ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

నారాయణ ఖేడ్, వెలుగు: నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ జోడోయాత్ర సక్సెస్ అయిందని టీపీసీసీ సభ్యుడు డాక్టర్ సంజీవరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన ఇంట్లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని నిరుద్యోగం,  రైతులు, గిరిజనుల సమస్యలను రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. రాహుల్ గాంధీతో పాదయాత్రలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. యాత్రను సక్సెస్​చేసిన కాంగ్రెస్ అభిమానులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.

అరబిందో ఫార్మా ఎదుట కార్మికుల ఆందోళన

సంగారెడ్డి (హత్నూర), వెలుగు : సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం బోర్పట్ల సమీపంలోని అరబిందో ఫార్మా యూనిట్ 1 కంపెనీలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులు సోమవారం ఆందోళనకు దిగారు. యాజమాన్యం వైఖరిని నిరసిస్తూ స్వచ్ఛందంగా విధులు బహిష్కరించి గేటు ముందు బైఠాయించారు. స్థానికేతరులకు ఉద్యోగాలు కల్పిస్తూ స్థానికుల పొట్టకొడుతున్నారని ఆరోపిస్తూ పరిశ్రమ యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్న కాంట్రాక్టు ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కార్మికులను అకారణంగా విధుల్లో నుంచి తొలగించడము, పని దినాల్లో కోత విధిస్తున్నారంటూ ఆగ్రహం 
వ్యక్తం చేశారు. 

మెదక్​ కలెక్టరేట్​ ఎదుట మత్స్యకారుల ధర్నా

మెదక్​ టౌన్​, వెలుగు: అర్హులైన మత్స్యకారులకు న్యాయం చేయాలని డిమాండ్​చేస్తూ హవేళీ ఘనపూర్​ మండలం బూర్గుపల్లికి చెందిన మత్స్యకారులు కుటుంబాలతో వచ్చి మెదక్​కలెక్టరేట్​ఎదుట సోమవారం ధర్నా చేశారు. ఈ మేరకు సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. బూర్గుపల్లి మత్స్యకారుల సంఘంలో పది మంది కొత్తవారికి సభ్యత్వాలు కల్పించాలని మూడేండ్ల కింద దరఖాస్తు చేశామని, తమకు సభ్యత్వం ఇవ్వలేదన్నారు. పైగా ఫిషరీస్​ఆఫీసులో పనిచేసే ఓ ఉద్యోగి తమ దరఖాస్తులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సదరు ఉద్యోగిపై చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని మత్స్యకారులు డిమాండ్​చేశారు. అనంతరం జిల్లా ఫిషరీస్​ ఏడీ రజనీకి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో మత్స్య సహకార సంఘం ప్రెసిడెంట్​అశోక్, వైస్​ ప్రెసిడెంట్​మల్లేశం, డైరెక్టర్లు దుర్గయ్య, రాజు,బెస్త కాశీరామ్​, అంజయ్య, బాల్​రాజు, మెంబర్లు, మహిళలు పాల్గొన్నారు.

నేషనల్​ లెవెల్​ స్కేటింగ్​లో హసన్​ మీరాపూర్​ బిడ్డ

దుబ్బాక, వెలుగు: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హసన్​ మీరాపూర్​ గ్రామానికి చెందిన విద్యార్థిని నేషనల్​స్థాయి స్కేటింగ్ పోటీలో బ్రాంజ్​మెడల్ (కాంస్యం)తో మెరిసింది. గ్రామానికి చెందిన వీరబత్తిని హంసవర్ధిని ఈనెల 1 నుంచి 5వరకు మధ్యప్రదేశ్​లో జరిగిన జాతీయ స్పోర్ట్​ మీట్​లో అండర్​-17(బాలికలు) విభాగంలో స్కేటింగ్​ సత్తా చాటింది. జాతీయ స్థాయిలో పతకం సాధించిన హంసవర్ధినిని గ్రామస్థులు సోమవారం అభినందించారు. 

అంబేద్కర్​ చౌరస్తా రోడ్డును మూసేయొద్దు

చేర్యాల, వెలుగు: చేర్యాల మున్సిపల్​ కేంద్రం లోని అంగడి బజార్​రోడ్డును కబ్జా చేస్తే పోరాటాలను ఉధృతం చేస్తామని పట్టణ జేఏసీ హెచ్చరించింది. సోమవారం చేర్యాలలో ఏర్పాటు చేసిన జేఏసీ సమావేశంలో చైర్మన్​ డా.పరమేశ్వర్, సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ.మాల్లారెడ్డి, సీపీఐ జిల్లా కమిటీ మెంబర్​ అశోక్​, కాంగ్రెస్​ పట్టణ అధ్యక్షుడు ఎం.చిరంజీవులు.. మాట్లాడుతూ చేర్యాలలో ఆర్​అండ్​బీ రోడ్డు,  అంగడిబజార్ ​చౌరస్తా విస్తరణ, వెజ్, నాన్​వెజ్​ మార్కెట్​ అభివృద్ది పేరుతో అంబేద్కర్​ విగ్రహం చౌరస్తా రోడ్డును మూసేస్తామని అధికార పార్టీ లీడర్లు కుట్ర చేయడం దుర్మార్గమన్నారు. ఉన్న రోడ్డును యథావిధిగా ఉంచి నిర్మాణాలు చేపట్టాలని డిమాండ్​ చేశారు. సమావేశంలో కౌన్సిలర్లు లింగం, ఇన్నమ్మ, లీలా,  పి.ఆగంరెడ్డి, నర్సింగరావు, కళావతి, బీరయ్య పాల్గొన్నారు. 

9 నుంచి 12 వరకు రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ మీట్

సంగారెడ్డి టౌన్, వెలుగు: జహీరాబాద్ మండలం రంజోల్ లోని సోషల్​వెల్ఫేర్​బాలికల గురుకుల స్కూల్​లో 8వ రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ మీట్(మల్టీ జోన్-2) ను ఈనెల 9 నుంచి 12 వరకు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ కృష్ణవేణి  సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ స్పోర్ట్స్ మీట్ లో రాష్ట్రంలోని 56 గురుకులాల నుంచి 882 మంది బాలికలు పాల్గొననున్నట్లు తెలిపారు. కబడ్డీ , ఖోఖో, వాలీబాల్, హ్యాండ్ బాల్, బాల్ బ్యాడ్మింటన్, టెన్నీకాయిట్(డబుల్), చెస్ (సింగిల్), క్యారమ్స్ (డబుల్) పోటీలు జరుగుతాయని తెలిపారు.  అథ్లెటిక్స్ లో 100, 200, 400, 600, 800, 1500,3000 మీటర్లు, షాట్ పుట్, డిస్కస్ త్రో, లాంగ్ జంప్, హై జంప్ తదితర పోటీలు నిర్వహిస్తారని తెలిపారు. 


ఆలయాల్లో కార్తీక పూజలు

నెట్​వర్క్​, వెలుగు: కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని సోమవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా భక్తులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. మెదక్​జిల్లా కేంద్రంతోపాటు హవేలీ ఘనపూర్, శివ్వంపేట మండలంలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. మెదక్​పట్టణం లోని కోదండ రామాలయం, వేంకటేశ్వరాలయం, అయ్యప్ప దేవాలయం, హవేళీ ఘనపూర్​ మండలంలోని ముత్తాయికోట సిద్దిరామేశ్వరాలయంతో పాటు ఇండ్లలో భక్తులు దీపాలు వెలిగించారు. 

వైభవంగా శివపార్వతుల కళ్యాణం

నారాయణఖేడ్ పట్టణంలోని చారిత్రాత్మక కాశీనాథ్ ఆలయంలో భీమవరం శివపార్వతుల కల్యాణం ఘనంగా జరిగింది. శివపార్వతులకు పెళ్లి చేసి సంస్కృతి, ఆచారాలు, కార్తీక పౌర్ణమి విశిష్టతను వేద పండితులు భక్తులకు వివరించారు. కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ విజయ బుజ్జి, మహిళలు, శివ భక్తులు పాల్గొని శివాలయంలో దీపాలు వెలిగించారు. 

ఆలయాలకు కార్తీక శోభ

కార్తీక మాసాన్ని పురస్కరించుకొని సిద్దిపేట పట్టణంలోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి.  సంగారెడ్డిలోని ఆలయాలు కార్తీక దీపాల 
వెలుగులతో ఆధ్మాత్మికత వెల్లివెరిసింది.  

చేర్యాల టీచర్​కు నేషనల్​ అవార్డు 

చేర్యాల, వెలుగు: నేషనల్​స్థాయి బెస్ట్​ఉపాధ్యాయ పురస్కారాన్ని చేర్యాల మండల కేంద్రానికి చెందిన ప్రభుత్వ టీచర్​ఎం.రామచంద్రమూర్తి అందుకున్నారు. సోమవారం హైదరాబాద్​లోని రవీంద్ర భారతిలో కౌముది స్వచ్ఛంద సంస్థ ఈ పురస్కారాన్ని అందజేసింది. బాలసాహితీవేత్తగా, ఆధ్యాత్మిక ధార్మిక సేవలతో అనేక కవితలు రాసి 13 పుస్తకాలు, సంకలనాలను వెలువరించారు. చేర్యాల ప్రాంత విద్యాభిమానులు, కవులు, కళాకారులు రామచంద్రమూర్తిని అభినందించారు. 

ప్రజావాణిలో ఫిర్యాదుల స్వీకరణ

సిద్దిపేట రూరల్, వెలుగు: ప్రజావాణి లో వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించి అర్జీదారులకు న్యాయం చేయాలని సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ ఆఫీసులో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ వారంలోపు సమస్యలు పరిష్కరించి నివేదిక అందించాలన్నారు. ప్రజావాణిలో భూ సంబంధిత, డబుల్ బెడ్ రూం ఇండ్లు, ఆసరా పింఛన్లు తదితర సమస్యలపై 45 ఫిర్యాదులు వచ్చాయి. కార్యక్రమంలో ఉన్నతాధికారులు ముజమ్మిల్ ఖాన్, శ్రీనివాస్ రెడ్డి, కలెక్టరేట్ ఏవో అబ్దుల్ రహమాన్ పాల్గొన్నారు.

బాధితుల సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలి 

మెదక్​ టౌన్​, వెలుగు : మెదక్​ జిల్లా వ్యాప్తంగా పోలీస్​స్టేషన్లకు వచ్చే బాధితుల సమస్యలు తెలుసుకొని వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలని మెదక్​ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. సోమవారం ఎస్పీ ఆఫీసులో పోలీస్​ ప్రజావాణి నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల సమస్యలను ఎస్పీ స్వయంగా తెలుసుకొన్నారు. అనంతరం ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని ఆయా ఎస్​హెచ్ఓలను ఆదేశించారు. 

మెదక్​జిల్లాలో 55 వినతులు 

మెదక్​ టౌన్​, వెలుగు: మెదక్​ జిల్లా వ్యాప్తంగా ప్రజావాణిలో వస్తున్న ఫిర్యాదులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని సివిల్​సప్లై ఆఫీసర్​శ్రీనివాస్​, ఆర్డీవో సాయిరామ్​ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్​లోని  ప్రజావాణి హాల్​లో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన  55 వినతులను అధికారులు స్వీకరించారు. అనుమతులు లేకుండా నిర్మాణం చేపడుతున్న రైస్ మిల్ నిర్మాణ పనులను నిలిపివేయాలని వెల్దుర్తి మండలం హస్తాల్​పూర్​ ఉపసర్పంచ్​ రమేశ్​, ఎంపీటీసీ బాబు ఫిర్యాదు చేశారు. మనోహరాబాద్ మండలం కూచారం గ్రామంలోని గ్లోబల్  స్టీల్ కంపెనీ భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్ల కార్మికులు చనిపోతున్నారని ఈ విషయంలో యాజమాన్యంపై  చర్యలు తీసుకోవాలని సీఐటీయూ జిల్లా ప్రెసిడెంట్​ మహేందర్ రెడ్డి, తదితరులు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు కృష్ణ మూర్తి, విజయ, కమలాకర్, శ్రీనివాస్ రావు, శ్రీహరి, ఏడుపాయల దేవస్థానం ఈవో శ్రీనివాస్, ఇందిర, కలెక్టరేట్ ఏవో యూనుస్ పాల్గొన్నారు. 

చనిపోయిందని పింఛన్​ రద్దు 

సంగారెడ్డి టౌన్ , వెలుగు: బతికున్న తన తల్లిని చనిపోయారంటూ పింఛన్​రద్దు చేసిన ఘటనపై బాధితులు సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. బాధితులు మాట్లాడుతూ.. నారాయణ ఖేడ్ మండలం హంగీర్గా( కె )కు చెందిన బి.నర్సమ్మ సెప్టెంబర్​30న చనిపోయిందంటూ పంచాయతీ సెక్రటరీ ఆసరా పింఛన్​ను తొలగించారు. దీనిపై బాధితురాలు తన కుమారులతో కలిసి ప్రజావాణిలో ఫిర్యాదుచేసింది. పింఛన్ ​తీసేయాలంటే ఇతర కారణాలతో తీసేయాలి గానీ చనిపోయిందని పేర్కొనడం ఏంటని బాధితులు వాపోయారు.

వ్యాధుల నుంచి రక్షణకు వ్యాక్సిన్లు 

మెదక్​ టౌన్​, వెలుగు: ధనుర్వాతం, కంఠసర్పి బారినపడకుండా రక్షించుకోవడానికి 10 నుంచి16 ఏండ్ల మధ్య పిల్లలు తప్పనిసరిగా టీడీ టీకా వేయించుకోవాలని మెదక్​ డీఎం అండ్​ హెచ్​వో విజయ నిర్మల సూచించారు. సోమవారం కౌడిపల్లిలోని ప్రభుత్వ జడ్పీ స్కూల్​లో స్టూడెంట్స్​కు టీడీ టీకాలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మెదక్​ డీఈవో రమేశ్​కుమార్, డాక్టర్లు, ఏఎన్ఎంలు, టీచర్లు పాల్గొన్నారు.


ఎమ్మెల్యే సతీశ్​బాబుకు హరీశ్​రావు పరామర్శ

సిద్దిపేట, వెలుగు: హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్​బాబుకు   సోమవారం హైదరాబాద్​లో మోకాళ్ల ఆపరేషన్​ జరిగింది.  మంత్రి హరీశ్​రావు  ఎమ్మెల్యేను పరామర్శించి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. మంత్రి వెంట ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి , టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఉన్నారు.


నేషనల్​ లెవెల్​ స్కేటింగ్​లో హసన్​ మీరాపూర్​ బిడ్డ

దుబ్బాక, వెలుగు: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హసన్​ మీరాపూర్​ గ్రామానికి చెందిన విద్యార్థిని నేషనల్​స్థాయి స్కేటింగ్ పోటీలో బ్రాంజ్​మెడల్ (కాంస్యం)తో మెరిసింది. గ్రామానికి చెందిన వీరబత్తిని హంసవర్ధిని ఈనెల 1 నుంచి 5వరకు మధ్యప్రదేశ్​లో జరిగిన జాతీయ స్పోర్ట్​ మీట్​లో అండర్​-17(బాలికలు) విభాగంలో స్కేటింగ్​ సత్తా చాటింది. జాతీయ స్థాయిలో పతకం సాధించిన హంసవర్ధినిని గ్రామస్థులు సోమవారం అభినందించారు.