భారత ప్రయాణికులపై ఆంక్షలు సడలించిన బ్రిటన్

 భారత ప్రయాణికులపై ఆంక్షలు సడలించిన బ్రిటన్

లండన్: భారత దేశం నుంచి బ్రిటన్ కు వెళ్లే ప్రయాణికులపై ఆ దేశ ప్రభుత్వం ఆంక్షలు సడలించింది. వచ్చేనెల 1వ తేదీ నుండి ఆంక్షలు సడలించనున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం ప్రకటన  విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రయాణించే వారి కోసం ఏర్పాటు చేసిన రెడ్ అంబర్ గ్రీన్ జోన్లలో ఉన్న భారతదేశ పేరును అంబర్ కేటగిరీ నుంచి తొలగిస్తున్నట్లు తెలిపింది. భారత దేశం నుంచి వచ్చే భారతీయులు, ఇతరులు తమ దేశానికి వచ్చే ముందు ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం లేదని.. అయితే తమ దేశంలోకి వచ్చాక 2వ రోజు ఆ తర్వాత 8వ రోజు ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించుకోవాలని యూకే ప్రభుత్వం తెలిపింది.

భారత్ నుంచి వచ్చేవారు విమానం బయలుదేరడానికి మూడు రోజుల ముందు కోవిడ్ పరీక్ష చేయించుకోవాలని సూచించింది. వ్యాక్సిన్లు వేయించుకున్న వారు కూడా యూకే చేరుకున్నాక కనీసం 10 రోజులపాటు క్వారంటైన్ లో ఉండాలని బ్రిటన్ స్పస్టం చేసింది. అయితే 18 ఏళ్ల లోపు వారు 10 రోజులపాటు క్వారంటైన్ లో ఉండాల్సిన అవసరం లేదని.. అంతేకాదు 5 ఏళ్ల లోపు పిల్లలు ఎలాంటి పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. 11 ఏళ్ల లోపు వారు మాత్రం ప్రయాణానికి ముందు టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం లేదు కానీ.. యూకే చేరుకున్నాక రెండో రోజు పీసీఆర్ టెస్టు చేయించుకోవాలని బ్రిటన్ ప్రభుత్వం సూచించింది. ఎలాంటి వ్యాక్సిన్ వేయించుకోవాలన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు.