నర్సాపూర్​ మున్సిపాలిటీలో .. నో కాన్ఫిడెన్స్​ హీట్​

నర్సాపూర్​ మున్సిపాలిటీలో .. నో కాన్ఫిడెన్స్​ హీట్​
  • మున్సిపల్​ చైర్మన్​పై బీఆర్ఎస్​ కౌన్సిలర్ల అవిశ్వాసం
  • అడిషనల్​ కలెక్టర్ కునోటీస్​ అందజేత 

మెదక్, నర్సాపూర్, వెలుగు:  అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన పదిహేను రోజులకే నర్సాపూర్​లో పొలిటికల్ హీట్​మొదలైంది. బీజేపీకి చెందిన నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్ ను గద్దె దించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆయనపై అవిశ్వాసం ప్రకటిస్తూ వైస్ చైర్మన్ సహా 9 మంది కౌన్సిలర్లు శుక్రవారం మెదక్ అడిషనల్ కలెక్టర్ కు నోటీసు అందజేశారు. గత ఫిబ్రవరిలోనే మురళీ యాదవ్​ను గద్దె దించేందుకు  బీఆర్ఎస్ కౌన్సిలర్లు అవిశ్వాసం నోటీసు ఇచ్చారు.

అయితే అప్పట్లో కలెక్టర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తాజాగా మళ్లీ ఇప్పుడు అవిశ్వాసం నోటీస్ ఇవ్వడం జిల్లాలో చర్చనీయాంశమైంది. గతంలో గ్రామ పంచాయతీగా ఉన్న నర్సాపూర్,  మున్సిపాలిటీగా అప్​గ్రేడ్​ కాగా 2020 జనవరిలో ఫస్ట్​ టైం మున్సిపల్ ఎలక్షన్​లు జరిగాయి. మొత్తం15 వార్డులు ఉండగా 8 వార్డుల్లో బీఆర్ఎస్ క్యాండిడేట్లు, నాలుగు వార్డుల్లో బీజేపీ క్యాండిడేట్లు, మూడు వార్డుల్లో ఇండిపెండెంట్లు కౌన్సిలర్లుగా గెలిచారు. బీఆర్ఎస్ కు ఫుల్​ మెజార్టీ రావడంతో ఆ పార్టీకి చెందిన 13వ వార్డు కౌన్సిలర్ మురళీ యాదవ్ మున్సిపల్ చైర్మన్​గా, 6వ వార్డు కౌన్సిలర్ నయీమొద్దీన్ వైస్ చైర్మన్​ గా ఎన్నికయ్యారు. 

బీఆర్​ఎస్​ నుంచి సస్పెండై..

మున్సిపల్​ చైర్మన్​ పదవి ఇచ్చినప్పటికీ బీఆర్ఎస్ హై కమాండ్​పై అసంతృప్తితో ఉన్న మురళీ యాదవ్​ గతేడాది ఆగస్టులో బీఆర్ఎస్​ పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతుందంటూ పార్టీ హైకమాండ్, సీఎం కేసీఆర్​పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దీంతో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ ఆయనను బీఆర్ఎస్​ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో మురళీ యాదవ్​ గతేడాది అక్టోబర్ లో బీజేపీలో చేరారు. ఆయన వెంట ఇద్దరు బీఆర్ఎస్ కౌన్సిలర్లు కూడా కమలం పార్టీలోకి 
వెళ్లారు. 

పదవి నుంచి దించాలని..

బీజేపీలో చేరినప్పటి నుంచి మురళీ యాదవ్​ బీఆర్ఎస్​ప్రభుత్వంపై, స్థానిక ఎమ్మెల్యేపై విమర్శలు చేయడం మొదలు పెట్టారు. కారు గుర్తు మీద కౌన్సిలర్ గా గెలిచి చైర్మన్ పదవి పొంది బీఆర్ఎస్​ పార్టీని, ప్రభుత్వాన్ని విమర్శించడాన్ని ఆ పార్టీ  కౌన్సిలర్లు, నాయకులు జీర్ణించుకోలేదు. బీఆర్ఎస్​ గుర్తుమీద గెలిచిన చైర్మన్​ సహా ముగ్గురు కౌన్సిలర్లు బీజేపీలోకి వెళ్లగా, ఇండిపెండెంట్లుగా గెలిచిన మరో ముగ్గురు కౌన్సిలర్లు బీఆర్ఎస్​లో చేరడంతో మున్సిపల్​ కౌన్సిల్​లో ఆ పార్టీ బలం 8కి చేరింది.

మొత్తం 15 మంది కౌన్సిలర్లలో బీఆర్ఎస్​కు మెజారిటీగా 8 మంది ఉండడంతోపాటు, అవసరమైతే ఎక్స్​అఫీషియో సభ్యులైన స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ఓటుతో చైర్మన్​ పదవి దక్కించుకోవచ్చని భావించారు. గత ఫిబ్రవరిలో మున్సిపల్​ చైర్మన్​ మురళీ యాదవ్​పై అవిశ్వాసం ప్రకటిస్తూ వైస్​ చైర్మన్​ నయిమొద్దీన్​ సహా 8 మంది కౌన్సిలర్లు కలిసి కలెక్టర్​కు నోటీస్​ అందజేశారు. అయితే అప్పట్లో దీనిపై కలెక్టర్​ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 

మరోసారి అవిశ్వాసం..

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మున్సిపల్​ చైర్మన్​ మురళీ యాదవ్​ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. నర్సాపూర్​ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్​అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి గెలుపొందారు. 2020లో ఎన్నికైన మున్సిపల్​ పాలకవర్గ పదవీ కాలం ఇంకో 13 నెలలు ఉంది. ఈ క్రమంలో బీఆర్ఎస్​ కౌన్సిలర్లు మురళీ యాదవ్​ను గద్దె దించేందుకు మరోమారు ప్రయత్నాలు మొదలు పెట్టారు. నర్సాపూర్​6వ వార్డు కౌన్సిలర్, వైస్ చైర్మన్ నయీమొద్దీన్ తో పాటు మరో 8 మంది కౌన్సిలర్లు కలిసి శుక్రవారం అడిషనల్​ కలెక్టర్​ వెంకటేశ్వర్లుకు అవిశ్వాసం నోటీస్​ అందజేశారు.

నయీమొద్దీన్​తోపాటు1వ వార్డు కౌన్సిలర్​ అశోక్​ గౌడ్​, 3వ వార్డు కౌన్సిలర్​ ఇస్రత్​ సిద్దీఖి,  7వ వార్డు కౌన్సిలర్​ గొల్ల రుక్కమ్మ, 8వ వార్డు కౌన్సిలర్​ పంబాల రాంచందర్​, 9వ వార్డు కౌన్సిలర్​ వంటెద్దు సునీత, 12వ వార్డు కౌన్సిలర్​ చెల్మెటి లక్ష్మి,14వ వార్డు కౌన్సిలర్​ తంగేడుపల్లి  సరిత, 15వ వార్డు కౌన్సిలర్​ పంబాల లలిత అవిశ్వాస నోటీస్​పై సంతకాలు చేశారు. మొత్తం 15 మంది కౌన్సిలర్లలో 9 మంది బీఆర్ఎస్​ వారుండగా, 6 గురు బీజేపీ వారున్నారు. తమకు మెజారిటీ ఉన్నందున అవిశ్వాసం మీటింగ్​పెడితే తాము నెగ్గుతామన్న ధీమాలో బీఆర్ఎస్​ కౌన్సిలర్లు ఉన్నారు. అయితే అవిశ్వాసం నోటీస్​ విషయంలో కలెక్టర్​ ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.