హైదరాబాద్,వెలుగు: ఈనెల 27న తెలంగాణ భవన్లో నిర్వహించే బీఆర్ఎస్ జనరల్ బాడీ మీటింగ్కు రావాలని నేతలకు పార్టీ కేంద్ర కార్యాలయం ఇన్విటేషన్లు పంపింది. పార్టీ రాష్ట్ర కార్యవర్గం, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, పార్టీ జిల్లాల అధ్యక్షులు హాజరుకావాలని సూచించింది.
సుమారు 350 మంది ప్రతినిధులు మాత్రమే ఈ మీటింగ్లో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. 27న ఉదయం నుంచి సాయంత్రం దాకా పార్టీ చీఫ్, సీఎం కేసీఆర్ అధ్యక్షతన జాతీయ, రాష్ట్ర స్థాయి అంశాలపై చర్చించి తీర్మానాలు చేయనున్నారు.
ఈ ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేయడం, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గంలో ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి బీఆర్ఎస్లో కొనసాగించేలా తీర్మానం చేయడం సహా పలు తీర్మానాలను ఆమోదించనున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్లో జాతీయ స్థాయి పదవులున్న నేతలను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించనున్నట్టు పార్టీ నాయకులు తెలిపారు.
