రైతుల దగ్గర వడ్లు కొంటున్న దళారులు

రైతుల దగ్గర వడ్లు కొంటున్న దళారులు
  • యాదాద్రి జిల్లాలో విచిత్ర పరిస్థితి
  • నేరుగా కల్లాల వద్దే     కొంటున్న దళారులు
  • సెంటర్లకు వడ్లు తీసుకురాని రైతులు
  • వడ్లు పంపించాలంటూ ఆఫీసర్లకు మిల్లర్ల ఫోన్లు

యాదాద్రి, వెలుగు: కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన వడ్లను దించుకోకుండా రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు, ఆఫీసర్లకు చుక్కలు చూపిస్తున్న రైస్​మిల్లర్లకు యాదాద్రి జిల్లాలో మాత్రం ఉల్టా చుక్కలు కనిపిస్తున్నాయి. ఏపీతోపాటు తెలంగాణలోని ఇతర జిల్లాల నుంచి దళారులు వచ్చి నేరుగా కల్లాల్లోనే రైతుల దగ్గర వడ్లు కొంటున్నారు. ఎలాంటి కటింగులు లేకుండా కాంట కాగానే పేమెంట్ చేస్తున్నారు. దీంతో రైతులు సెంటర్లకు వడ్లు తీసుకెళ్లడం లేదు. వడ్ల కొనుగోలు ప్రారంభించి నెల రోజులైనా యాదాద్రి జిల్లాలోని 41 రైస్​మిల్లులకు పూర్తిస్థాయిలో వడ్లు రాకపోవడంతో  మిల్లర్లు హైరానా పడుతున్నారు. ‘మా మిల్లుకు వడ్లు పంపండి సారూ..’ అంటూ సివిల్​సప్లై ఆఫీసర్లకు ఫోన్లు చేసి మరీ వేడుకుంటున్నారు. 

దిగుబడి పెరిగినా.. 

యాదాద్రి జిల్లాలో ఈ వానాకాలం సీజన్​లో 3.05 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. దాదాపు 6 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అగ్రికల్చర్ ఆఫీసర్లు అంచనా వేశారు. దీనికి  తగ్గట్టుగానే.. సివిల్ సప్లై ఆఫీసర్లు 303 కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేశారు. వీటిలో ఇప్పటివరకు 2. 11 లక్షల టన్నుల వడ్లు కొనగా.. 1.90 లక్షల టన్నులు మిల్లులకు తరలించారు. మిల్లర్లు, దళారులు రైతుల నుంచి నేరుగా 2 లక్షల టన్నులు కొన్నట్టు అఫీసర్లు భావిస్తున్నారు. సెంటర్ల నుంచి గత వానాకాలం సీజన్ లో 2.64 లక్షల టన్నులు, యాసంగిలో 2.05 లక్షల టన్నుల వడ్లు మిల్లర్లకు పంపారు. దిగుబడులు పెరగడంతో ఈసారి ఎక్కువ వడ్లు సీఎంఆర్​కింద వస్తాయని ఆశించగా.. నిరుటికన్నా ఈసారి మిల్లలకు తక్కువ వడ్లే పంపారు. కొనుగోళ్లు పూర్తయి ఇప్పటికే జిల్లాలో కొన్ని సెంటర్లు మూతపడ్డాయి. ఇంక సెంటర్లకు 50 వేల టన్నుల వడ్లు మాత్రమే రావచ్చని అంచనా.   

వడ్ల స్టాక్ ఉందా?

సూర్యాపేట జిల్లాలో సీఎంఆర్ ఇవ్వకుండా వడ్ల స్టాక్ లేని రైస్ మిల్లులపై కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో యాదాద్రి జిల్లాలోని మిల్లుల్లో తనిఖీలు చేస్తారని వినిపిస్తోంది. గత రెండు సీజన్లలో బకాయిపడిన మేరకు సీఎంఆర్ వడ్ల  స్టాక్ ఉందా? అన్న చర్చ మొదలైంది. వానాకాలం సీజన్​కు సంబంధించి జిల్లాలోని రైస్​మిల్లులు 1,77,341 టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉండగా, ఈ నెల 24 వరకు 1,16,095 టన్నులు అప్పగించారు. యాసంగిలో 1,38,330 టన్నుల బియ్యానికి గాను 61,654 టన్నులే ఇచ్చారు. ఈ రెండు సీజన్లకు సంబంధించి ఇంకా 1,39,299 టన్నుల బియ్యం బకాయి ఉన్నారు. అంటే మిల్లుల్లో 2.21 లక్షల వడ్లు స్టాక్​ ఉండాలి. కానీ అంత స్టాక్ ఉంటుందా? అన్న చర్చ సీరియస్​గా నడుస్తోంది. 

ధర తక్కువైనా దళారులకే మొగ్గు

తెలంగాణ జిల్లాల్లోని కొన్ని మిల్లర్ల యజమానులు గత వానాకాలం, యాసంగి సీజన్లలో సీఎంఆర్​పూర్తిగా అప్పగించకుండా రైస్​ అమ్ముకున్నారు. ఆ కోటాను పూర్తి చేసేందుకు వారు దళారులను రంగంలోకి దింపి నేరుగా వడ్లు కొంటున్నారు. ఏపీలోని కాకినాడ నుంచి విదేశాలకు పెద్ద ఎత్తున నూకలు ఎక్స్​పోర్ట్​చేస్తుంటారు. అక్కడి వ్యాపారులకు సంబంధించిన దళారులు కూడా జిల్లాలో ధాన్యం కొంటున్నారు. అలా ఇతర జిల్లాలకు చెందిన వారు క్వింటాల్​కు రూ.1,650 నుంచి రూ.1,800 చొప్పున కొనుగోలు చేస్తామని రైతులను సంప్రదిస్తున్నారు. కల్లం వద్దకే వచ్చి కొంటుండడంతో మద్దతు ధర కంటే తక్కువగా వస్తున్నా ఖర్చులు కలిసి రావడంతో దళారులకే విక్రయిస్తున్నారు. తాలు, తప్పపేర కోతలు లేకపోవడం, సెంటర్ల దగ్గర పడిగాపులు పడాల్సిన అవసరం లేకపోవడం, వెంటనే క్యాష్​చేతికందుతుండడంతో రైతులు మొగ్గు చూపుతున్నారు.