వేరొకరి భూమిని తన భూమిగా.. ఎన్నికల అఫిడవిట్​లో పేర్కొన్న వినోద్​కుమార్​

వేరొకరి భూమిని తన భూమిగా.. ఎన్నికల అఫిడవిట్​లో పేర్కొన్న  వినోద్​కుమార్​
  • సొంతూరు ఏనుగల్లులో 251/బీ సర్వే నంబర్ లో భూమి ఉన్నట్లు వెల్లడి
  • ధరణిలో ఆ నంబర్ పై‌ మరొక వ్యక్తి పేరిట 14  గుంటలు 
  • తన భార్య పేరుపై ఉన్న ల్యాండ్  వివరాల్లోనూ తప్పులు 
  • వినోద్  తండ్రి మురళీధర్ రావు పేరిట ధరణిలో 1.10 ఎకరాల ప్రభుత్వ భూమి నమోదు

కరీంనగర్, వెలుగు: బీఆర్ఎస్  కరీంనగర్  లోక్​సభ అభ్యర్థి వినోద్  కుమార్  తనది కాని భూమిని తన భూమిగా ఎన్నికల అఫిడవిట్​లో చూపారు. తన భార్యకు చెందిన భూమితో పాటు తన కుటుంబ భూమి వివరాలను కూడా ఆయన తప్పుగా పొందుపరిచారు. వినోద్  కుమార్  తన సొంతూరైన వరంగల్  జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లులో తన ఉమ్మడి కుటుంబ ఆస్తిగా సర్వే నంబర్ 174, 175/ఏ, 251/బీ, 280/ఏ, 306, 307, 279/సీ, 274, 275/ఏ, 272/బీ, 273/ఏ, 282/బీ, 286/ఏలో 11.06 ఎకరాల డ్రై ల్యాండ్, 4-14 ఎకరాల వెట్ ల్యాండ్  ఉన్నట్లు వెల్లడించారు. ఇందులో పేర్కొన్న 251/బీ సర్వే నంబర్​లో వినోద్  కుమార్ కుటుంబానికి ఎలాంటి భూమి లేదు. ఆ నంబర్ పై అదే గ్రామానికి చెందిన అప్పని పెద్ద సాంబయ్యకు 14 గుంటల భూమి ఉన్నట్లు ధరణి రికార్డులు వెల్లడిస్తున్నాయి. కానీ, ఈ సర్వే నంబర్​ను వినోద్  తన భూమిగా అఫిడవిట్​లో పేర్కొన్నారు. అలాగే ధరణి రికార్డుల ప్రకారం ఏనుగల్లులోని సర్వే నంబర్ 286లో ఉన్న మొత్తం భూమే 1.15 ఎకరాలు. ఆ భూమి అంతా ధరణి రికార్డుల ప్రకారం నల్లపు నాగలక్ష్మిపేరిట చూపిస్తోంది. కానీ, వినోద్  తన అఫిడవిట్ లో 286/ఏలో తనకు భూమి ఉన్నట్లు పేర్కొన్నారు. అసలు ధరణిలోనే లేని సర్వే నంబర్ లో భూమి ఉన్నట్లు వెల్లడించడం, ఎన్నికల సంఘానికి తప్పుడు సమాచారం ఇవ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.   

వినోద్ తండ్రి పేరిట 1.10 ఎకరాల అసైన్డ్  భూమి

బోయిన్​పల్లి వినోద్​కుమార్​ తండ్రి మురళీధర్ రావు పేరిట ఏనుగల్లులో 45.16 ఎకరాల భూమి ఉంది. ఇందులో 1.10 ఎకరాల గవర్నమెంట్/అసైన్డ్  భూమి కూడా ఆయన పేరిట నమోదు కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏనుగల్లు గ్రామంలో 175/4 సర్వే నంబర్ లో 25 గుంటలు, 175/ఏ/4/1 సర్వే నంబర్​లో మరో 25 గుంటలు కలిపి మొత్తం 1.10 ఎకరాల అసైన్డ్  భూమి మురళీధర్ రావు పేరిట చూపిస్తోంది. భూస్వామ్య కుటుంబానికి చెందిన ఆయనకు ల్యాండ్ ఎలా అసైన్  చేశారో అంతుబట్టని ప్రశ్నగా మారింది. ధరణిలో ఈ భూమిని నిషేధిత జాబితాలో చూపడం గమనార్హం. 

వినోద్ భార్య మాధవి ల్యాండ్  వివరాల్లోనూ తప్పులు 

వినోద్ కుమార్ తన భార్య మాధవి పేరిట రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్​పల్లి మండలం నర్సింగాపూర్  గ్రామంలో 2020 జులైలో 577 సర్వే నంబర్ లో 19.02 ఎకరాలు, అదే ఏడాది నవంబర్ లో 582వ సర్వే నంబర్ లో 13 గుంటలు, 579 సర్వే నంబర్​లో 13 గుంటల భూమి కలిపి మొత్తం 19.28 ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలు చేసినట్లు చూపారు. కానీ, ధరణి పోర్టల్ లో మాధవి పేరిట 19.13 ఎకరాలు మాత్రమే నమోదైనట్లు చూపుతోంది. ఈ లెక్కన 15 గుంటల భూమి అఫిడవిట్​లో ఎక్కువగా చూపినట్లు స్పష్టమవుతోంది.