
- బీఆర్ఎస్ నుంచి సాయన్న కూతురు లాస్యనందిత
- కాంగ్రెస్ నుంచి గద్దర్ కుమార్తె వెన్నెల
- రెండు పార్టీల అభ్యర్థులు జనాల్లోకి వెళ్లి ప్రచారం
కంటోన్మెంట్, వెలుగు: సికింద్రాబాద్ పరిధి కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ తరఫున ఇద్దరు ఆడబిడ్డలు సెంటిమెంట్‌ను ప్రచారస్త్రంగా చేసుకుని ముందుకెళ్తున్నారు. కాంగ్రెస్ నుంచి ప్రజా గాయకుడు గద్దర్ కూతురు వెన్నెల, బీఆర్ఎస్ నుంచి దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్య నందిత పోటీ చేస్తున్నారు. బీజేపీ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. రెండు పార్టీల అభ్యర్థులు తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. 25ఏళ్లుగా నియోజకవర్గ ప్రజలతో మమేకమైన ఎమ్మెల్యే సాయన్న ఆకస్మిక మృతితో ఆయన సెంటిమెంట్ కూతురికి కలిసి వస్తుందనే ధీమాతో బీఆర్ఎస్ టికెట్ కేటాయించింది. తన పాటలతో చైతన్య పరిచి జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ప్రజా గాయకుడు గద్దర్ కూతురు వెన్నెలకు కాంగ్రెస్ టికెట్‌ఇచ్చింది.
ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే ప్రచారం ..
5 సార్లు కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సాయన్న ప్రజలకు సుపరిచితుడే కాదు, అవినీతిరహితుడు అనే పేరుపొందారు. అయితే, కంటోన్మెంట్ బోర్డు కేంద్ర పరిధిలో ఉన్నందున ఆయన చేపట్టిన అభివృద్ధి పెద్దగా కనిపించపోయినా ప్రజల్లో పేరున్న వ్యక్తి. ఈ సెంటిమెంట్‌తోనే సాయన్న కూతురు లాస్య నందిత ఓటర్ల వద్దకు వెళ్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు నుంచే బీఆర్ఎస్ అభ్యర్థి తన ప్రచారాన్ని చేపట్టగా.. కేవలం సాయన్న అనుచరులు మాత్రమే ఆమెతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. టికెట్ఆశించి భంగపడిన ఇతర గ్రూపుల నేతలు దూరంగానే ఉన్నారు. అసమ్మతి నేతలను బీఆర్ఎస్ అధిష్టానం బుజ్జగించడంతో ఆమెతో కలిసి పనిచేసేందుకు ముందుకొస్తున్నారు.
ఓటింగ్ సమయానికి పరిస్థితులు ఎలా మారుతాయో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక ప్రజాగాయకుడు గద్దర్ విప్లవ కారుడే కాదు, తన పాటలతో మాస్ ఫాలోయింగ్ తెచ్చుకున్న వ్యక్తి. తెలంగాణ ఉద్యమంలో ఎంతోమందిని చైతన్య పరిచారు. ఈసారి ఎన్నికల్లో తననే పార్టీ పోటీకి దించాలని సిద్ధమవగా.. గత ఆగస్టులో ఆయన మృతిచెందాడు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన కూతురుకు కాంగ్రెస్ టికెట్ కేటాయించింది. తన తండ్రి సాయన్న ఈ నియోజకవర్గానికి సుపరిచితుడు అయినందున ఆయన సెంటిమెంట్‌తో తనను గెలిపించాలని బీఆర్ఎస్ అభ్యర్థి లాస్య నందిత ప్రజలను కోరుతున్నారు.
తెలంగాణ ఉద్యమంలో వేలాది మందిని చైతన్య పరిచిన తన తండ్రి గద్దర్‌పై ప్రజల్లో ఉన్న అభిమానం, సానుభూతి వర్కవుట్అవుతుందనే భావనతో వెన్నెల ప్రచారం చేస్తున్నారు. రాష్ర్టం వచ్చాక బీఆర్ఎస్ తన తండ్రిని పూర్తిగా విస్మరించిందని కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆయన త్యాగాలను గుర్తించి వారసురాలిగా తనకు టికెట్ కేటాయించిదని వెన్నెల చెప్పుకుంటున్నారు. ఇలా ఇద్దరు మహిళా అభ్యర్థులు అసెంబ్లీ ఎన్నికలకు కొత్త వారు. ఫాదర్ సెంటిమెంట్‌తో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఓటర్లు ఎవరిని గెలిపిస్తారో ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.