ఉక్రెయిన్​లో శాంతి కోసం.. డీల్ రూపొందిస్తం.. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ప్రకటన

ఉక్రెయిన్​లో శాంతి కోసం.. డీల్ రూపొందిస్తం.. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ప్రకటన
  • ఫ్రాన్స్, ఉక్రెయిన్​తో కలిసి ఒప్పందం సిద్ధం చేసి ట్రంప్​కు అందిస్తం 
  • రష్యా మళ్లీ దాడి చేయకుండా గ్యారంటీ ఉండాలి
  • ఉక్రెయిన్​కు యూరప్ అండగా నిలవాలని పిలుపు

లండన్: ఉక్రెయిన్ లో శాంతి స్థాపన కోసం తాము ఒక డీల్ ను రూపొందిస్తామని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ప్రకటించారు. ఉక్రెయిన్, ఫ్రాన్స్ తో కలిసి డీల్ ను రూపొందించాక, దానిని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కు అందజేస్తామని తెలిపారు. అయితే, ఉక్రెయిన్ పై రష్యా అధ్యక్షుడు పుతిన్ మళ్లీ దాడి చేయకుండా ఉండేలా ఈ డీల్ లో భద్రతాపరమైన హామీ తప్పకుండా ఉంటుందని ఆయన స్పష్టంచేశారు. 

శుక్రవారం వైట్ హౌస్ లో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తో వాగ్వాదం తర్వాత ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ మినరల్స్ డీల్ పై సంతకం చేయకుండా అర్ధంతరంగా పర్యటనను ముగించుకుని తిరిగి వచ్చారు. ఈ విషయంలో జెలెన్ స్కీకి బ్రిటన్ సహా యూరప్ దేశాలన్నీ మద్దతు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో శనివారం బ్రిటన్ పర్యటనకు వెళ్లిన జెలెన్ స్కీకి స్టార్మర్ సాదర స్వాగతం పలికారు. జెలెన్ స్కీతో భేటీ తర్వాత ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మాక్రన్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో స్టార్మర్ మాట్లాడారు. 

ఆదివారం లండన్ లో బ్రిటన్ ప్రధాని అధ్యక్షతన జరిగిన యూరోపియన్ దేశాల నేతల సదస్సుకు జెలెన్ స్కీతోపాటు ఫ్రాన్స్, జర్మనీ, డెన్మార్క్, ఇటలీ, నెదర్లాండ్స్, నార్వే, పోలండ్, స్పెయిన్, కెనడా, ఫిన్లాండ్, స్వీడన్, చెక్ రిపబ్లిక్, రొమేనియా దేశాల లీడర్లు హాజరయ్యారు. ఈ సదస్సులో జెలెన్ స్కీకి అన్ని దేశాల నేతల నుంచి గట్టి మద్దతు లభించింది. సదస్సు తర్వాత స్టార్మర్ మీడియాతో మాట్లాడారు. 

ఉక్రెయిన్ లో సుదీర్ఘకాలం శాంతి కొనసాగేలా రష్యాతో ఒప్పందం కుదిర్చేందుకు ట్రంప్ కూడా సుముఖంగా ఉన్నట్టు చెప్పారు. ఉక్రెయిన్ తోపాటు యూరప్ దేశాల భద్రత, భవిష్యత్తు కోసం అన్ని దేశాలు కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కాగా, జెలెన్ స్కీకి లండన్​లో దారి పొడవునా ఉక్రెయిన్ మద్దతుదారులు స్వాగతం పలికారు. ఉక్రెయిన్​కు మద్దతు ప్రకటిస్తూ, 
ప్లకార్డులు ప్రదర్శించారు.

ఉక్రెయిన్​కు 226 కోట్ల పౌండ్ల రుణం 

ఉక్రెయిన్ రక్షణ రంగాన్ని బలోపేతం చేసుకోవడానికి 226 కోట్ల పౌండ్ల రుణ సహాయం చేసేందుకు బ్రిటన్ ఓకే చెప్పింది. ఈమేరకు ఆదివారం ఉక్రెయిన్, బ్రిటన్ ఆర్థిక మంత్రులు సెర్గీ మార్చెంకో, రాచెల్ రీవ్స్ వర్చువల్ గా అగ్రిమెంట్ పై సంతకాలు చేశారు. రష్యాతో యుద్ధం మొదలైనప్పటి నుంచీ ఉక్రెయిన్ కు గట్టి మద్దతు ఇస్తున్న బ్రిటన్ తాజాగా మద్దతును మరింత పొడిగిస్తూ ఈ లోన్ ఇచ్చేందుకు అంగీకరించింది. యూరోపియన్ యూనియన్ అధీనంలో ఉన్న రష్యన్ ప్రభుత్వ ఆస్తులపై ఆంక్షల ద్వారా వచ్చే ప్రాఫిట్స్ నుంచి ఈ లోన్ ను తిరిగి చెల్లించనున్నట్టు అగ్రిమెంట్ లో పేర్కొన్నారు.

జెలెన్ స్కీని ముందే హెచ్చరించిన సెనెటర్ 

వైట్ హౌస్​లో శుక్రవారం ట్రంప్​తో భేటీకి ముందే వాదనలకు దిగవద్దని జెలెన్ స్కీని అమెరికా హెచ్చరించినట్టుగా న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. ట్రంప్, జెలెన్ స్కీ చర్చలకు మధ్యవర్తిగా వ్యవహరించిన సౌత్ కరోలినా రిపబ్లికన్ సెనెటర్ లిండ్సీ గ్రాహమ్ మీటింగ్ కు ముందే జెలెన్ స్కీని కలిశారని తెలిపింది. మీటింగ్ లో ట్రంప్​తో వాదనకు దిగకుండా మినరల్స్ డీల్​పై సంతకం చేయాలని లింసడీ సూచించారని, కానీ జెలెన్ స్కీ ఆ సూచనలను పట్టించుకోలేదని ఆ పత్రిక పేర్కొంది. 

అమెరికాకు నార్వే కంపెనీ ఝలక్ 

నార్వే పోర్టుల వద్ద డాక్ అయి ఉన్న అమెరికన్ మిలిటరీ షిప్పులకు ఫ్యూయెల్ నిలిపివేస్తున్నట్టు నార్వేకు చెందిన హాల్ట్ బక్ బంకర్స్ కంపెనీ ప్రకటించింది. వైట్ హౌస్ లో జెలెన్ స్కీతో ట్రంప్ వ్యవహరించిన తీరు తమను ఎంతగానే బాధించిందని, అందుకే ఉక్రెయిన్ కు నైతిక మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. అమెరికన్ మిలిటరీకి 2024లో మొత్తం 30 లక్షల లీటర్ల ఫ్యూయెల్ ను తాము సరఫరా చేశామని తెలిపింది. తాజా నిర్ణయం మేరకు వెంటనే ఫ్యూయెల్ సప్లైని ఆపేస్తున్నామని పేర్కొంది. ఉక్రెయిన్ విషయంలో ట్రంప్ సరైన నిర్ణయం తీసుకునేవరకూ తాము ఫ్యూయెల్ సప్లై చేయబోమని చెప్పింది. ఉక్రెయిన్ కు మద్దతునిచ్చే దేశాలు కూడా తమనే ఫాలో కావాలని పిలుపునిచ్చింది. అయితే, జెలెన్ స్కీ, ట్రంప్ మీటింగ్ పై ఇప్పుడే ఒక నిర్ణయానికి రాలేమని నార్వే ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.