ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

మెదక్, వెలుగు : పురుషులతో సమానంగా అన్ని రంగాలలో రాణిస్తున్న మహిళలపై వివక్ష చూపొద్దని లోకల్​బాడీ అడిషనల్​కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. మహిళలపై హింస నిర్మూలన కోసం నిర్వహిస్తున్న అంతర్జాతీయ దినోత్సవంలో భాగంగా సంతకాల సేకరణ ఉద్యమం చేపట్టారు. మంగళవారం మహిళా, శిశు సంక్షేమ శాఖ కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ పై  ఆమె సంతకం చేసి మాట్లాడారు. మహిళలపై హింసను నిర్మూలించాలని, వారిపై  వివక్ష చూపరాదనే అంశంతో నవంబర్ 25 నుంచి ఈనెల 10 వరకు వివిధ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. బుధవారం నుంచి శుక్రవారం వరకు సెమినార్ల ద్వారా పలు విషయాలపై మహిళలకు అవగాహన కలిగిస్తామని చెప్పారు. మహిళలకు సమస్యలు ఎదురైనప్పుడు 181, బాలికలు 1098 హెల్ప్ లైన్ కు తెలిపి అధికారుల సహాయం పొందాలని సూచించారు. కార్యక్రమంలో మహిళా శిశు, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమాధికారి బ్రహ్మాజీ, మహిళా శక్తి కేంద్రం అధికారి సంతోషి, డిప్యూటీ జిల్లా వైద్యాధికారి విజయనిర్మల, డాక్టర్ నవీన్ పాల్గొన్నారు.
 

ఇన్నోవేషన్లపై స్టూడెంట్స్​ను ప్రోత్సహించాలి


 మెదక్, వెలుగు : స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్–2022 కార్యక్రమంలో భాగంగా మంగళవారం మెదక్​ పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత  పాఠశాలలో టీచర్లకు అవగాహన కల్పించారు.  ఈ సందర్భంగా స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్ రాష్ట్ర పరిశీలకురాలు గీతాంజలి మాట్లాడుతూ తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్, పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో మూడేళ్లుగా ఈ కార్యక్రమం కొనసాగుతోందని తెలిపారు. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులు దీనికి అర్హులని చెప్పారు. ఇందులో విద్యార్థులను గ్రూపులుగా ఏర్పాటు చేసి వారికి, ఇన్​చార్జి టీచర్లకు ఆన్​ లైన్​ లో శిక్షణ ఉంటుందని తెలిపారు. శిక్షణ పూర్తయిన తర్వాత ఆ విద్యార్థులు వారి ఐడియాలను ఆన్​ లైన్​లో పంపితే  ఉత్తమమైన వాటిని ఎంపిక చేస్తారని చెప్పారు. అనంతరం ఆ ఐడియాలను జిల్లా స్థాయిలో స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్ టీం సభ్యులు, విద్యార్థులు కలిసి మోడల్స్ ను తయారు చేస్తారని వివరించారు. ఇందులో ఎంపికైన వారిని రాష్ట్రస్థాయి ప్రదర్శనలో పాల్గొనడానికి అవకాశం కల్పిస్తారని చెప్పారు. అందులో ఉత్తమమైన ప్రాజెక్టులను ఎంపిక చేసి వారికి పేటెంట్ కల్పిస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లా విద్యార్థులు ఉపయోగించుకునేలా టీచర్లు,  హెచ్ ఎంలు ప్రోత్సహించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి , స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్ టీం సభ్యులు పూజ, ప్రియాంక 
పాల్గొన్నారు.


ఆయిల్ పామ్  రైతులకు మంచి భవిష్యత్తు


సిద్దిపేట, వెలుగు : ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులకు మంచి భవిష్యత్తు ఉంటుందని మంత్రి  హరీశ్ రావు తెలిపారు.  ఈ తోటల సాగుకు సిద్దిపేట జిల్లా అనుకూలంగా ఉందన్నారు. మంగళవారం అధికారులు, ప్రజా ప్రతినిధులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ లో ఆయిల్ పామ్ సాగుపై మంత్రి దిశానిర్దేశం చేశారు. మొదటి ప్రాధాన్యత కింద ఆయిల్ పామ్ విరివిగా సాగు జరిగేలా రైతులు డీడీలు కట్టేలా చొరవ చూపాలని అధికారులు ప్రజా ప్రతినిధులకు సూచించారు.  జిల్లా వ్యాప్తంగా 50 వేల ఎకరాల్లో  ఆయిల్ పామ్ సాగు చేయాలని టార్గెట్​ కాగా, ఆ మేరకు పనులు సాగడం లేదన్నారు.  ఆయిల్ పమ్ా సాగు పుంజుకునేలా స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని సూచించారు. ఆయిల్ పామ్ సాగు కోసం 100 శాతం రాయితీపై ఎస్సీ, ఎస్టీలకు డ్రిప్ అందిస్తున్నట్లు రైతులకు అవగాహన కల్పించాలన్నారు. టెలీ కాన్ఫరెన్స్ లో జిల్లా పరిధిలోని ఎంపీ, ఎమ్మెల్యేలు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివ ప్రసాద్, జిల్లా ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ రామలక్ష్మి, రైతుబంధు సమితి జిల్లా, మండల, గ్రామ నాయకులు, ఏఈఓలు,రైతులు పాల్గొన్నారు.


చెరుకు బిల్లుల చెల్లింపులో డిలే చేయొద్దు

సంగారెడ్డి టౌన్, వెలుగు : చెరుకు రైతులకు  బిల్లుల చెల్లింపులలో జాప్యం చేయొద్దని ఫ్యాక్టరీ యాజమాన్యానికి సంగారెడ్డి కలెక్టర్​ డాక్టర్​ ​శరత్​ సూచించారు.  మంగళవారం కలెక్టర్ చాంబర్ లో అడిషనల్​కలెక్టర్ వీరారెడ్డి, జహీరాబాద్ సీడీసీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్ తో కలిసి ట్రైడెంట్ చక్కర ఫ్యాక్టరీ యాజమాన్య ప్రతినిధులు, చెరుకు రైతు ప్రతినిధులతో బిల్లుల చెల్లింపులపై కలెక్టర్​ చర్చించారు. ఫ్యాక్టరీ యాజమాన్యం  సకాలంలో  బిల్లులు చెల్లించాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. మొదటి విడతగా రూ.3.84 కోట్లు చెల్లించామని, మిగతా బిల్లులు కూడా చెల్లిస్తామని ఫ్యాక్టరీ యాజమాన్యం కలెక్టర్ కు హామీ ఇచ్చింది.


నేటి నుంచి జిల్లా స్థాయి సైన్స్ ​ఫెయిర్

సంగారెడ్డి జిల్లాలో ఈ నెల 7 నుంచి 9 వరకు జిల్లా స్థాయి ఇన్స్ పైర్ సైన్స్​ ఫెయిర్​ నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ శరత్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. శాంతినగర్ లోని సెయింట్ ఆంథోని హైస్కూల్ లో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో సందర్శించి సక్సెస్​ చేయాలని సూచించారు. 


జనవరి 18 నుంచి ‘కంటి వెలుగు’

కంది, వెలుగు :  రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం జనవరి 18 నుంచి ప్రారంభమవుతుందని, దీనికోసం జిల్లా ఆఫీసర్లు అన్ని ఏర్పాట్లు చేయాలని  మంత్రి హరీశ్​రావు జిల్లా కలెక్టర్లకు సూచించారు. మంగళవారం జిల్లా కలెక్టర్లు, ఇతర ఆఫీసర్లతో  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ శరత్  మాట్లాడుతూ జిల్లాలో17,11,678 మందికి 
కంటి పరీక్షలు నిర్వహించేందుకు  69 బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా నుంచి అడిషనల్​ కలెక్టర్ వీరారెడ్డి, డీపీవో సురేశ్​ మోహన్, డీఎం హెచ్ఓ డాక్టర్ 
గాయత్రిదేవి, డాక్టర్​శశాంక్, జడ్పీ సీఈవో ఎల్లయ్య, మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్​ 
పాల్గొన్నారు.

22 నుంచి ఫిజికల్ టెస్టులు

సిద్దిపేట రూరల్, వెలుగు : ఈనెల 22 నుంచి జనవరి 3 వరకు జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో 9,983 మందికి ఫిజికల్ టెస్టులు నిర్వహించనున్నట్లు సిద్దిపేట సీపీ శ్వేత తెలిపారు. మంగళవారం ఫిజికల్ ఎగ్జామ్స్ పై పోలీస్ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎలాంటి అక్రమాలు, విమర్శలకు తావులేకుండా బయోమెట్రిక్, సీసీ కెమెరాల నిఘా లో ఫిజికల్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి అభ్యర్థికీ రిస్టు బ్యాండ్ వేస్తామన్నారు.  సమావేశంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ మహేందర్, ఏఆర్ అడిషనల్ డీసీపీలు సుభాష్ చంద్రబోస్, రామచంద్రరావు, సీసీఆర్బీ ఏసీపీ చంద్రశేఖర్, ఎస్బీ ఇన్​స్పెక్టర్ రఘుపతి రెడ్డి, రిజర్వ్ ఇన్స్​పెక్టర్లు శ్రీధర్ రెడ్డి, రామకృష్ణ, ధరణి కుమార్, రాజశేఖర్ రెడ్డి, త్రీ టౌన్ సీఐ భాను ప్రకాశ్, ఏఓ యాదమ్మ, సూపరింటెండెంట్లు ఎస్ కే జమీల్ పాషా, అబ్దుల్ ఆజాద్ పాల్గొన్నారు.


బిలాల్​పూర్​లో భూకంపం

మునిపల్లి (కోహీర్), వెలుగు : సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం బిలాల్ పూర్​ గ్రామంలో మంగళవారం తెల్లజామున 3.20 గంటల సమయంలో భూమి ఒక్కసారిగా కంపించింది. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన గ్రామ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.  ఈ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

 

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలి 

కంది, వెలుగు :  సంగారెడ్డి జిల్లాలోని జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నిరంతర పోరాటం చేస్తామని తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్(టీయూడబ్ల్యూజే)  సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి అన్నారు. మంగళవారం సంగారెడ్డిలోని టీఎన్​జీవో భవన్ లో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలను,  డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంజూరు చేయించేందుకు కృషి చేస్తామన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి ఎంఏకే పైసల్, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు అనిల్ కుమార్,  ప్రధాన కార్యదర్శి ఆసిఫ్, పలువురు జర్నలిస్టులు, నాయకులు పాల్గొన్నారు.


డబుల్ ఇండ్లు త్వరగా పూర్తి చేయాలి

మెదక్/తూప్రాన్/మనోహరాబాద్, వెలుగు: డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని పంచాయతీ రాజ్  ఇంజనీరింగ్ అధికారులను మెదక్​ అడిషనల్​ కలెక్టర్​రమేశ్ ​ఆదేశించారు. తూప్రాన్, చేగుంట పట్టణాల్లో నిర్మాణంలో ఉన్న ఇండ్లను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తూప్రాన్ లో విద్యుత్ స్తంభాలు, మీటర్లు ఏర్పాటు వెంటనే చేయాలని  సూచించారు. చేగుంటలోని ఇండ్లలో ప్లంబింగ్​ పనులు స్పీడప్​  చేయాలని చెప్పారు. మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లిలో  తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక  మౌలిక సదుపాయాల  అభివృద్ధి సంస్థకు భూములిచ్చిన  రైతులకు ఇండ్ల స్థలాలు అందజేసేందుకు స్థలాన్ని గుర్తించామని, ఈ స్థలంలో హద్దులు ఏర్పాటు చేసి రోడ్లు వేసేందుకు ఈనెల 20లోగా లే అవుట్ ప్లాన్  రూపొందించాలని సూచించారు. ఆయన వెంట టీఎస్ఐఐసీ జోనల్ మేనేజర్ అనురాధ, ఆర్డీఓ సాయి రామ్, తహసీల్దార్ భిక్షపతి
పాల్గొన్నారు. 


సమస్యల పరిష్కారానికే  రెవెన్యూ సదస్సు

పటాన్​చెరు (గుమ్మడిదల), వెలుగు: భూ వివాద సమస్యలు ప్రజల సమక్షంలో త్వరగా పరిష్కరించేందుకే రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేస్తోందని పటాన్​చెరు ఎమ్మెల్యే మహిపాల్​రెడ్డి అన్నారు.  మంగళవారం సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల కేంద్రంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన మాట్లాడారు. రైతులు ఎదుర్కొంటున్న ధరణి సమస్యలు, ఇతర భూ సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. తహసీల్దార్​ సుజాత మాట్లాడుతూ గుమ్మడిదల పరిధిలోని సర్వే నంబర్​109లోని ప్రభుత్వ భూమి గతంలో కేటాయించిన వారి ఆధీనంలో నే ఉండాలని, అమ్ముకున్నట్లయితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కుమార్ గౌడ్,  ఎంపీపీ సద్ది ప్రవీణ భాస్కర్​రెడ్డి, సర్పంచ్ నరసింహారెడ్డి, డిప్యూటీ తహసీల్దార్​చంద్రశేఖర్, రెవెన్యూ ఇన్​స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, నాయకులు గోవర్ధన్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ నరేందర్ రెడ్డి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.  

 

మల్లన్న జాతరలో కుస్తీ పోటీలు 

మెదక్ (టేక్మాల్), వెలుగు : మెదక్ జిల్లా టేక్మాల్ మండలం కాద్ లూర్​ లో మల్లికార్జునస్వామి జాతర ఉత్సవాలలో భాగంగా మంగళవారం కుస్తీ పోటీలు నిర్వహించారు. తెలంగాణ, మహారాష్ట్ర, కర్నాటక సరిహద్దు ప్రాంతం కావడంతో కుస్తీ పోటీలకు మూడు రాష్ట్రాల నుంచి పహిల్వాన్లు వచ్చారు. చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉత్కంఠభరితంగా కుస్తీ పోటీలు జరిగాయి. మహారాష్ట్ర లోని లాతుర్ కు చెందిన అభీసింగ్ గెలుపొందడంతో సర్పంచ్ యాదయ్య అతడిని శాలువాతో సన్మానించి 5 తులాల వెండి కడియాన్ని బహుకరించారు.