జీడిమెట్ల, వెలుగు: అనుమానంతో తన చెల్లిని వేధిస్తున్నాడనే కోపంతో బావమరిది కత్తితో బావపై దాడి చేశాడు. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్‌కు చెందిన అరవింద్ (30)కు భార్య, ఇద్దరు పిల్లలు. గత కొంతకాలంగా ఉప్పల్‌లో నివాసముండే వాడు. అల్విన్ కాలనీ, రాజరాజేశ్వరీ ఆశ్రమం సమీపంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివాసముంటున్నాడు. అతని భార్యపై అనుమానంతో తరచూ వేధించేవాడు.
గురువారం సైతం భార్యను వేధించడంతో ఆమె తన తమ్ముడికి ఫోన్ చేసింది. శుక్రవారం మధ్యాహ్నం ఇంటికి వచ్చిన అతని బావమరిది మాటామాటా పెరగడంతో కత్తితో దాడి చేసి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. అరవింద్ పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
