ఫ్యూచర్ సిటీలోనూ వాన్గార్డ్ సెంటర్ రావాలి.. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

ఫ్యూచర్ సిటీలోనూ వాన్గార్డ్ సెంటర్ రావాలి.. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
  • వాన్ గార్డ్ గ్లోబల్ టెక్నాలజీ సెంటర్ ప్రారంభం

హైదరాబాద్, వెలుగు: ప్రపంచస్థాయి కంపెనీలకు హైదరాబాద్   కేంద్రంగా మారిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.  హైదరాబాద్ ​నాలెడ్జ్ సెంటర్​లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి వాన్ గార్డ్ గ్లోబల్ టెక్నాలజీ సెంటర్ ను  సోమవారం (నవంబర్ 03) ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. 

ఫ్యూచర్ సిటీలో సొంత కేంద్రాన్ని నిర్మించాలని వాన్​గార్డ్​ను  కోరారు. హైదరాబాద్‌‌లో ఈ సెంటర్ ఏర్పాటు టెక్నాలజీలకు, ఆవిష్కరణలకు గొప్ప గుర్తింపు అని భట్టి తెలిపారు. బలమైన మౌలిక వసతులు, వ్యాపారానుకూల విధానాలు తెలంగాణలో ఉన్నాయని,  ప్రతిభతో నిండిన ఎకోసిస్టమ్ హైదరాబాద్‌‌కు బలమని చెప్పారు. అందుకే ప్రపంచ స్థాయి కంపెనీలకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారుతుందని భట్టి పేర్కొన్నారు. 

వచ్చే ఏడాదిలో 120 జీసీసీ సెంటర్లు..  

వచ్చే ఏడాదిలో 120 గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లను ప్రారంభించి...  కొత్తగా 1.2 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని  ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. హైదరాబాద్ ఇన్నోవేషన్ కు చిరునామాగా మారిందని వివరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద పెట్టుబడి నిర్వహణ సంస్థల్లో ఒకటైన వాన్‌‌గార్డ్ తమ ‘గ్లోబల్ వ్యాల్యూ సెంటర్(జీవీసీ)'ను ప్రారంభించేందుకు హైదరాబాద్ ను ఎంచుకోవడం సిటీ సామర్థ్యానికి నిదర్శనమని మంత్రి అన్నారు.