పీఏసీ మీటింగ్ గరంగరం.. అరికెపూడి గాంధీ ఎన్నికపై అసంతృప్తి

పీఏసీ మీటింగ్ గరంగరం.. అరికెపూడి గాంధీ ఎన్నికపై అసంతృప్తి

 

హైదరాబాద్, వెలుగు: పబ్లిక్ అకౌంట్స్‌‌ కమిటీ(పీఏసీ) తొలి సమావేశం గరంగరంగా జరిగింది. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్‌‌లో శనివారం జరిగిన సమావేశాన్ని బీఆర్ఎస్ బహిష్కరించింది. కమిటీ చైర్మన్‌‌గా బీఆర్ఎస్ తరఫున ఐదుగురి పేర్లను ఇచ్చినా వాటిని కాదని అరికెపూడి గాంధీని స్పీకర్ ఖరారు చేయడంపై ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తంచేశారు. కమిటీ ఏర్పడిన తర్వాత జరిగిన మొదటి సమావేశంలోనే చైర్మన్‌‌ను, స్పీకర్‌‌నూ గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. శాసనసభ సంప్రదాయాలకు విరుద్ధంగా చైర్మన్ ఎంపికతోపాటు కమిటీ కూర్పు నిర్ణయమైందని ఆరోపించారు. 

నామినేట్ చేయాల్సిందిగా పంపిన ఐదు పేర్లను కాదని కొత్త పేరును ఎందుకు ఎంపిక చేయాల్సి వచ్చిందని  స్పీకర్‌‌ను అడిగారు. సమాధానం చెప్పడానికి స్పీకర్ సంసిద్ధం కాకముందే శాసనసభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌‌బాబు జోక్యం చేసుకోడానికి నిరసనగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు (ఈ కమిటీలో సభ్యులు) తొలి సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. అనంతరం బయటకు వెళ్లిపోయారు. పీఏసీ కమిటీలో బీఆర్ఎస్ తరఫున వేముల ప్రశాంత్‌‌రెడ్డి, గంగుల కమలాకర్ (అసెంబ్లీ సభ్యులు), సత్యవతి రాథోడ్, ఎల్.రమణ (ఎమ్మెల్సీలు) మెంబర్లుగా ఉన్నారు. 

సంప్రదాయం, ఆనవాయితీ ప్రకారం పీఏసీ చైర్మన్ పోస్టును ప్రతిపక్ష సభ్యుడికి స్పీకర్ ఇస్తారు. ఆ ప్రకారమే ఈసారి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని నియమించారు. కానీ, బీఆర్ఎస్ సభ్యులు మాత్రం ఇటీవల గాంధీ కాంగ్రెస్‌‌లో చేరారని, తమ పార్టీ ఎమ్మెల్యే కాదని ఆరోపించారు. శాసనసభ గణాంకాల ప్రకారం అరికెపూడి గాంధీ ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే ఉన్నారని, ఆయనకు కాంగ్రెస్‌‌కు సంబంధం లేదని స్పీకర్ కార్యాలయం గతంలోనే వివరణ ఇచ్చింది.

ప్రతిపక్షానికే చైర్మన్ ​పోస్ట్​.. స్పీకర్​ క్లారిటీ

పీఏసీ సమావేశం ప్రారంభం కావడానికి ముందే చైర్మన్ ఎంపికపైనా, కమిటీ కూర్పుపైనా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్‌‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ కమిటీలో చోటు దక్కించుకున్న నలుగురు సభ్యులు ఈ అంశాన్ని లేవనెత్తారు. వివరణ ఇవ్వాల్సిందిగా స్పీకర్‌‌ను నిలదీశారు. ప్రతిపక్షానికే  చైర్మన్ పోస్టు ఇచ్చామని స్పీకర్ క్లారిటీ ఇచ్చారు. గతంలో అనుసరించిన సంప్రదాయాన్నే ఈసారి కూడా అమలు చేశామని నొక్కిచెప్పారు. కమిటీల కూర్పుపై స్పీకర్‌‌కు విచక్షణాధికారం ఉంటుందని వాదనల సందర్భంగా బదులిచ్చారు. 

గతంలో కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల సంఖ్యాబలంలో తేడాలున్నప్పటికీ చైర్మన్ ఎంపిక విషయంలో విపక్షాల నుంచి ఇదే తరహా అసంతృప్తి, ఆరోపణలు వచ్చాయని, అప్పటి స్పీకర్ తన నిర్ణయాన్ని సమర్ధించుకున్న అంశాన్ని కూడా ప్రస్తుత స్పీకర్ గడ్డం ప్రసాద్ గుర్తుచేశారు.  ప్రస్తుతం పీఏసీ చైర్మన్‌‌గా ఎంపికైన అరికెపూడి గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే ఉన్నారని, రికార్డులు కూడా అదే చెప్తున్నాయని, అందువల్లనే ప్రతిపక్ష సభ్యుడికే అవకాశం ఇచ్చామని శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌‌బాబు సైతం స్పష్టం చేశారు. 

అరికెపూడిని మేం నామినేట్​ చేయలే: వేముల

పీఏసీ ఫస్ట్ మీటింగ్​ను బహిష్కరించిన అనంతరం ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌‌రెడ్డి మీడియా ప్రతినిధులతో చిట్‌‌చాట్ చేశారు. 2018లో అతిపెద్ద విపక్ష పార్టీగా మజ్లిస్ పార్టీ ఉన్నదని, అందువల్లే ఆ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌‌ను చైర్మన్‌‌గా ఎంపిక చేసినట్టు వివరణ ఇచ్చారు. ఇప్పుడు పీఏసీ చైర్మన్‌‌గా ఎంపికైన అరికెపూడి గాంధీ పేరును బీఆర్ఎస్ శాసనసభా పక్షం నామినేట్ చేయలేదని, పేరును కూడా ఇవ్వనప్పుడు ఆయనను ఎలా పరిగణనలోకి తీసుకుంటారని, స్పీకర్‌‌ను కూడా ఇదే ప్రశ్నించామని వివరించారు. 

హరీశ్‌‌రావు పేరును ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. 2014లో కాంగ్రెస్‌‌కు పార్లమెంటులో ప్రతిపక్ష హోదా లేదని, అయినా ఆ పార్టీకి చెందిన కేసీ వేణుగోపాల్ పేరును అప్పటి స్పీకర్ ఖరారు చేశారని గుర్తుచేశారు. 2018లో తెలంగాణ అసెంబ్లీలో శ్రీధర్‌‌బాబుకు పీఏసీ చైర్మన్ పోస్టు ఇవ్వాలని కాంగ్రెస్ తరఫున రిక్వెస్టు రాలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా బదులిచ్చారు. ప్రభుత్వ ఆర్థిక నిర్వహణలో పీఏసీ పాత్ర ప్రజాస్వామికంగా చాలా కీలకమైనదని, ఖర్చవుతున్న ప్రతి రూపాయిని ప్రజల పక్షాన ఈ కమిటీ ఆడిట్ చేస్తుందని చెప్పారు. 

బీఆర్ఎస్‌‌కు ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న సంఖ్యాబలం రీత్యా ఐదుగురి పేర్లను పంపించినట్టు తెలిపారు. ఈ వివాదంపై స్పీకర్ నుంచి సరైన సమాధానం రాకపోవడం అసంతృప్తి కలిగించిందని ఎమ్మెల్సీ ఎల్ రమణ అన్నారు. ప్రతిపక్ష సభ్యుల నిరసనను పరిగణనలోకి తీసుకుని పీఏసీ చైర్మన్ నియామకంతోపాటు కూర్పుపై స్పీకర్ మరోసారి ఆలోచించాలన్నారు. ప్రధాన ప్రతిపక్ష నేతను సంప్రదించి, పొరపాటు సరిదిద్దుకోవాలన్నారు.

నిబంధనల ప్రకారమే నడుచుకున్నాం: కాంగ్రెస్​

బీఆర్‌‌ఎస్ ఆరోపణలను కాంగ్రెస్ నేతలు తిప్పికొట్టారు. పీఏసీ గౌరవాన్ని తగ్గించేలా బీఆర్‌‌‌‌ఎస్ సభ్యులు ప్రవర్తిస్తున్నారని యెన్నం శ్రీనివాస్‌‌రెడ్డి విమర్శించారు. పీఏసీ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత బీఆర్‌‌‌‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని వెలికి తీస్తామన్న భయంతోనే పీఏసీ చైర్మన్ ఎంపికను రాద్ధాంతం  చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రూల్స్ ప్రకారమే పీఏసీ  చైర్మన్ నియామకం జరిగిందని చెప్పారు. పీఏసీ మీటింగ్​లో స్పీకర్​పై ఇష్టం వచ్చిన పదజాలంతో బీఆర్‌‌‌‌ఎస్ సభ్యులు దాడికి దిగారని ఆరోపించారు. 

పీఏసీ ప్రజల పక్షాన ఉంటుందని చెప్పారు.  ‘‘అరికెపూడి గాంధీ సీనియర్ సభ్యుడు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే...ఆయన ప్రతిపక్ష ఎమ్మెల్యే, అలాంటి సభ్యున్ని పీఏసీ చైర్మన్ చేస్తే తప్పేమిటి?”అని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ  ప్రశ్నించారు. ‘‘2018 లో  ప్రతిపక్ష నేతగా భట్టి ఉంటే బీఆర్‌‌‌‌ఎస్ నేతలు సహించారా? దళితుడిని ప్రతిపక్ష నేతగా ఉండనిచ్చారా?’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఏసీ రూల్ ప్రకారమే చైర్మన్ ఎంపిక జరిగిందని,  బీఆర్ఎస్ ఆరోపణలు నిరాధారమైనవని అన్నారు.