బీసీలకు క్షమాపణ చెప్పాకే సీఎం రేవంత్ జిల్లాకు రావాలి : తాతా మధు

బీసీలకు క్షమాపణ చెప్పాకే సీఎం రేవంత్ జిల్లాకు రావాలి : తాతా మధు
  • ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు తాతా మధు 

ఖమ్మం, వెలుగు : బీసీలకు క్షమాపణ చెప్పాకే సీఎం రేవంత్ జిల్లాకు రావాలని ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు.  బీసీలకు న్యాయం చేసినట్లు గొప్పలు చెబుతున్న కాంగ్రెస్ పార్టీ, గతంలోని బీఆర్ఎస్ పార్టీ కన్నా ఖమ్మం జిల్లాలో బీసీలకు రిజర్వేషన్ పేరుతో మేలు చేసినట్లు నిరూపిస్తే తాను రాజీనామా చేసేందుకు  సిద్ధమని సవాల్​ విసిరారు. సోమవారం ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీలను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి పంచాయతీ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఎన్నికల నిబంధనలకు విరుద్ధమన్నారు. 

జోగులాంబ గద్వాల, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల స్థానిక సంస్థల ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఈ పర్యటన జరుగుతోందని, ఈ విషయంలో ఎన్నికల సంఘం వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ చీరలు ఇచ్చామంటూ మహిళలు చీరలు కట్టుకొని కాంగ్రెస్‌కు ఓటేయాలని ముఖ్యమంత్రి బహిరంగంగా చెప్పడం సిగ్గుచేటన్నారు. ఖమ్మం జిల్లా అభివృద్ధి పూర్తిగా ఆగిపోయిందని, రెండేండ్లుగా జిల్లాకు ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమిటో తెలుపుతూ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం నగర పార్టీ అధ్యక్షుడు పగడాల నాగరాజు, మాజీ డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, బిచ్చల తిరుమలరావు, జిల్లా మైనార్టీ అధ్యక్షుడు తాజుద్దీన్, నాయకులు గుండ్లపల్లి శేషు, పగడాల నరేందర్ తదితరులు పాల్గొన్నారు.