మళ్లీ కేసీఆర్ సెంటిమెంట్ ఉద్యమం : కృష్ణా జలాలపై సభలు

 మళ్లీ కేసీఆర్ సెంటిమెంట్ ఉద్యమం : కృష్ణా జలాలపై సభలు

కృష్ణా జలాల అంశంపై పోరాటం చేయాలని బీఆర్ఎస్ మాజీ చీఫ్ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు . ఫిబ్రవరి 13వ తేదీన నల్గొండ జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించి ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని ప్రకటించారు.  కృష్ణా నదీజలాలపై తెలంగాణ హక్కులను కాపాడుకోవడం కోసం ఎంతవరకైనా పోరాడుతామని స్పష్టం చేశారు. తెలంగాణ భవన్ లో  మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ జిల్లాల ప్రతినిధులతో కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. 

బీఆర్ఎస్ పార్టీకి ఉద్యమాలు కొత్తవీ కాదన్న కేసీఆర్.. రాష్ట్ర ప్రయోజనాలు మనకు ముఖ్యమని పార్టీ నేతలతో అన్నారు.  ప్రజాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వ ధోరణిని ఎండగడుతామని వెల్లడించారు. నాడు ఉద్యమం నడిపించి తెలంగాణ ను సాధించి తెలంగాణ హక్కులను కాపాడుకున్న స్ఫూర్తి తోనే నేడు మరో ప్రజా ఉద్యమాన్ని నిర్మించి హక్కులు భంగం వాటిల్లకుండా చూసుకునే బాధ్యత బీఆర్ఎస్ కార్యకర్తలది, తెలంగాణ ఉద్యమ కారులదేనని కేసీఆర్ స్పష్టం చేశారు.

కేఆర్‌ఎంబీ పరిధిలోకి ప్రాజెక్టులు వెళ్తే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు కేసీఆర్.  కాంగ్రెస్ ప్రభుత్వాకి తెలివి లేదని, సీఎం రేవంత్ రెడ్డికి  ప్రాజెక్టులపై అవగాహన లేదని విమర్శించారు.  ప్రాజెక్టులు కేఆర్‌ఎంబీకి అప్పగిస్తే జరిగే నష్టం కూడా కాంగ్రెస్ నాయకులకు తెలియదన్నారు కేసీఆర్.  బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా ప్రాజెక్టుల అప్పగింతకు ఒప్పుకోలేదన్న కేసీఆర్ ..  ఇప్పుడు అవగాహన లేక ప్రాజెక్టులను అప్పగించడానికి ఒప్పుకున్నారని చెప్పారు.