హిందువుల ఓట్లు చీల్చేందుకు బీఆర్ఎస్​ కుట్ర : మాధవీలత

హిందువుల ఓట్లు చీల్చేందుకు బీఆర్ఎస్​ కుట్ర : మాధవీలత

బషీర్ బాగ్, వెలుగు: లోక్​సభ ఎన్నికల్లో గెలిచి పాతబస్తీలో బీజేపీ జెండా ఎగరవేస్తామని ఆ పార్టీ హైదరాబాద్​ఎంపీ అభ్యర్థి మాధవీలత చెప్పారు. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ 40 ఏండ్ల చరిత్రను తిరగరాస్తామన్నారు. హిందువులంతా ఏకమై ఎంఐఎంకు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. బుధవారం రాత్రి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాధవీలత మాట్లాడుతూ... తనను ఎంపీగా గెలిపిస్తే ముస్లిం మహిళలకు అనేక పథకాలను అందిస్తానని చెప్పారు.  పాతబస్తీని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ మాదిరిగా డెవలప్​చేస్తానన్నారు. ఓట్ల కోసం ఎవరితోనైనా కలుస్తామంటున్న కాంగ్రెస్​పార్టీ రాష్ట్ర ప్రజలకు ఏం మెసేజ్​ఇస్తున్నట్లు అని ప్రశ్నించారు. 

గడిచిన 40 ఏండ్లలో హైదరాబాద్​నియోజకవర్గ పరిధిలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. అన్యాయాలు, అక్రమాలు, హత్యలు మాత్రం ఎప్పటికప్పుడు పెరిగిపోతున్నాయన్నారు. ఈసారి ఓల్డ్​సిటీలోని పోలింగ్ బూత్ లలో సీఆర్​పీఎఫ్ జవాన్లతోపాటు మహిళా జవాన్లను ఏర్పాటు చేయాలని, ఆధార్ కార్డు చూసిన తర్వాతనే పోలింగ్​బూత్​లోకి అనుమతించాలని కోరారు. 

హిందువుల ఓట్లు చీల్చేందుకు బీఆర్ఎస్ యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి సీటు ఇచ్చిందని, ఎవరెన్ని కుట్రలు చేసినా తన గెలుపును ఆపలేరని మాధవీలత ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ ఎం.రామచంద్రరావు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, అట్లూరి రామకృష్ణ, గోల్కొండ జిల్లా ఆధ్యకుడు వి.పాండు యాదవ్, భాగ్యనగర్ జిల్లా అధ్యక్షుడు సంరెడ్డి సురేందర్ రెడ్డి, ఎ.ఇంద్రసేనారెడ్డి, కార్పొరేటర్లు, డివిజన్ల నాయకులు,  కార్యకర్తలు పాల్గొన్నారు.