విద్యను విధ్వంసం చేయొద్దు

విద్యను విధ్వంసం చేయొద్దు

అందరూ భావిస్తున్నట్టుగా గత ప్రభుత్వానిది తుగ్లక్ పాలనే అయితే ఆ తుగ్లక్ పోయాక తుగ్లక్ విధానాలు కూడా పోవాలి. పదేండ్లకాలంలో తెలంగాణ బడులను, తెలంగాణ  విద్యారంగాన్ని అభివృద్ధి పేరిట  విధ్వంసం చేసింది గత ప్రభుత్వం. తరగతి గదిలో విద్యార్థి, ఉపాధ్యాయులను యాంత్రిక పాత్రలుగా చేసి తోలుబొమ్మలాట ఆడించి విద్యార్థులను సృజనకు దూరం చేసింది, రికార్డులు రిపోర్టులు సిద్ధంచేయించి, చదువు చెప్పే పంతుళ్లను గుమాస్తాలుగా మార్చింది. పాఠశాలల్లో ఖాళీగా ఉన్న వేల సంఖ్యలో టీచర్ల పోస్టులు భర్తీ చేయకుండా, బడ్జెట్​లో విద్యకు ఎంగిలి మెతుకుల్లా నిధులు జల్లి బడులను కునారిల్లచేసింది. ఈ విధ్వంసాన్ని విద్యావంతులు ప్రశ్నించకుండా  కనీస ప్రశ్నించే హక్కులను కాలరాచింది. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు టీచర్లను పని ఒత్తిడికి గురిచేసే కుటిల ఎత్తుగడలకు తెరతీసింది. ఇందులో భాగంగానే జీఓ.నెం. 317 అమలు, స్పౌస్ ఉద్యోగ ఉపాధ్యాయుల బదిలీల నిరాకరణ, ప్రమోషన్లకు టెట్ అర్హత ప్రకటన, ఈ వరుసలోనే పాఠశాలల పూర్తి స్థాయి విధ్వంసానికి ఉపాధ్యాయులపై పని ఒత్తిడి పెంచే శిక్షణ కార్యక్రమాలను అమలుచేసింది. 

గుమాస్తాలుగా మారుస్తున్నారు

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులలో కనీస సామర్థ్యాల పెంపునకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించి అమలు చేబూనటం ఆహ్వానించతగినదే.  కానీ, వాటి అమలుకోసం ప్రభుత్వం రూపొందించి అమలు చేస్తున్న కార్యాచరణ బడిని వాస్తవ బోధనాభ్యసనలకు క్రమంగా దూరం చేస్తున్నది. ఉన్నతి, తొలిమెట్టు, ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ తదితర కార్యక్రమాలలో వాస్తవికత, శాస్త్రీయతల లోపం ఉపాధ్యాయులను  గుమాస్తాలుగా మార్చుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థుల విద్యాభివృద్ది, విద్యా సంక్షేమం కోసం రూపొందించి, అమలుచేసే కార్యక్రమాల లక్ష్యాలు ఉన్నతమైనవే. అవి బడులను, క్యాలెండర్ సమయాన్ని గందరగోళపరిచేది కాకూడదనేది ఇప్పుడు ప్రధాన చర్చగా ముందుకొచ్చింది.

బోధనకు దూరం చేయడమే

ఈ నెల 8 వ తేదీన విడుదలైన తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కార్యాలయం ప్రొ. నెం.453/టి.ఎస్.ఎస్./పి.డి.జి./టి6/2023లో వార్షిక సంవత్సరం బబూల్ విడుదల చేశారు. ఈ నెల 12 నుంచి11 వ తేదీ జనవరి వరకు రాష్ట్రంలో అన్ని పాఠశాలలు అమలు చేయాల్సిన ఎఫ్ఎల్ఎన్ (తొలిమెట్టు), ఉన్నతి కార్యక్రమాల వివరాలు అందులో పేర్కొన్నారు. ప్రధానంగా విద్యార్థిలో తరగతికి సంబంధించిన కనీస అభ్యసన సామర్థ్యాల సాధనే ధ్యేయంగా పేర్కొన్నారు. ఎఫ్ఎల్ఎన్. తొలిమెట్టు, ఉన్నతి, ఎఫ్ఆర్ఎస్. కార్యాచరణ ప్రణాళిక క్షేత్ర స్థాయిలో ఆచరణ  హేతుబద్ధం కాదు. పైగా ప్రభుత్వ విద్యాలయాలలో ఉపాధ్యాయులను నాణ్యమైన బోధనకు దూరం చేసేందుకు  దోహదపడుతున్నది.

అవమానించటమే!

మూడు నాలుగు కార్యక్రమాలు ఒకేసారి విద్యా సంవత్సరంలో ఆరంభిస్తే హడావుడిగా అమలు చేయటం ఏ మేరకు మేలనేది తెలియడంలేదు. పలు కార్యక్రమాలు మొక్కుబడి వ్యవహారంగా మారి ఈ విద్యా సంవత్సరం చదువుల ప్రగతి ఇప్పటికే పట్టాలు తప్పింది. ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం ఆగస్టులో ఉన్నత 
పాఠశాలల్లో  లెర్నింగ్‌‌ ఇంప్రూవ్‌‌మెంట్‌‌ ప్రోగ్రాం అమలు చేయనున్నామని ప్రకటించింది.  లక్ష్యాలు సరే, వాటి అమలు తీరులో ఉపాధ్యాయుల బోధనానుభవాన్ని, విషయ పరిజ్ఞానాన్ని, పని సంస్కృతిని అవమానించేలా ఉంది. అవసరమైన విద్యార్హతలతో ఉపాధ్యాయ ఉద్యోగం సాధించి, వృత్తిలో రెండు, మూడు దశాబ్దాలుగా విద్యార్థులతో క్షేత్ర స్థాయి సంబంధం కలిగిన ఉపాధ్యాయులు సిద్ధం చేసిన పాఠ్య ప్రణాళికలలో నాణ్యత లేదని ప్రభుత్వం భావించటం ఉపాధ్యాయులను తెలంగాణ సమాజం ముందు అవమానించటంగానే భావించక తప్పదు. 

అమలు లోపాల సంగతేమిటి?

 ఇప్పటికే రాష్ట్రంలో 20 వేలకు పైగా ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీ వున్నాయి. పర్యవేక్షకాధికారులు,మండల విద్యాధికారులు‌‌, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల పోస్టులు పెద్ద సంఖ్యలో ఖాళీలున్నాయి.ఉపాధ్యాయుల కొరతతో నడుస్తున్న పాఠశాలల్లో ఈ శిక్షణల కోసం విషయ నిపుణులుగా వెళ్లటం తిరిగి మండల స్థాయి శిక్షణలు, ఇవ్వటం వీటన్నింటికి హాజరయ్యే ఉపాధ్యాయుల కు పని ఒత్తిళ్ళు పెరగటం, తరగతుల నిర్వహణ నష్టాలు లెక్కలోకి రావటం లేదు. పైగా ఈ సమస్త కార్య నిర్వహణ నివేదికలను సిద్ధం చేయటం, ఎంఆర్సీలలో అందజేయటం, ఆన్ లైన్ చేయటం ఇవన్నీ రెగ్యులర్ బోధనాభ్యసనలకు ఉపాధ్యాయులను దూరం చేసేవే. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు అమలు చేసే కార్యక్రమం ఫలితాలపై  స్థానిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, విద్యార్థుల మధ్య నాగరికత, ప్రసారమాధ్యమాల ప్రభావం, పట్టణ, గ్రామీణ జీవన నేపథ్యాల అంతరాలు ఇవన్నీ ప్రభావం చూపుతాయి. 

సుదీర్ఘ అనుభవాలే పనిచేస్తాయి

 కార్యక్రమ లక్ష్యాల మూలం, సారం ఒక్కటే అయినా స్థానిక సమాజానికి అనుగుణంగా మార్పులు చేర్పులు అవసరమవుతాయి. సుదీర్ఘ అనుభవం గల ఉపాధ్యాయులకు కార్యక్రమంలో మార్పులు చేర్పులు చేసుకునే భాగస్వామ్యం ఉండాలి. ఇది విస్మరించటం వల్లనే అనేక ప్రభుత్వ కార్యక్రమాల అమలులో విఫలమవుతున్నాయి. ప్రస్తుతం పాఠశాలలో ఉపాధ్యాయులు తమ  సుదీర్ఘానుభవంతో రూపొందించుకొని అమలు చేస్తున్న పాఠ్యప్రణాళికల్లో నాణ్యత లేదని భావిస్తున్న ఎస్​సిఇఆర్టీ  తన అభిప్రాయంపై పునరాలోచించాలి. 

హేతుబద్ధత ఏమిటి?

అధికారులు కూడా ప్రభుత్వ మెప్పుకోసం ఉపాధ్యాయులను మరింత పని ఒత్తిళ్ళకు గురిచేసే రికార్డులు, రిపోర్టులు, వర్చువల్ సమావేశాలు నిర్వహించటం అలవాటు చేసుకున్నారు.  ఉపాధ్యాయ ఉద్యోగ అర్హత కోసం చదివే బీఈడీ సిలబస్​కు, వాస్తవంగా బడిలో ఆచరణకు సంబంధం లేకుండా తొలిమెట్టు, ఎఫ్ఎల్ఎన్ తొలిమెట్టు ఉన్నతి కార్యక్రమాలకు గల హేతుబద్ధత ఏమిటనేది అర్థం చేసుకోవాలి. క్షేత్రస్థాయిలో ఆచరణకు వీలుకాని కార్యక్రమాల అమలు వెనుక ఏ ప్రయోజనాలు ఉన్నాయనేది తేలాలి.

- అజయ్,ఉపాధ్యక్షుడు,టీపీటీఎఫ్, వరంగల్