ఎన్నికల ప్రచారానికి బడా నేతలు .. హోరెత్తనున్న ప్రధాన పార్టీల ప్రచారాలు

ఎన్నికల ప్రచారానికి బడా నేతలు .. హోరెత్తనున్న ప్రధాన పార్టీల ప్రచారాలు
  • ఇప్పటికే జిల్లాలోని మూడు చోట్ల కేసీఆర్ ​సభలు
  • కామారెడ్డిలో కాంగ్రెస్​ పార్టీ బీసీ డిక్లరేషన్​
  • బీజేపీ క్యాండిడేట్ల నామినేషన్లకు వచ్చిన కేంద్రమంత్రులు

కామారెడ్డి, వెలుగు:  అసెంబ్లీ ఎన్నికల ప్రచారం రోజురోజుకు హోరెత్తుతుంది. కామారెడ్డి జిల్లాలోని నాలుగు సెగ్మెంట్లలో తమ అభ్యర్థులను గెలిపించుకోడానికి ఆయా పార్టీల బడా నేతలు ప్రచారానికి రానున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్​ అధినేత తాను పోటీ చేస్తున్న కామారెడ్డితో పాటు మరో రెండు చోట్ల జరిగిన బహిరంగసభల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్​ పార్టీ తరఫున రేవంత్​రెడ్డి కామారెడ్డిలో నామినేషన్​ వేశారు. అనంతరం ఇక్కడే బీసీ డిక్లరేషన్ సభ నిర్వహించారు. కర్నాటక సీఎం సిద్ధరామయ్యతో పాటు ఇతర ముఖ్య నేతలు వచ్చారు. బీజేపీ తరఫున కామారెడ్డిలో నిర్వహించిన కార్యకర్తల మీటింగ్​కు ఆ పార్టీ స్టేట్​చీఫ్, కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి హాజరయ్యారు. పార్టీ అభ్యర్థుల నామినేషన్లకు కేంద్ర మంత్రులు వచ్చారు. త్వరలోనే అభ్యర్థుల తరఫున ప్రధాన పార్టీల అగ్ర నేతలు ప్రచారానికి రానున్నారు. 

బీఆర్ఎస్​.. రోడ్​షోలు..

బీఆర్ఎస్​ జిల్లాలోని కామారెడ్డి, జుక్కల్, బాన్సువాడలో ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహించింది. ఈ సభల్లో సీఎం కేసీఆర్ ​పాల్గొన్నారు.ఈ నెల15న ఎల్లారెడ్డి లోనూ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు కేసీఆర్​హాజరై బీఆర్ఎస్ అభ్యర్థి జాజాల సురేందర్​కు మద్దతుగా నిలవాలని కోరనున్నారు.​ కామారెడ్డిలో కేసీఆర్​పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆయన తనయుడు కేటీఆర్​నియోజకవర్గంలోని కామారెడ్డి, మాచారెడ్డి,  భిక్కనూరు, దోమకొండల్లో ఏర్పాటు చేసిన సభల్లో పాల్గొన్నారు. త్వరలోనే ఆయన మళ్లీ జిల్లాలో ప్రచారానికి రానున్నారు. జిల్లా కేంద్రం కామారెడ్డిలో రోడ్​షో నిర్వహించనున్నారు. ఈ ప్రోగ్రామ్​కు మంత్రి హరీశ్​రావు కూడా వస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జుక్కల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లోనూ కేటీఆర్, హరీశ్​రావు రోడ్​షోలు ఉంటాయని ఆ పార్టీ నేతలు వెల్లడించాయి.  

బీజేపీ.. కామారెడ్డిలో భారీ బహిరంగ సభ

బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు ఆ పార్టీ అగ్రనేతలు జిల్లాకు రానున్నారు. ఇటీవల కామారెడ్డిలో నిర్వహించిన మీటింగ్​కు కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి వచ్చారు. బీజేపీ క్యాండిడేట్ల నామినేషన్ల దాఖలుకు కేంద్రమంత్రులు పరుషోత్తం రూపాలా, అర్జున్​ముండా వచ్చారు. జుక్కల్ ​అభ్యర్థి  అరుణతార నామినేషన్​ సందర్భంగా ఆ పార్టీ జాతీయ వైస్​ప్రెసిడెంట్ డీకే అరుణ హాజరయ్యారు. త్వరలోనే బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఎంపీ బండి సంజయ్ ​ప్రచారానికి రానున్నారు. కామారెడ్డిపై ఆ పార్టీ ప్రత్యేకంగా ఫోకస్​ చేసిన నేపథ్యంలో ఇక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసే అవకాశముంది.

ALSO READ : వరంగల్‍: 76 నామినేషన్లు రిజక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 

కాంగ్రెస్ తరఫున ఢిల్లీపెద్దలు..​

కాంగ్రెస్​పార్టీ తరఫున ప్రచారం చేయడానికి ఆ పార్టీ అగ్రనేతలు జిల్లాకు రానున్నారు. ఇప్పటికే కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ​సభ నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి కర్నాటక సీఎం సిద్ధరామయ్య, స్టేట్​ ముఖ్య నేతలు, సీపీఐ నేతలు నారాయణ, చాడ వెంకట్​రెడ్డి, తెలంగాణ జన సమితి చీఫ్​ ప్రొఫెసర్ ​కోదండరాం హాజరయ్యారు. మంగళవారం ఉమ్మడి మాచారెడ్డి మండలంలోని నాలుగు గ్రామాల్లో నిర్వహించే ప్రచారంలో రేవంత్​రెడ్డి, షబ్బీర్​అలీ పాల్గొంటారు. బుధవారం పొద్దున పార్టీ కార్యకర్తల మీటింగ్​ కు రేవంత్​రెడ్డి హాజరవుతారు.ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడ, కామారెడ్డి  నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించడానికి రాహుల్​గాంధీ, ప్రియాంకాగాంధీ, మల్లికార్జున్​ ఖర్గే, ఇతర ముఖ్య నేతలు వస్తారని కాంగ్రెస్​వర్గాలు తెలిపాయి. ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో ముఖ్య నేతతో సభ ఏర్పాటు చేయనున్నారు.