యాదగిరిగుట్ట, వెలుగు: కార్తీకమాసం నేపథ్యంలో యాదగిరిగుట్ట ఆలయానికి ఎంతమంది భక్తులు తరలివచ్చినా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆలయ అధికారులకు ఆలయ ఈవో వెంకటరావు ఆదేశించారు. ఏర్పాట్ల లేమితో భక్తులు అవస్థలు పడినట్లు తన దృష్టికి వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శనివారం తెల్లవారుజామున 4:30 గంటలకు ఆలయ ఈవో వెంకటరావు ఆలయ పరిసరాలను ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. శానిటేషన్ పనులను స్వయంగా పరిశీలించారు. భక్తులు సెల్ ఫోన్లు భద్రపరిచే కౌంటర్లను చెక్ చేశారు. స్వామివారి నిజాభిషేకంలో పాల్గొన్న భక్తులతో స్వయంగా మాట్లాడి ఏమైనా సమస్యలు ఎదురయ్యాయా అని అడిగి తెలుసుకున్నారు.
వ్రత మండపాలను పరిశీలించి భక్తులకు ఇచ్చే పూజాసామాగ్రిలో నూనె, నెయ్యి, పంచామృతం నాణ్యతను చెక్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరుస సెలవుల కారణంగా భక్తులు అధిక సంఖ్యలో రానున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఆటంకాలు, ఇక్కట్లు కలుగకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. రాత్రి వేళల్లో ఆలయ పరిసరాల్లో అదనంగా లైటింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గుండంలోని నీటిని ఎప్పటికప్పుడు ఫిల్టర్ చేయాలని సూచించారు. కల్యాణకట్టలో నాయి బ్రాహ్మణులు భక్తుల నుండి డబ్బులు వసూలు చేస్తే విధుల నుంచి తొలగిస్తామని స్పష్టం చేశారు. ఆలయ ఏఈవోలు జూషెట్టి కృష్ణ గౌడ్, గజవెల్లి రఘు, నవీన్, సూపరింటెండెంట్ సురేందర్ రెడ్డి, ఆలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.
