
గజ్వేల్, వెలుగు: తెలంగాణలో విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మహంతి ఆడిటోరియంలో నిర్వహించిన పీఆర్టీయూ రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు ఎంబీబీఎస్ సీట్లు 850 మాత్రమే ఉండేవని, అవి ఇప్పుడు 2950కి పెరిగాయని, ఇది కేవలం సీఎం కేసీఆర్ముందుచూపు వల్లే సాధ్యమైందన్నారు. నాడు ఉస్మానియా, గాంధీ కాకుండా మూడు మెడికల్ కాలేజీలతో తెలంగాణ వివక్షకు గురైంది, కానీ నేడు జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. తొలుత 295 మాత్రమే రెసిడెన్షియల్ స్కూల్ ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య 920కి చేరుకున్నాయన్నారు. 2014లో విద్యపై చేసిన ఖర్చు రూ.9518 కోట్లు అయితే ప్రస్తుతం రూ.25,250 కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్పారు. రాష్ట్ర బడ్జెట్లో 10శాతం కేవలం విద్య పైన ఖర్చు పెట్టే ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అన్నారు. మన ఊరు మనబడి ద్వారా అన్ని పాఠశాలను బలోపేతం చేసి నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కాలేశ్వరం నీళ్లతో తెలంగాణలో పండిన పంట కేంద్రానికి కొనలేనంత బరువు అయ్యిందని తెలిపారు. ఎనిమిదేళ్ల కింద కోటీ 34 లక్షల ఎకరాలు ఉన్న సాగు విస్తీర్ణం ఇప్పుడు 2 కోట్ల మూడు లక్షల ఎకరాలకు చేరిందన్నారు. త్వరలో ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్ పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, జడ్పీచైర్‌పర్సన్ రోజాశర్మ, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ప్రతాప్రెడ్డి, పీఆర్టీయూ రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలు
సిద్దిపేట రూరల్, వెలుగు : సిద్దిపేటలో జరిగిన రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలు ఆదివారం ముగిశాయి. మూడు రోజులుగా సిద్దిపేట పట్టణం ముర్షద్ గడ్డ దర్గాలో నిర్వహించిన పోటీల ముగింపు కార్యక్రమంలో తెలంగాణ వెయిట్ లిఫ్టింగ్ రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షుడు సాయిలు, జిల్లా అధ్యక్షుడు ధర్మవరం బ్రహ్మం, మాజీ మున్సిపల్ చైర్మన్ కడవెరుగు రాజనర్సు పాల్గొని విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోటీలలో గెలిచిన వారు జాతీయస్థాయిలో పథకాలు సాధించి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. 18 జిల్లాల నుంచి దాదాపు 300 మంది క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొనగా, ఉమెన్ టీం చాంపియన్‌షిప్ లో యూత్ గర్ల్స్ విన్నర్స్ గా హైదరాబాద్, రన్నర్స్ గా ఖమ్మం జిల్లా, జూనియర్ ఉమెన్ విన్నర్స్ గా ఖమ్మం జిల్లాల క్రీడాకారులు నిలిచారు. మెన్స్ విభాగంలో యూత్ బాయ్స్, జూనియర్ బాయ్స్ విభాగాలలో విన్నర్ గా ఖమ్మం క్రీడాకారులు నిలువగా, సీనియర్ విభాగంలో హైదరాబాద్ జట్టు క్రీడాకారులు గెలుపొందారు.
ఐకేపీ వీవోఏలపై ప్రభుత్వాలు నిర్లక్ష్యం వీడాలి
సంగారెడ్డి టౌన్, వెలుగు : ప్రభుత్వ పథకాల్లో పనిచేస్తూ గ్రామీణ పేదరిక నిర్మూలన కోసం కృషి చేస్తున్న ఐకేపీ వీవోఏలపై ప్రభుత్వాలు నిర్లక్ష్యం వీడాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్ అన్నారు. ఆదివారం సంగారెడ్డిలో ఐకేపీ వీవోఏల తెలంగాణ రాష్ట్ర మూడో మహాసభలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న అన్ని రకాల సంక్షేమ పథకాలను సక్సెస్ చేయడంలో ఐకేపీ వీవోఏల కృషి ఎంతో ఉన్నప్పటికీ వారు చాలీచాలని వేతనాలు పొందుతున్నారని తెలిపారు. ఐకేపీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు రమ, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బి మల్లేశం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలన్నారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి సాయిలు వీఏవో ఎలా సంఘం రాష్ట్ర నాయకుడు నగేశ్ తదితరులు
పాల్గొన్నారు.
పుస్తక పఠనం మేధావిని చేస్తుంది
సంగారెడ్డి టౌన్, వెలుగు: గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని, పుస్తక పఠనం మేధావిని చేస్తుందని జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ జయపాల్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి లోని జిల్లా గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఆమె హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. వివిధ పోటీలలోని విజేతలకు మెమొంటోలను అందజేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో టీఎస్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరి రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ వైస్ చైర్మన్ విజయలక్ష్మి, లత విజయేందర్ రెడ్డి పాల్గొన్నారు.
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
పేదల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం గజ్వేల్ మండలం బూర్గుపల్లిలో 45 డబుల్ బెడ్ రూమ్ గృహా ప్రవేశాలు చేయించారు. గ్రామ ఫంక్షన్ హాల్, డైనింగ్ హాల్, గోడౌన్, తదితర పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామ హైస్కూలు భవనాన్ని
ప్రారంభించారు.
మూసాపేటలో గాంధీ విగ్రహానికి అవమానం
మెదక్ (పెద్దశంకరంపేట), వెలుగు : మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం మూసాపేట గ్రామంలో మహాత్మాగాంధీ విగ్రహానికి అవమానం జరిగింది. గ్రామానికి చెందిన కొందరు యువకులు శనివారం రాత్రి గాంధీ విగ్రహం వద్ద వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా షానవాజ్ అనే యువకుడు గాంధీ విగ్రహానికి నల్ల ముసుగు కప్పాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఆదివారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జాతిపితకు అవమానం జరిగిందని గ్రామస్తులు మండిపడ్డారు. షానవాజ్అధికార పార్టీకి చెందిన కోఆప్షన్ మెంబర్ సోదరుడు కావడం గమనార్హం. యువకుడిపై చర్యలు తీసుకోవాలని గ్రామ సర్పంచ్ అంజిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
అధైర్యపడొద్దు అండగా ఉంటాం
సిద్దిపేట రూరల్, వెలుగు : బీజేపీ లీడర్లు, కార్యకర్తలు అధైర్య పడొద్దని, పార్టీ తరుఫున ఎప్పుడూ అండగా ఉంటామని బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఆదివారం నారాయణరావుపేట మండల పరిధిలోని బంజేరుపల్లి గ్రామంలో నారాయణరావుపేట మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు గోల్కొండ లతా రెడ్డి అత్త, నారాయణరావుపేట గ్రామంలో పార్టీ కార్యకర్త బుస దేవరాజ్ తల్లి మరణించిన విషయం తెలుసుకొని వారి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. బాధిత కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఆయన వెంట జిల్లా అధికార ప్రతినిధి జిల్లెల్ల రమేశ్ గౌడ్, మండల శాఖ అధ్యక్షుడు మోత్కు బుగ్గ రాజేశం, సీనియర్ నాయకులు బాపురెడ్డి, పొన్నాల బాబు, గడ్డం శ్రీకాంత్ గౌడ్ ఉన్నారు.