ఏడుపాయలకు 100 కోట్లిస్తామని మాట తప్పిన బీఆర్​ఎస్​

ఏడుపాయలకు 100 కోట్లిస్తామని మాట తప్పిన బీఆర్​ఎస్​
  •     నెరవేరని మాజీ సీఎం హామీ
  •     ఎండోమెంట్​ మినిస్టర్​ జిల్లా 
  •       ఇన్​ఛార్జి కావడంతో నిధులపై ఆశలు

పాపన్నపేట, వెలుగు: రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయిన ఏడుపాయలను, వనదుర్గా ప్రాజెక్ట్ ప్రాంతాన్ని కలిపి టూరిజం కేంద్రంగా డెవలప్ చేసేందుకు రూ.100 కోట్లు మంజూరు చేస్తామని గత బీఆర్​ఎస్​ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్​ఇచ్చిన హామీ ఉత్తమాటగానే మిగిలింది. మల్లన్న సాగర్​ ప్రాజెక్ట్​ ప్రారంభం సందర్భంగా మెదక్ జిల్లాలోని వనదుర్గా ప్రాజెక్ట్​, ఏడుపాయల వనదుర్గా మాతా ఆలయాన్ని  పర్యాటక ప్రాంతాలుగా  అభివృద్ధి చేసేందుకు రూ.1,500 కోట్లు మంజూరు చేస్తామని చెప్పారు.

ఈ నిధులతో కాటేజీలు నిర్మిస్తామని, ఆలయం చుట్టూ గిరి ప్రదక్షిణకు ఏర్పాట్లు చేస్తామని, గ్రీనరీ డెవలప్​ చేస్తామని, ప్లే ఏరియా, వ్యూపాయింట్లు, పార్కింగ్​ సౌకర్యాలు కల్పిస్తామని, మౌలిక వసతులు మెరుగు పరుస్తామని మాజీ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు చెప్పారు.​  గడచిన అసెంబ్లీ ఎన్నికల ముందు ఏడుపాయలకు రూ.100 కోట్లు మంజూరు చేస్తూ జీవో విడుదల చేశారు. కానీ ఫండ్స్​ మాత్రం రాలేదు. ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్​ ప్రభుత్వం టెంపుల్​ టూరిజం డెవలప్​మెంట్ కు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించండం, ఎండోమెంట్​ మినిస్టర్​కొండా సురేఖ ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్​చార్జి మంత్రిగా ఉండడంతో ఏడుపాయల  అభివృద్ధికి నిధులు మంజూరవుతాయని అందరు భావిస్తున్నారు.  

సరిపడ నిధులొస్తేనే..

ఏడుపాయల్లో భక్తులకు అవసరమైన కనీస మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. భక్తులు బస చేసేందుకు సత్రాలు, కాటేజీలు, షెడ్​లు, పర్మనెంట్​ టాయిలెట్స్, స్నాన ఘట్టాలు, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు గదులు, డ్రైనేజీ సిస్టం, తాగునీటి వసతి, పార్కింగ్​ ఏరియా తదితర సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. ప్రభుత్వం తగినన్ని నిధులు మంజూరు చేస్తే ఇలాంటి పనులు చేపట్టేందుకు అవకాశం ఉంటుంది. ఇటీవల టెంపుల్​ టూరిజం డెవలప్​మెంట్ కు చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించడంతో ఏడుపాయల అభివృద్ధికి అవసరమైన నిధులు అందుతాయని అధికారులు భావిస్తున్నారు. 

కోట్లలో ఆదాయం ఉన్నా..

కొబ్బరి కాయలు, ఒడిబియ్యం సేకరణ టెండర్లు, పూజా సామగ్రి, ప్రసాద విక్రయాలు, ప్రత్యేక దర్శనం, వాహన పూజల టికెట్లు, హుండీలో భక్తులు సమర్పించే కానుకల ద్వారా ఏటా ఆలయానికి  దాదాపు రూ.8 కోట్ల ఆదాయం సమకూరుతోంది. అంతేగాక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించాక ఏటా శివరాత్రి జాతర నిర్వహణకు ప్రభుత్వం రూ.కోటి నుంచి రూ.2 కోట్లు మంజూరు చేస్తోంది. అయినప్పటికీ ఏడుపాయల్లో భక్తుల సంఖ్యకు అనుగుణంగా సౌకర్యాలు లేవు.  దాతలు నిర్మించిన సత్రాలు, షెడ్​లు 50 వరకు ఉండగా ఆదివారాల్లో, ఇతర సెలవు రోజుల్లో  భక్తుల రద్దీకి అవి సరిపోవడంలేదు. దీంతో ఖాళీ జాగాల్లో కిరాయి టెంట్లు వేసుకుని ఉంటున్నారు. జాతర టైంలో అయితే సత్రాలు, షెడ్​లు ఎవరికీ ఇవ్వరు. భక్తులందరూ ఖాళీ ప్రదేశాల్లో, చెట్లకింద విడిది చేసి వెళ్లిపోతారు.