గొర్లు రాలే.. బ్రోకర్లు వచ్చే...

గొర్లు రాలే.. బ్రోకర్లు వచ్చే...
  • గొర్లు రాలే.. బ్రోకర్లు వచ్చే
  • గొర్లు తమకే ఇవ్వాలని గొల్లకురుమలను మభ్యపెడుతున్న దళారులు
  • ఒక్కో యూనిట్​కు రూ.25 వేలు ఇస్తామని ఆఫర్లు 
  • లబ్ధిదారుల వాటా తామే చెల్లిస్తామంటూ బేరసారాలు 
  • పేదలు, వృద్ధులే టార్గెట్​గా దందా.. ప్రభుత్వానికి రూ.43,750 కట్టలేక దళారుల వైపు మొగ్గుతున్న అర్హులు

హైదరాబాద్, వెలుగు: రెండో విడత గొర్రెల పంపిణీ ప్రారంభం కాకముందే, దళారుల దందా మొదలైంది. గొర్లను తమకు ఇచ్చేందుకు ఒప్పుకుంటే ఒక్కో యూనిట్ కు రూ.20 వేల నుంచి రూ.25 వేలు చెల్లిస్తామని అర్హులను దళారులు సంప్రదిస్తున్నారు. ‘‘గొర్రెలు ఎప్పుడొస్తాయో తెల్వదు. అసలు వస్తాయో రావో కూడా డౌటే. లబ్ధిదారుల వాటా కింద ప్రభుత్వానికి కట్టాల్సిన డబ్బు కూడా మేమే చెల్లిస్తాం. గొర్రెలు కొనడం, అమ్మడం, ఆఫీసర్లకు ఇవ్వాల్సిన లంచం.. ఇతర అన్ని ఖర్చులనూ మేమే భరిస్తాం” అని గొల్లకురుమలను మభ్యపెడుతున్నారు. ప్రభుత్వం గుర్తించిన అర్హుల్లో పేదలు, వృద్ధులే టార్గెట్‌‌‌‌గా దందా చేస్తున్నారు. తొలి విడత తరహాలోనే ఈసారి కూడా గొర్రెల రీసైక్లింగ్‌‌‌‌ దందా చేసేందుకు ఇప్పట్నుంచే అధికారులతో కుమ్మక్కవుతున్నారు. గతంలో డీడీలు కట్టిన ఏడాది వరకూ కొంతమందికి గొర్లు రాలేదు. డీడీలు కట్టేందుకు చేసిన అప్పులకు వడ్డీలు కట్టాల్సి వచ్చింది. ఈసారి కూడా అదే పరిస్థితి వస్తుందని, నాలుగైదు నెలల్లో ఎన్నికలు ఉండడంతో గొర్రెల పంపిణీ అప్పటి వరకే జరుగుతుందని అర్హులతో దళారులు చెబుతున్నారు. ఎన్నికల తర్వాత గొర్రెల పంపిణీ ఆగిపోతుందని, కట్టిన డబ్బులు అటేపోతాయని భయపెడుతున్నారు. దీంతో తొలి విడతలో ఎదురైన సమస్యలు, డీడీలు కట్టే స్థోమత లేకపోవడం తదితర కారణాలతో కొంతమంది అర్హులు దళారులకు గొర్రెలు ఇచ్చేందుకు ఒప్పుకుంటున్నారు. 

తొలి విడత భయాలతో..  

రాష్ట్రంలో 2017లో గొర్రెల పంపిణీ స్కీమ్ మొదలైంది. 7,61,898 మంది గొల్లకురుమలను సర్కార్ అర్హులుగా గుర్తించింది. ఒక్కొక్కరికి 20 గొర్రెలు, ఒక్క గొర్రె పొట్టేలు ఇచ్చేందుకు రూ.1.25 లక్షలు ఖర్చు చేయాలని నిర్ణయించింది. ఇందులో 25 శాతం.. అంటే రూ.31,250 లబ్ధిదారులే తమ వాటా కింద కట్టాలని సూచించింది. ఈ మొత్తాన్ని డీడీల రూపంలో చెల్లించాలని చెప్పింది. దీంతో చాలామంది గొల్లకురుమలు అప్పులు తెచ్చి మరీ డీడీలు కట్టారు. డీడీలు కట్టిన కొన్ని వేల మందికి సకాలంలో గొర్రెలు రాలేదు. దీంతో తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోయాయి. గొర్లు ఎప్పుడిస్తరని గొల్లకురుమలు రోడ్లెక్కి ఆందోళనలు కూడా చేశారు. కొంతమందికి అనారోగ్యంతో ఉన్న గొర్రెలను ఇవ్వడంతో వాటిని సాదలేక, అమ్ముకోలేక తిప్పలు పడ్డారు. అమ్ముకున్నా డీడీ ఖర్చులు కూడా రాలేదు. ఈ అనుభవాలకు తోడు, గతంలో కంటే ఈసారి డీడీ అమౌంట్ ఇంకా పెరిగింది. అప్పుడు రూ.31,250 ఉంటే, ఇప్పుడు రూ.43,750కి చేరింది. దీంతో డీడీలు తీసేందుకు లబ్ధిదారులు ఎన్కముందైతున్నరు. ఈ క్రమంలోనే దళారులు రంగప్రవేశం చేసి, లబ్ధిదారుల వాటా కట్టేందుకు ముందుకొస్తున్నారు. తమ వాటా కట్టే స్థితిలో లేని లబ్ధిదారులను టార్గెట్‌‌‌‌గా చేసుకొని వారిని మభ్యపెడుతున్నారు. గుడ్‌‌‌‌ విల్ కింద రూ.20 వేల నుంచి రూ.25 వేలు ఇచ్చేసి, గొర్లు మొత్తం తమకే ఇచ్చేలా అగ్రిమెంట్లు రాయించుకుంటున్నారు. కాగా, పేద గొల్లకురుమలకు లబ్ధి చేకూరాలంటే, లబ్ధిదారుల వాటాను కూడా ప్రభుత్వమే భరించాలని యాదవ సంఘాల నేతలు కోరుతున్నారు. 

దళారులను నమ్మి మోసపోవద్దు 

రెండో విడత గొర్రెల పంపిణీ త్వరలోనే మొదలవుతుంది. తొలి విడతలో 3.76 లక్షల మందికి గొర్రెల పంపిణీ పూర్తయింది. ఈసారి దాదాపు 3.85 లక్షల మందికి గొర్లు ఇస్తాం. ఇందుకోసం నేషనల్ కోఆపరేటివ్ డెవలప్‌‌‌‌మెంట్ కార్పొరేషన్ నుంచి రూ.4,653 కోట్లు లోన్ తీసుకున్నాం. అర్హులందరికీ గొర్లు వస్తాయి. ఎవరూ దళారులను నమ్మి మోసపోవద్దు. గొర్ల కొనుగోలు కలెక్టర్ల ఆధ్వర్యంలోని కమిటీల నేతృత్వంలో జరుగుతుంది. గొర్లకు, గొర్లను తరలించే వాహనాలకు జియో ట్యాగ్ వేసి లబ్ధిదారుని ఇంటికి తరలిస్తాం. రీసైక్లింగ్, ఇతర దందా చేసేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.

–  డాక్టర్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, చైర్మన్, తెలంగాణ షీప్స్ అండ్ గోట్స్ డెవలప్​మెంట్ కార్పొరేషన్

యూనిట్‌‌‌‌‌‌‌‌ విలువ 1.75 లక్షలు 

తొలి విడత గొర్రెల పంపిణీలో ఒక్కో యూనిట్ ఖర్చు రూ.1.25 లక్షలు ఉండగా, ఇప్పుడు రూ.1.75 లక్షలకు ప్రభుత్వం పెంచింది. లబ్ధిదారులు తొలుత తమ వాటా మొత్తాన్ని గవర్నమెంట్ ఇచ్చిన అకౌంట్‌‌‌‌లో జమ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ వాటా రిలీజ్ అయిన తర్వాత కలెక్టర్ నియమించిన కమిటీ లబ్ధిదారులను ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లి గొర్రెలు కొనిస్తుంది. యూనిట్ లో ఒక గొర్రె పొట్టేలు, 20 గొర్రెలు ఉంటాయి. గొర్రెకు రూ.7,400 చొప్పున 20 గొర్రెలకు రూ.1,48,000.. గొర్రె పొట్టేలుకు రూ.10 వేలు అవుతుంది. మొత్తంగా ఒక యూనిట్‌‌‌‌‌‌‌‌కు రూ.1,58,000 ఖర్చవుతుంది. గొర్రెల రవాణాకు రూ.6,500, దాణాకు రూ.3,500, ఇన్సూరెన్స్‌‌‌‌‌‌‌‌కు రూ.5 వేలు, మందులకు రూ.500, ఇతర ఖర్చులకు రూ.1,500 సహా మొత్తం రూ.1,75,000 ఖర్చు చేస్తారు.