బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. కాంగ్రెస్ లో చేరిన భద్రాచలం ఎమ్మెల్యే

బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. కాంగ్రెస్ లో చేరిన భద్రాచలం ఎమ్మెల్యే

ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి సమక్షంలో హస్తం పార్టీలో చేరారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఇవాళ కాంగ్రెస్ లో చేరడంతో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యే సెగ్మెంట్లలో కారు పార్టీ ఖాళీ అయ్యింది. 

కాగా, గత కొన్ని రోజుల క్రితమే మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావు ఆధ్వర్యంలో జరిగిన మహబూబాబాద్​ పార్లమెంట్​ నియోజకవర్గ కాంగ్రెస్​ ముఖ్య నేతల సమావేశంలో ఎమ్మెల్యే తెల్లం కూడా ప్రత్యక్షమయ్యారు. బీఆర్ఎస్​ఎమ్మెల్యేగా ఉండి, కాంగ్రెస్ మీటింగ్​లో పాల్గొనడం, గెలుపు వ్యూహాలపై చర్చించడం గమనార్హం. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన వెంటనే తెల్లం వెంకట్రావ్​మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డిని, ఆ తర్వాత  సీఎం రేవంత్​రెడ్డిని కలిశారు.

 ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో కాంగ్రెస్​ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభా వేదికపైన కూడా ఆయన కూర్చున్నారు. కొన్నిరోజులుగా బీఆర్ఎస్​పార్టీ కార్యక్రమాలకు, పార్లమెంట్​స్థాయి రివ్యూ మీటింగులకు దూరంగా ఉంటున్నారు. దీంతో తెల్లం వెంకట్రావ్​ పార్టీ మారడం ఖాయమనే ప్రచారం సాగుతున్నది. ఇవాళ అదే నిజమైంది.