ముస్లింలకు బీఆర్‌‌‌‌ఎస్ సర్కారు ధోకా : పీసీసీ మైనారిటీ సెల్

ముస్లింలకు బీఆర్‌‌‌‌ఎస్ సర్కారు ధోకా :  పీసీసీ మైనారిటీ సెల్

హైదరాబాద్, వెలుగు: మైనారిటీల సంక్షేమాన్ని బీఆర్‌‌‌‌ఎస్ ప్రభుత్వం గాలికొదిలేసిందని పీసీసీ మైనారిటీ సెల్ ఆరోపించింది. మైనారిటీల అభివృద్ధిలో బీఆర్‌‌‌‌ఎస్ సర్కార్ ఫెయిలైందని ఆరోపిస్తూ చార్జిషీట్‌‌ను విడుదల చేసింది. ఉద్యోగాలు, ఇండ్లు, చదువు, ఉర్దూ భాష, షాదీ ముబారక్​ స్కీమ్‌‌, ప్రార్థనా మందిరాల రక్షణ, నేరాల పెరుగుదల, వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ వంటి విషయాల్లో మైనారిటీలను సర్కారు మోసం చేసిందని మండిపడింది. బుధవారం గాంధీ భవన్‌‌లోని పీసీసీ మైనారిటీ సెల్ చైర్మన్ షేక్ అబ్దుల్లా సొహైల్ అధ్యక్షతన కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. దీనికి ఏఐసీసీ మైనారిటీ సెల్ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు ఇమ్రాన్ ప్రతాప్ గఢీ, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ‘సిర్ఫ్ కాంగ్రెస్’ నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని నేతలు నిర్ణయించారు. బీఆర్‌‌‌‌ఎస్ వైఫల్యాలను ఎండగట్టి.. కాంగ్రెస్‌‌తోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందన్న సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. 

మైనారిటీల్లో 15 లక్షల మంది నిరుద్యోగులు..

మైనారిటీ యువతలో దాదాపు 15 లక్షల మంది ఉద్యోగాల్లేక ఇబ్బంది పడుతున్నారని పీసీసీ మైనారిటీ సెల్ వెల్లడించింది. లోన్లు, ఉద్యోగాల కల్పనలో పాతబస్తీకి చెందిన ముస్లింలు వివక్ష ఎదుర్కొంటున్నారని ఆక్షేపించింది. డబుల్ బెడ్రూం ఇండ్లను కేవలం 1,000 మంది ముస్లింలకే ఇచ్చారని తెలిపింది. 80 శాతం మైనారిటీ ఇన్‌‌స్టిట్యూషన్లను మూసేశారని ఆరోపించింది. ముస్లిం స్టూడెంట్స్​కు ఫీజు రీయింబర్స్‌‌మెంట్ ఇవ్వడం లేదని, మైనారిటీలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రభుత్వ బడులను మూసేశారని పేర్కొంది. పాతబస్తీ గల్లీల్లో నేరాలు పెరుగుతున్నాయని, డ్రగ్స్, మద్యం మత్తులో జరుగుతున్న నేరాలను అరికట్టడంలో సర్కారు ఫెయిలైందని ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర జనాభాలో 14 శాతం మంది ముస్లింలు ఉన్నా.. వారికి ఉద్యోగాలు, నామినేటెడ్ పోస్టుల్లో బీఆర్‌‌‌‌ఎస్ సర్కారు మొండి చెయ్యి చూపిస్తున్నదని మండిపడింది. 

ఎస్సీ, ఎస్టీలూ టార్గెట్‌‌గా ప్లాన్స్...​

కేవలం మైనారిటీలే కాకుండా ఎస్సీ, ఎస్టీలు అధికంగా ఉన్నచోట.. వారిని కూడా కాంగ్రెస్‌‌ వైపు ఆకర్షించేలా మైనారిటీ సెల్ కార్యక్రమాలను రూపొందించనుంది. స్థూల, సూక్ష్మ కార్యాచరణతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. స్థూల కార్యాచరణలో భాగంగా హైదరాబాద్ జిల్లాలోని 15 నియోజకవర్గాలను వదిలేసి.. 10 శాతానికిపైగా జనాభా ఉన్న 22 నియోజకవర్గాల్లో కార్యక్రమాలను అమలు చేయాలని డిసైడ్ అయింది. సూక్ష్మ కార్యాచరణలో ముస్లింలు 
ఎక్కువగా ఉన్న మండలాల్లో కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొంది. ముస్లింలు, ఎస్సీలు, ఎస్టీలు కలిపి 12 నియోజకవర్గాల్లో 50 శాతానికి పైగా.. 25 సీట్లలో 40 శాతం, 31 సీట్లలో 30 శాతం వరకు ఉన్నట్టు గుర్తించిన పార్టీ మైనారిటీ సెల్‌‌.. ఆ ఓట్లను రాబట్టేందుకు వ్యూహాలు రచిస్తోంది. 

ఓటర్ల దగ్గరకు వెళ్లండి: ఇమ్రాన్ ప్రతాప్ గఢీ

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లకు ప్రజలకు ప్రభుత్వ వైఫల్యాలను వివరించాలని, కర్నాటకలో చేసినట్టే ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఇమ్రాన్ ప్రతాప్ గఢీ సూచించారు. బీఆర్‌‌‌‌ఎస్, బీజేపీ రెండూ మత రాజకీయాలకు తెరదీశాయని ఆరోపించారు. కాగా, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలవాలని పీసీసీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు షేక్ అబ్దుల్లా సొహైల్ విజ్ఞప్తి చేశారు. 

మైనారిటీలకు బీఆర్‌‌‌‌ఎస్ చేసిందేమీ లేదు: ఉత్తమ్ 

మైనారిటీల సంక్షేమానికి బీఆర్‌‌‌‌ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రం వచ్చినప్పటి నుంచి మైనారిటీల కోసం రూ.9,166 కోట్లు ఖర్చు చేశామంటూ బీఆర్‌‌‌‌ఎస్ సర్కారు కాకి లెక్కలు చెబుతున్నదని, ఆ మొత్తం ఇప్పటి వరకు పెట్టిన బడ్జెట్‌‌లో కేవలం 0.463 శాతమేనన్నారు. ఈ 9 ఏండ్లలో మైనారిటీలకు కేటాయించిన రూ.15,980 కోట్ల బడ్జెట్‌‌లో రూ.6,814 కోట్లు ఇంకా ఖర్చు పెట్టలేదన్నారు. షాదీ ముబారక్ స్కీమ్‌‌ కింద 25వేల దరఖాస్తులు పెండింగ్‌‌లో ఉన్నాయని తెలిపారు. అజ్మీర్ షరీఫ్​ దర్గాలో రబాత్ నిర్మాణాన్ని ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.