గ్రేటర్ హైదరాబాద్​లో ఎన్నికల ప్రచారానికి.. సీఎం, మంత్రులు రావాలి

గ్రేటర్ హైదరాబాద్​లో ఎన్నికల ప్రచారానికి.. సీఎం, మంత్రులు రావాలి
  •     రోడ్ షోలు నిర్వహించాలని కోరుతున్న బీఆర్ఎస్ అభ్యర్థులు
  •     ప్రతిపక్ష పార్టీల క్యాండిడేట్లు బలంగా ఉండటంతో మొదలైన టెన్షన్
  •     గత ఎన్నికల్లో మాదిరిగా బీఆర్ఎస్ అగ్ర నేతలు ప్రచారానికి వస్తే మైలేజ్​ వస్తుందని భావిస్తున్న నేతలు

హైదరాబాద్, వెలుగు : గ్రేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని బీఆర్ఎస్ ​అభ్యర్థులు సీఎం కేసీఆర్, మంత్రి  కేటీఆర్ ప్రచారం కోసం ఎదురు చూస్తున్నారు. ఈసారి ప్రధాన ప్రతపక్ష పార్టీల్లోని క్యాండిడేట్లు బలంగా ఉండటంతో అధికార పార్టీ అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది.  2018 ఎన్నికల్లో మాదిరిగా అధికార పార్టీకి కలిసి వచ్చే అవకాశాలు పెద్దగా లేకపోవడంతో  ఆ పార్టీ అభ్యర్థులు అగ్ర నాయకుల ప్రచారంపైనే ఆధారపడినట్లు కనిపిస్తున్నది.  ఏ రోజు ఎవరు పార్టీలోకి  వస్తున్నారో, ఎవరు పార్టీని వీడుతున్నారో అభ్యర్థులకే తెలియడం లేదు.  2018 ఎన్నికలు,  గ్రేటర్ ఎన్నికల మాదిరిగా ఈ సారి కూడా సిటీలో  మంత్రి కేటీఆర్ రోడ్ షోలు నిర్వహించాలని, రెండు, మూడు బహిరంగ సభల్లో సీఎం కేసీఆర్ లేదా మంత్రి కేటీఆర్ పాల్గొనేలా చూడాలని అభ్యర్థులు అధిష్టానాన్ని కోరుతున్నారు.  

నామినేషన్ల ప్రక్రియ మొదలయ్యాక రోజుకు రెండు నియోజకవర్గాల్లో గ్రేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 10 నుంచి12 రోజుల పాటు  కేటీఆర్ రోడ్ షోలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.  మొత్తానికి ఈ సారి ఓటర్లు ఎలాంటి తీర్పు ఇస్తారోనని గ్రేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అధికార పార్టీ అభ్యర్థుల్లో టెన్షన్ పట్టుకుంది.  గ్రేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని 24 సెగ్మెంట్లలో అధిక స్థానాల్లో రెండు, మూడుసార్లు గెలుపొందిన వారే ఈసారి పోటీలో ఉన్నారు.  కొత్తవారికి అవకాశం ఇద్దామని ఓటర్లు డిసైడ్ అయ్యే చాన్స్ ఉండటంతో గ్రౌండ్ లెవెల్లో ఉన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు కిందిస్థాయి నేతలను అడిగి అభ్యర్థులు వివరాలు  తెలుసుకుంటున్నారు.

గ్రేటర్ ఎన్నికల తర్వాత ఢీలా పడ్డ బీఆర్ఎస్​..

జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత గ్రేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బీఆర్ఎస్ పార్టీ ఢీలా పడింది.  తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో 99 సీట్లు సాధించగా 2020లో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో 55 సీట్లకు పడిపోయింది.  ఆ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది.  గతంలో 4  సీట్లలో ఉన్న బీజేపీ 48  సీట్లను గెలుచుకుంది. గ్రేటర్ ఎన్నికల్లో మంత్రి  కేటీఆర్ అన్ని తానై ఎన్నికల్లో ప్రచారం నిర్వహించినప్పటికీ అధికార పార్టీకి  జనం షాక్ ఇచ్చారు.  ఈసారి ఎన్నికల్లో కూడా జనం అదే తీర్పు ఇస్తారేమోనని బీఆర్ఎస్ అభ్యర్థులు టెన్షన్‌‌‌‌‌‌‌‌ పడుతున్నట్లు తెలుస్తోంది.

.ఇప్పటికే కొన్ని సెగ్మెంట్లలో అభ్యర్థులపై జనం తిరగబడుతున్నారు.  రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఏం చేశావో చెప్పాలంటూ నేతలను అడ్డుకుంటున్నారు.  సికింద్రాబాద్ అభ్యర్థి పద్మారావు గౌడ్​పై ఏకంగా మహిళలు చీపుర్లను పట్టుకొని అడ్డుకున్నారు.  ఇలా చాలా సెగ్మెంట్లలో అధికార పార్టీ నేతలకు ఎదురుగాలులు వీస్తున్నాయి. 

హామీలు అమలు కాక ఇబ్బందులు 

గ్రేటర్ వాసులకు గత అసెంబ్లీ ఎన్నికల్లో,  గ్రేటర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు కాలేదు.  లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ 9 ఏళ్లలో 65 వేల ఇండ్లను మాత్రమే అందించారు.  అందులో ఇండ్లు అందినట్లు చెప్పినప్పటికీ ఇంకా వేలాది మంది ఇండ్లలోకి వెళ్లలేదు. హైదరాబాద్​ను డల్లాస్, ఇస్తాంబుల్​గా చేస్తామని చెప్పినప్పటికీ ఇంకా చాలా ప్రాంతాల్లో వరద ముంపు అలాగే ఉంది. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా, రోడ్లు దెబ్బతిని ఉన్నాయి.

నిరుద్యోగుల సమస్య తీరలేదు.  ఈ నేపథ్యంలో ప్రచారానికి వస్తున్న అధికార పార్టీ అభ్యర్థులపై జనం తిరగబడుతున్నారు.  దీంతో సీఎం కేసీఆర్ లేదా మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జనంలోకి వచ్చి చెబితే ఎంతో కొంత మైలేజ్ వచ్చే అవకాశముందని గ్రేటర్​లోని బీఆర్ఎస్ అభ్యర్థులు భావిస్తున్నట్లు సమాచారం. పార్టీ అగ్ర నేతలపైనే అభ్యర్థులు ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.