- మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
 
సంగారెడ్డి, వెలుగు : సంగారెడ్డి జిల్లా కొల్లూరులోని డబుల్ బెడ్రూం కాలనీని రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. కాలనీలో స్కూల్, అంగన్‌వాడీ కేంద్రం నిర్మాణానికి సోమవారం మంత్రి దామోదర రాజనర్సింహ, హౌసింగ్ ఎండీ గౌతమ్, కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి పొంగులేటి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో సుమారు లక్ష మంది నివాసం ఉండేలా సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు.
కాలనీలో ప్రహరీ గోడ నిర్మాణం, ఆట స్థలం ఏర్పాటుకు త్వరలోనే చర్యలు తీసుకుంటామని చెప్పారు. నాలుగు రోజుల్లో కాలనీవాసులకు బస్సు సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. పోలీస్ ఔట్ పోస్ట్‌ను సైతం ఏర్పాటు చేస్తామని, ఇందుకోసం హౌసింగ్ శాఖకు చెందిన భవనాన్ని పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు అప్పగిస్తామని చెప్పారు. వారం రోజుల్లో పోలీస్ ఔట్ పోస్ట్‌ను ఏర్పాటు చేయాలని, పనిచేయని సీసీ కెమెరాలకు రిపేర్లు పూర్తి చేయాలని ఆదేశించారు. అంతకుముందు తెల్లాపుర్ డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో నిర్మిస్తున్న పీహెచ్‌సీని పరిశీలించారు.
మాది పేదల ప్రభుత్వం : మంత్రి దామోదర రాజనర్సింహ
పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. కాలనీవాసులకు విద్య, వైద్యపరంగా అన్ని రకాల సేవలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. కాలనీలో ఆరు బెడ్స్‌తో పీహెచ్‌సీ ఏర్పాటు చేసి, సంక్రాంతికి ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. 
 
