఢీకొని  ఒకరు చనిపోగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం..  సోమవారం ఉదయం రామన్​పాడు గ్రామానికి చెందిన గోపాల్ మదనాపురం వైపు బైక్​పై వెళ్తుండగా,  కొత్తకోట కు చెందిన హమాలీ కథలయ్య గోపాల్ ను లిఫ్ట్​ అడిగి బైక్​ఎక్కాడు. ఇద్దరూ  బైక్​పై మదనాపురం సమీపంలోకి రాగానే రోడ్డుపైకి ఒక్కసారిగా పందుల గుంపు రావడంతో బైక్​ అదుపు తప్పి పందుల గుంపును ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ కిందపడ్డారు.  కథలయ్య స్పాట్​లోనే చనిపోగా.. గోపాల్​కు తీవ్రగాయాలు కాగా స్థానికులు మెరుగైన చికిత్స కోసం  హైదరాబాద్​కు 
తరలించారు.

అంధులమని అధైర్య పడకండి

గద్వాల టౌన్, వెలుగు:  అంధులమని అధైర్య పడకుండా ముందుకు సాగి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని  అడిషనల్​ జిల్లా జడ్జి ప్రభాకర్ అన్నారు. సోమవారం గద్వాల టౌన్ లోని అంధుల ఆశ్రమ పాఠశాలలో లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. హాజరైన  జడ్జి మాట్లాడుతూ ఎందరో అందులు ఉన్నత శిఖరాలను అధిరోహించారని, ఒకరు జడ్జి కూడా ఉన్నారని గుర్తు చేశారు. అంధులమని బెంగ పెట్టుకోకుండా ధైర్యంగా ముందుకు సాగితే విజయం వరిస్తుందన్నారు. ఈ సందర్భంగా అంధులకు ఆయన ఫ్రూట్స్ పంపిణీ చేశారు.  ఈ కార్యక్రమంలో గద్వాల టౌన్ ఎస్సై అబ్దుల్ సుకూర్, స్కూల్​ప్రిన్సిపాల్​రంగయ్య పాల్గొన్నారు. 

కిక్ బాక్సింగ్ పోటీల్లో జిల్లాకు పతకాలు

మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: ఢిల్లీ బాల్కతోరా ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న  ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ ఓపెన్ చాంఫియన్ షిప్ లో ఆర్కే స్పోర్ట్స్ స్టూడెంట్లు పథకాలు సాధించినట్లు మాస్టర్ కె.రవికుమార్  తెలిపారు. ఈ నెల 2 నుంచి 6 వరకు జరిగిన ఈ పోటీల్లో మ్యూజికల్ ఫామ్ 8 ఏళ్ల విభాగంలో , ఆగస్త్య స్థాయి 2 స్థానం సాధించగా, 10ఏళ్ల విభాగంలో దీపేశ్​, దినేశ్​, వరుసగా 2,3వ స్థానం సాధించగా, 11 ఏళ్ల విభాగంలో ఓంకార్, 2వ స్థానం సాధించారు.  14 ఏళ్ల విభాగంలో జస్వంత్ 3 స్థానం సాధించగా, 19 ఏళ్ల విభాగంలో జయదీప్ సింగ్ గోల్డ్​మెడల్​ సాధించాడు. గర్ల్స్ 11 ఏళ్ల విభాగంలో నవ్యశ్రీ 3 వ స్థానం సాధించగా, 16 ఏళ్ల విభాగంలో సాయిలక్ష్మి 2వస్థానం సాధించారు. 20 ఏళ్ల విభాగంలో యామిని నాయుడు 3వస్థానం సాధించారు.  వీరికి కిక్​ బాక్సింగ్ జాతీయ అధ్యక్షుడు అరవింద్ అంగర్వాల్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ రాష్ర్ట అధ్యక్షుడు రామాంజనేయులు, ప్రధాన కార్యదర్శి మహిపాల్, నిఖిల్ రవికుమార్ పాల్గొన్నారు.   

విజ్ఞానం పెంచేందుకే చెకుముకి సంబురాలు

అడిషనల్ కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ 

వనపర్తి, వెలుగు: స్టూడెంట్లకు విజ్ఞానం పెంపొందించేందుకే చెకుముకి సంబురాలు నిర్వహిస్తున్నట్లు అడిషనల్ కలెక్టర్ ఆశీష్​సంగ్వాన్ చెప్పారు. సోమవారం కలెక్టర్ ఆఫీస్​లో  ‘చెకుముకి సంబురాలు– - 2022’  వాల్ పోస్టర్లను ఆయన రిలీజ్​చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సైన్స్, మ్యాథ్స్​, సోషల్, తదితర అంశాలపై పోటీలు నిర్వహించి, స్కూల్ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలలో విజేతలను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని స్టూడెంట్లు  వినియోగించుకోవాలని కోరారు. వివరాలకు 89191 54196, 94418 95618 ఫోన్ నంబర్లను సంప్రదించాలని  ఆయన  చెప్పారు. డీఈవో రవీందర్, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు జితేందర్, 
జిల్లా ఉపాధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఆలయాలకు కార్తీక పౌర్ణమి శోభ

కార్తీక పౌర్ణమి వేడుకలను పాలమూరు ప్రజలు సోమవారం ఘనంగా జరుపుకున్నారు.  మంగళవారం జరుపుకోవాల్సి ఉండగా, చంద్రగ్రహణం కారణంగా ఒక రోజు ముందుగానే కార్తీక దీపాలు పెట్టారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని ప్రధాన ఆలయాలు జోగులాంబ తదితర ఆలయాలు కార్తీక శోభలో వెలిగిపోయాయి. పలువురు భక్తులు శివాలయాల్లో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు వాయినాలు ఇచ్చి పుచ్చు కున్నారు. – నెట్​వర్క్, వెలుగు