సంగారెడ్డి జిల్లాలో చైర్మన్, వైస్ చైర్మన్లను దించుతున్న బీఆర్ఎస్ కౌన్సిలర్లు

సంగారెడ్డి జిల్లాలో చైర్మన్, వైస్ చైర్మన్లను దించుతున్న బీఆర్ఎస్ కౌన్సిలర్లు
  •     అవకాశం తీసుకుంటున్న కాంగ్రెస్ లీడర్లు
  •     9న సదాశివపేటలో బల నిరూపణకు ముహూర్తం

సంగారెడ్డి, వెలుగు: జిల్లాలో మున్సిపాలిటీల రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ స్వయం తప్పిదాలను కాంగ్రెస్ వాడుకుంటూ బలం పెంచుకుంటోంది. బీఆర్ఎస్ కౌన్సిలర్లే తిరుగుబాటు బావుటా ఎగరవేస్తూ చైర్మన్, వైస్ చైర్మన్లను దింపేందుకు కాంగ్రెస్ కౌన్సిలర్లతో చేతులు కలుపుతున్నారు. ఈ క్రమంలోనే మొన్న నారాయణఖేడ్ బల్దియాలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరారు. వారు పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గి చైర్ పర్సన్, వైస్ చైర్మన్​ గద్దె దిగారు. ఇదే పద్ధతిలో సంగారెడ్డి, సదాశివపేట, ఆందోల్-జోగిపేట మున్సిపాలిటీల్లో కూడా వ్యూహరచన చేస్తున్నారు. 

9న బల నిరూపణ

సదాశివపేట మున్సిపాలిటీలో అవిశ్వాసంపై అధికారులు ఈ నెల 9న సమావేశం ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కు చెందిన 22 మంది కౌన్సిలర్లు గత నెల 18న అవిశ్వాసం ప్రకటిస్తూ కలెక్టర్ వల్లూరు క్రాంతికి నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. అవిశ్వాసాన్ని అడ్డుకోవాలని కోరుతూ పేట చైర్ పర్సన్ పిల్లోడి జయమ్మ ఇటీవల హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం దాన్ని డిస్మిస్ చేసింది.

ఇక్కడ బీఆర్ఎస్ కు చెందిన పలువురు కౌన్సిలర్లు సొంత పార్టీ చైర్ పర్సన్ జయమ్మను పదవి నుంచి దింపేందుకు ప్రయత్నిస్తుండగా, వైస్ చైర్మన్ చింత గోపాల్ ను మినహాయించారు. సదాశివపేట బల్దియాలో మొత్తం 26 మంది కౌన్సిలర్లు ఉండగా పార్టీలకతీతంగా 22 మంది ఒక్కటై చైర్ పర్సన్ ను గద్దె దించేందుకు నోటీసులు ఇచ్చారు. ఇక్కడ అవిశ్వాసానికి 18 మంది కౌన్సిలర్ల మద్దతు తెలిపితే చైర్ పర్సన్ తన పదవిని కోల్పోతారు. ఇదే జరిగితే బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కు ఎదురుదెబ్బ తప్పదు. 

సంగారెడ్డిలో..

సంగారెడ్డి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కు చెందిన చైర్ పర్సన్ బొంగుల విజయలక్ష్మి, వైస్ చైర్ పర్సన్ లత విజయేందర్ రెడ్డిపై అవిశ్వాసం పెట్టడానికి సొంత పార్టీ కౌన్సిలర్లు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో 3 రోజుల క్రితం బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎంకు చెందిన 26 మంది కౌన్సిలర్లు సంగారెడ్డిలోని ఓ హోటల్లో రహస్యంగా సమావేశమయ్యారు.

అవిశ్వాస తీర్మానం నోటీసులను కలెక్టర్ కు అందజేసేందుకు  కౌన్సిలర్ల సంతకాలు సేకరించినట్టు తెలిసింది. సంగారెడ్డి మున్సిపాలిటీలో మొత్తం 38 స్థానాలు ఉండగా అందులో రెండేళ్ల క్రితం చింతలపల్లి కౌన్సిలర్ మృతి చెందడంతో ప్రస్తుతం 37 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వీరిలో అవిశ్వాస తీర్మానానికి 26 మంది సంతకాలు సరిపోతాయి. ఇందులో బీఆర్ఎస్ నుంచి 13 మంది, కాంగ్రెస్ 9 మంది, బీజేపీ, ఎంఐఎం నుంచి ఇద్దరు చొప్పున కౌన్సిలర్లు అవిశ్వాసానికి మద్దతు ఇస్తున్నట్లు సమాచారం.

ఈ ఎపిసోడ్ అంతా మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వెనక ఉండి నడిపిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అవిశ్వాసం నెగ్గితే చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ గా ఎవరిని ఎన్నుకోవాలన్న చర్చ షురూ అయింది. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సతీమణి అయిన 22వ వార్డు కౌన్సిలర్ నిర్మలరెడ్డి తోపాటు 23వ వార్డు కౌన్సిలర్ కూన వనిత, 7వ వార్డు కౌన్సిలర్ బోయిన విజయలక్ష్మి పేర్లు చైర్ పర్సన్ రేసులో ప్రధానంగా వినిపిస్తున్నాయి. కానీ నిర్మలరెడ్డికే ఎక్కువగా అవకాశాలు ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. వైస్ చైర్ పర్సన్ పేరును తానే నిర్ణయిస్తానని జగ్గారెడ్డి తన సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్టు తెలిసింది.

ఆందోల్-జోగిపేటలో..

అందోల్-జోగిపేట మున్సిపాలిటీలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కౌన్సిలర్ల మధ్య దోబూచులాట సాగుతోంది. ఇక్కడ మొత్తం 20 మంది కౌన్సిలర్లు ఉండగా, బీఆర్ఎస్ 14 మంది, కాంగ్రెస్ 6 మంది గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ కౌన్సిలర్లు ముగ్గురు కాంగ్రెస్ లో చేరడంతో వారి సంఖ్య 9కి పెరిగింది. అవిశ్వాసం నెగ్గడానికి 11 మంది కౌన్సిలర్ల మద్దతు అవసరం ఉంది.  కాగా గతంలో బీఆర్ఎస్ చైర్మన్ మల్లయ్యపై సొంత పార్టీ కౌన్సిలర్లు ఎదురు తిరిగి కలెక్టర్ కు అవిశ్వాస నోటీసు ఇచ్చారు.

అప్పటినుంచి కాంగ్రెస్, బీఆర్ఎస్ కౌన్సిలర్ల మధ్య దోస్తీ పెరిగి అవిశ్వాసం నెగ్గడానికి ప్రయత్నిస్తుండగా చైర్మన్ మల్లయ్య ఒక్కసారిగా మంత్రి దామోదర్ వైపు మళ్లీ ఆయనకు దగ్గరయ్యారని బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. ఒక దశలో ఆయన పార్టీ మారుతారన్న ప్రచారం కూడా జరిగింది. ఈ క్రమంలోనే కొందరు కాంగ్రెస్ కౌన్సిలర్లు స్తబ్దంగా ఉండడంతో బీఆర్ఎస్ కౌన్సిలర్లు ముందుకు రాకపోవడంతో అవిశ్వాస ఎపిసోడ్ చల్లబడినట్లు కనిపిస్తోంది.

కానీ ఇక్కడ పరిస్థితులు మారే అవకాశాలు ఉండడంతో సానుకూల పరిస్థితుల కోసం బీఆర్ఎస్ కౌన్సిలర్లు వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే అమీన్పూర్ మున్సిపాలిటీలో చైర్మన్ పాండురంగారెడ్డిని దించేందుకు బీఆర్ఎస్ కు చెందిన ముగ్గురు కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరే ప్రయత్నం జరుగుతుండగా స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి దాన్ని అడ్డుకున్నట్టు తెలిసింది. ప్రస్తుతానికి అమీన్పూర్ మున్సిపాలిటీలో అవిశ్వాసంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ కౌన్సిలర్ల మధ్య చర్చలు జరుగుతున్నాయి.