
- బీసీ బిల్లులను 9వ షెడ్యూల్‌లో
- చేర్పించాల్సిందే అంటున్న బీఆర్ఎస్ నేతలు
- కుదరదని తేల్చి చెబుతున్న బీజేపీ లీడర్లు
- ఒకవేళ చేర్చినా సుప్రీంకోర్టులో నిలువదంటూ కామెంట్లు
- బీసీ రిజర్వేషన్ల అమలుకు మూడు ఆప్షన్లు పెట్టుకున్న రాష్ట్ర సర్కారు
- తొలి ఆప్షన్‌గా 9వ షెడ్యూల్‌లో చేర్పించేందుకు చర్యలు
- కేంద్రం కుదరదంటే.. ఆర్డినెన్స్‌తో జీవో ఇచ్చేలా కసరత్తు
- అదీ కుదరకుంటే పార్టీపరంగా రిజర్వేషన్లు ఇచ్చే యోచన
- బీఆర్ఎస్, బీజేపీ తీరుపై కాంగ్రెస్ నేతల ఫైర్
హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం 3 ఆప్షన్లు పెట్టుకొని ముందుకు వెళ్తుండగా, బీజేపీ, బీఆర్ఎస్ తలోదారిలో వెళ్తుండడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రపతికి పంపిన బీసీ బిల్లులను పార్లమెంట్‌లోనూ ఆమోదించి 9వ షెడ్యూల్‌లో చేర్పించేలా కేంద్రాన్ని ఒప్పించాలని బీఆర్ఎస్, ఆ బిల్లులను ఎట్టిపరిస్థితుల్లో 9వ షెడ్యూల్‌లో చేర్చే అవకాశం లేదని బీజేపీ వాదిస్తున్నాయి. కాగా, బీసీ రిజర్వేషన్లపై ఈ రెండు పార్టీలు భిన్నదారుల్లో వెళ్తున్నట్లు కనిపిస్తున్నా.. అంతిమంగా వీటి లక్ష్యం బీసీ రిజర్వేషన్ల అమలును అడ్డుకోవడమేనని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు.
ప్రతిపక్షాల నుంచి ఎలాంటి సహకారం లేకపోయినా బీసీ రిజర్వేషన్ల విషయంలో వెనక్కి తగ్గవద్దని సర్కారు నిర్ణయించింది. రాష్ట్రపతికి పంపిన బీసీ బిల్లులపై ఇప్పటికే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి సానుకూల స్పందన వచ్చిందని, ఈ క్రమంలో బీసీ బిల్లులను షెడ్యూల్ 9 లో చేర్చించేందుకు ప్రధానిని కలిసి విజ్ఞప్తి చేస్తామని అంటున్నారు. ఒకవేళ ఇందుకు కేంద్రం ఒప్పుకోకపోతే ప్రత్యేకంగా జీవో ఇచ్చి.. రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్తున్నారు. అదీ కుదరకపోతే పార్టీపరంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇస్తూ ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. దీంతో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల వైఖరిపైనే అందరి దృష్టి ఉన్నది.
ఇప్పటికే ఆర్డినెన్స్ జారీ
బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లను కల్పించే రెండు బిల్లులకు అసెంబ్లీలో సర్కారు ఆమోదముద్ర వేయించుకున్నది. ఆ బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కోసం పంపింది. కానీ, ఇప్పటివరకూ ఎలాంటి స్పందనా రాలేదు. ఈ నేపథ్యంలోనే సర్కారు పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేసే ఆర్డినెన్స్ డ్రాఫ్ట్‌ను తయారు చేసి గవర్నర్ ఆమోదం కోసం పంపింది. దానికి గవర్నర్ ఆమోదం తెలిపితే.. ఆర్డినెన్స్ ఆధారంగా 42శాతం బీసీ రిజర్వేషన్ల అమలుకు జీవో జారీ చేసి.. స్థానిక సంస్థలకు వెళ్లాలని యోచిస్తున్నది. అదే సమయంలో తమిళనాడును కేస్‌స్టడీగా తీసుకొని బీసీ బిల్లులను షెడ్యూల్ 9లో చేర్పించేలా కసరత్తు చేస్తున్నది. ఒకవేళ షెడ్యూల్9లో చేర్చాలంటే ప్రత్యేకంగా పార్లమెంట్‌లో ఈ అంశంపై చర్చించి, మెజారిటీ సభ్యుల ఆమోదం పొందాల్సి ఉంటుంది. కాగా, 9వ షెడ్యూల్‌లో చేర్చేది లేదని బీజేపీ నేతలు ఇప్పటికే స్పష్టం చేస్తున్న నేపథ్యంలో.. పార్లమెంట్‌లో దానికి ఆమోదం తెలపడం అంత సులువైన విషయం కాదన్న అభిప్రాయమూ వ్యక్తమవుతున్నది.
ఒకవేళ పై రెండు మార్గాలూ కుదరకపోతే..
పార్టీపరంగా బీసీలకు 42శాతం సీట్లు కేటాయించాలన్న ఆలోచనలో సర్కారు ఉన్నది. ఈ క్రమంలోనే బీజేపీ
రాష్ట్ర నేతలకు దమ్ముంటే 9వ షెడ్యూల్‌లో చేర్పించాలని కాంగ్రెస్ నేతలు కొద్దిరోజులుగా డిమాండ్చేస్తున్నారు. చేతగాకుంటే బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలని సవాల్విసురుతున్నారు.
బీజేపీ యూ టర్న్
సర్కారు తెచ్చిన బీసీ బిల్లులకు అసెంబ్లీలో తొలుత బీజేపీ తన మద్దతు ప్రకటించింది. కానీ, ఇప్పుడు మాత్రం యూటర్న్ తీసుకున్నది. బీసీ బిల్లులను షెడ్యూల్9లో చేర్చేలా కేంద్ర సర్కారుపై ఒత్తిడి తేవాల్సిన రాష్ట్ర బీజేపీ నేతలు, ఎంపీలు ఉల్టా 9వ షెడ్యూల్‌లో చేర్చేది లేదంటూ కరాఖండిగా చెబుతున్నారు. కొన్నివర్గాల ముస్లింలను బీసీల్లో చేర్చడం తమకు ఆమోదయోగ్యం కాదని, వాళ్లను బీసీల జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావుతో పాటు కేంద్ర మంత్రి సంజయ్ ఇప్పటికే ఓపెన్‌గానే ఈ విషయాన్ని తేల్చి చెప్పారు. ముస్లింలను బీసీల జాబితా నుంచి తొలగించాల్సిందేనని పట్టుబడుతున్నారు. 9వ షెడ్యూల్‌లో పెట్టినా సుప్రీంకోర్టు దానిని కొట్టేసే అవకాశాలున్నాయని వాదిస్తున్నారు. ఇప్పటికే తమిళనాడు కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉందని చెబుతున్నారు. కాగా, ఉత్తరాది రాష్ట్రాల్లోనూ కులవృత్తులు చేసుకునే ముస్లింలు బీసీ జాబితాలో ఉన్న విషయాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తుచేస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్‌కు బీసీ రిజర్వేషన్లను పెంచడం ఇష్టంలేకే ఇలాంటి అర్థంలేని కారణాలు చెప్తున్నారని మండిపడుతున్నారు.
బీసీ సంఘాలు ఫైర్..
బీసీ రిజర్వేషన్ల పెంపుకోసం రాష్ట్ర ప్రభుత్వం 3 మార్గాల్లో ముందుకెళ్తుండగా ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్ మాత్రం కాళ్లల్లో కట్టెలు పెడ్తున్నాయని బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. 9వ షెడ్యూల్అంటూ బీఆర్ఎస్ఒంటెత్తు పోకడలు పోతుంటే.. బీసీల్లో ముస్లింల అంశాన్ని బీజేపీ కావాలనే ముందర వేసుకున్నదని ఫైర్అవుతున్నారు. ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం పొందాలన్నా.. షెడ్యూల్9లో దానిని చేర్చాలన్న బీజేపీ నేతలు మద్దతు తప్పనిసరి అని గుర్తుచేస్తున్నారు. కేంద్రంలో ఉన్నది బీజేపీనే కాబట్టి.. కేంద్రాన్ని ఒప్పించేలా ఇక్కడి బీజేపీ నేతలే బాధ్యత తీసుకోవాలని డిమాండ్చేస్తున్నారు.
ఆర్డినెన్స్‌పై ఆది నుంచీ బీఆర్ఎస్ వ్యతిరేక ధోరణి
ఆర్డినెన్స్‌పై బీఆర్ఎస్ పార్టీ ఆదినుంచీ వ్యతిరేక ధోరణితోనే ఉన్నది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతానికి మించి రిజర్వేషన్లను కల్పించాలంటే బిల్లులను 9వ షెడ్యూల్‌లో పెట్టాల్సిందేనని చెబుతున్నది. ఆర్డినెన్స్ ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నాలు చేస్తున్నదంటూ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు ఆ పార్టీ బీసీ నేతలు కాంగ్రెస్ సర్కారును విమర్శిస్తున్నారు. ఆర్డినెన్స్‌లు కోర్టుల్లో నిలువవని, గతంలో అనేక రాష్ట్రాల్లో ఆర్డినెన్స్‌లను కోర్టులు కొట్టేశాయని చెప్తున్నారు. అందుకే కేంద్రం వద్ద బిల్లులకు ఆమోద ముద్ర వేయించుకుని.. ఆ తర్వాత 9వ షెడ్యూల్‌లో పెట్టించి రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పటివరకూడా కొట్లాడుతూనే ఉంటామని అంటున్నారు. అదే సమయంలో ఆ పార్టీ నేత, ఎమ్మెల్సీ కవిత మాత్రం.. ఆర్డినెన్స్‌కు మద్దతు తెలిపారు. ఆర్డినెన్స్‌తో బీసీలకు లబ్ధి చేకూరుతుందని, న్యాయపరంగా ఎలాంటి సమస్యలూ రాబోవని చెప్తున్నారు.