సంగారెడ్డి జిల్లాలో ప్రొటోకాల్ ​రగడ

సంగారెడ్డి జిల్లాలో ప్రొటోకాల్ ​రగడ

సంగారెడ్డి, వెలుగు  : కల్యాణలక్ష్మి, షాదీ ముబా రక్ చెక్కుల పంపిణీ సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గీయుల మధ్య ప్రొటోకాల్​ విషయంలో గొడవ జరిగింది. బుధవారం మధ్యాహ్నం సదాశివపేటలో కాంగ్రెస్ అధ్యక్షురాలు నిర్మలారెడ్డి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేస్తుండగా..బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అనుచరులు ప్రొటోకాల్​ పాటించాలంటూ అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ లీడర్లు కలగజేసుకోగా ఒకరినొకరు తోసుకునే వరకూ వెళ్లింది. ఎమ్మెల్యే ప్రభాకర్ మాట్లాడుతూ ఎమ్మెల్యేలంతా ఒక్కటే అని చెప్తున్న కాంగ్రెస్​ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పట్ల వివక్ష చూపుతోందన్నారు. ప్రొటోకాల్ ​పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు నిర్మలారెడ్డి మాట్లాడుతూ పథకాల మంజూరులో వివక్ష చూపనప్పుడు చెక్కులు ఎవరు పంపిణీ చేస్తే ఏమిటన్నారు. కాంగ్రెస్ హయాంలో అందరూ సమానమే అన్న ఆమె.. కలిసి మెలిసి ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ వారి అవసరాలు తీర్చాలన్నారు. అంతకుముందు సంగారెడ్డి టౌన్ టీఎన్జీవో భవన్​లో ఏర్పాటు చేసిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలోనూ ఇలాంటి గొడవే జరిగింది. ముందుగా వచ్చిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని డిప్యూటీ తహసీల్దార్ విజయలక్ష్మిని కోరగా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు నిర్మలారెడ్డి వస్తున్నారని కాసేపు ఆగాలని కోరారు.

అప్పటివరకు ఎమ్మెల్యే ప్రసంగించారు. ఆయన స్పీచ్​ తర్వాత కూడా నిర్మలారెడ్డి రాకపోవడంతో చెక్కుల పంపిణీ మొదలుపెట్టాలని ఎమ్మెల్యే వర్గీయులు కోరగా, డీటీ మరికొంత టైం కావాలన్నారు. అప్పటికీ నిర్మలా రెడ్డి రాకపోవడంతో అసహనానికి గురైన ఎమ్మెల్యే డయాస్​నుంచి లేచి వెళ్లిపోబోయారు. కాసేపు ఆగాలని డిప్యూటీ తహసీల్దార్ ఆయన కారు వరకు వెళ్లి రిక్వెస్ట్ చేశారు. ఎమ్మెల్యే వెళ్లిన ఐదు నిమిషాలకు నిర్మలారెడ్డి ప్రోగ్రాం వద్దకు వచ్చి ఎంపీపీ లావణ్యతో చెక్కులు పంపిణీ చేయించారు.