ఇండియాతో కలసి ఫైటర్​ జెట్ల తయారీ

ఇండియాతో కలసి ఫైటర్​ జెట్ల తయారీ
  • ఢిల్లీలో ప్రధాని మోడీతో జాన్సన్ భేటీ
  • ఇరు దేశాల మధ్యా కుదిరిన పలు కీలక ఒప్పందాలు
  • జాన్సన్​ పర్యటన చరిత్రాత్మకమన్న ప్రధాని మోడీ
  • ఫ్రీ ట్రేడ్​ అగ్రిమెంట్​కీలక  దశలో ఉంది..
  • గ్లోబల్​ ఇన్నొవేటివ్​ పార్ట్​నర్​షిప్​ డీల్ గొప్ప ముందడుగని వెల్లడి

న్యూఢిల్లీ: భారత్​కు ఫైటర్​ జెట్ల తయారీ టెక్నాలజీని అందించేందుకు సిద్ధమని, ఈ విషయంలో ఇండియాతో కలిసి పనిచేస్తామని బ్రిటన్​ ప్రధానమంత్రి బోరిస్​ జాన్సన్​ ప్రకటించారు.  డిఫెన్స్​ పరికరాల దిగుమతి సమయాన్ని తగ్గించేందుకు వీలుగా ఇండియాకు ఓపెన్​ జనరల్​ ఎక్స్​పోర్ట్ లైసెన్స్(ఓజీఈఎల్)ను జారీ చేస్తున్నట్టు తెలిపారు. నరేంద్ర మోడీ మేక్ ఇన్​ ఇండియాకు లక్ష్యానికి సహకరిస్తామని జాన్సన్​ హామీ ఇచ్చారు.

రెండు రోజుల పర్యటన కోసం గురువారం గుజరాత్​ వచ్చిన బోరిస్​ జాన్సన్​ శుక్రవారం ఢిల్లీ చేరుకున్నారు. ఆయనకు రాష్ట్రపతి భవన్​లో ప్రధాని మోడీ ఘన స్వాగతం పలికారు. వీరిద్దరి మధ్యా ఢిల్లీలోని హైదరాబాద్​ హౌస్​లో ఆర్థిక, రక్షణ, భద్రతకు సంబంధించిన అంశాలపై చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా గ్లోబల్​ ఇన్నొవేషన్​ పార్ట్​నర్​షిప్, గ్లోబల్​ సెంటర్​ ఫర్​ న్యూక్లియర్​ ఎనర్జీ పార్ట్​నర్​షిప్​కు సంబంధించి 2 ప్రభుత్వ పరమైన ఒప్పందాలు చేసుకున్నాయి. నాలుగు నాన్​ గవర్నమెంట్​ అగ్రిమెంట్లు కుదిరాయి. అంతకుముందు రాజ్​ఘాట్​ వద్ద పుష్పగుచ్ఛం ఉంచి మహాత్మాగాంధీకి బోరిస్​ జాన్సన్​  నివాళులర్పించారు.

ఏడాది చివరికి ఎఫ్​టీఏ ఫైనల్ అవుతది: మోడీ
అంతర్జాతీయంగా టెన్షన్లు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇరు దేశాల మధ్యా రక్షణ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాలని ఇండియా, బ్రిటన్ ప్రధాన మంత్రులు నరేంద్ర మోడీ, బోరిస్​ జాన్సన్​ నిర్ణయించారు. బోరిస్​ జాన్సన్​ ఇండియా పర్యటన చరిత్రాత్మకమని ప్రధాని మోడీ అన్నారు. యూనైటెడ్​ కింగ్​డమ్​తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్(ఎఫ్ టీఏ) గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని, ఇది కీలక దశలో ఉందని, ఈ ఏడాది చివరికి ఫైనల్​ అవుతుందని చెప్పారు.

ఇరు దేశాల మధ్యా గ్లోబల్​ ఇన్నొవేటివ్​ పార్ట్​నర్​షిప్​ కుదరడం గొప్ప ముందడుగని చెప్పారు. ఇండియా–యూకే రోడ్​మ్యాప్​ 2030 ప్రగతి గురించి సమీక్షించామన్నారు. సీవోపీ 26లో ఇచ్చిన హామీలను పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నామని, నేషనల్​ హైడ్రోజన్​ మిషన్​లో భాగస్వామి కావాలని యూకేని కోరామని చెప్పారు. ఇండో–పసిఫిక్ ఇనీషియేటివ్ లో భాగస్వామి కావాలన్న యూకే నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. ఉక్రెయిన్​లో సంక్షోభానికి చర్చలు, దౌత్యం ద్వారా తక్షణ పరిష్కారం చూపాలని ప్రధాని ఆకాక్షించారు.

ఇండియా, రష్యా బంధాన్ని గౌరవిస్తం
రష్యాతో ఇండియాకు చరిత్రాత్మకమైన సంబం ధాలు ఉన్నాయని, దానిని ప్రతి ఒక్కరూ గౌరవిస్తారని బోరిస్​ జాన్సన్​ చెప్పారు. రష్యాకు సంబంధించి ఇండియా వైఖరి అందరికీ తెలుసని, ఇందులో మార్పు ఉండబోదన్నారు. ఉక్రెయిన్​ సంక్షోభానికి సంబంధించి చాలాసార్లు పుతిన్​తో మాట్లాడానని మోడీ తనకు చెప్పారన్నారు. కొన్ని దేశాల నుంచి ప్రపంచం ముప్పును ఎదుర్కొంటోందని, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయాలని, ఫ్రీ ట్రేడ్​ను దెబ్బతీయాలని, కొన్ని దేశాల సార్వభౌమత్వాన్ని కాలరాయాలని ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఉక్రెయిన్ లోని కీవ్​లో తమ ఎంబసీలను వచ్చే వారం నుంచి తిరిగి తెరుస్తామని, పుతిన్​ దురాగతాలపై యూకే, దాని మిత్రపక్షాలు చూస్తూ ఊరుకోబోవని చెప్పారు. ఇండియన్లు స్కిల్డ్​ లేబర్​ కొరత తీరుస్తున్నరు. ఇండియా నుంచి వస్తున్న స్కిల్డ్​ వర్కర్లు బ్రిటన్​లో లేబర్​ కొరతను తీరుస్తున్నారని బోరిస్​ జాన్సన్​ చెప్పారు. వారు గొప్పగా పనిచేస్తూ దేశాభివృద్ధికి కృషి చేస్తున్నారని కొనియాడారు.

సచిన్, అమితాబ్​లా ఫీలయ్యా
ప్రధాని మోడీపై బోరిస్​ జాన్సన్​ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన ప్రత్యేకమైన స్నేహితుడని కొనియాడారు. ఇరు దేశాల భాగస్వామ్యం ఇప్పటి కాలంలోనే అరుదైన స్నేహాల్లో ఒకటని చెప్పారు. ‘గుజరాత్​లో నాకు లభించిన స్వాగతం గురించి చెప్పడానికి మాటలు రావడం లేదు. సచిన్​ టెండూల్కర్, అమితాబ్​బచ్చన్​లా నేను ఫీలయ్యాను. ఇలాంటి అద్భుతమైన స్వాగతం ప్రపంచంలో ఎక్కడా నాకు దక్కలేదు. గుజరాత్​ ప్రజలకు ఇందుకు ధన్యవాదాలు. ప్రధాని మోడీ సొంత రాష్ట్రాన్ని తొలిసారి చూడటం చాలా గొప్పగా ఉంది’ అని అన్నారు. ఇండియా అందించిన కరోనా వ్యాక్సిన్ తనకు చాలా మేలు చేసిందని, అందుకు ఇండియాకు ధన్యవాదాలు తెలుపుతున్నట్టు చెప్పారు. 

ఆర్థిక నేరగాళ్ల అప్పగింతకు సహకరించండి
ఇండియాలో ఆర్థిక నేరాలకు, బ్యాంకు లోన్ల ఎగవేతలకు పాల్పడిన ఆర్థిక నేరగాళ్లను అప్పగించే విషయానికి ప్రాధాన్యమివ్వాలని బ్రిటన్​ పీఎం బోరిస్ జాన్సన్​ను కేంద్రం కోరింది. దేశం దాటి వెళ్లిన ఆర్థిక నేరగాళ్లను న్యాయ స్థానం ముందు నిలబెట్టేందు కు సహకరించాలని విజ్ఞప్తి చేసినట్టు విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్థన్​ ష్రింగ్లా చెప్పారు. విదేశాంగ మంత్రి జైశంకర్​తోనూ జాన్సన్​ సమావేశమ య్యారు. ఇరు దేశాల మధ్యా సంబంధాల బలోపేతం, ఇండియా, యూకే రోడ్​మ్యాప్​ 2030 అమలుపై వారి మధ్య చర్చలు జరిగినట్టు విదేశాంగ శాఖ వెల్లడించింది.