విద్యార్థి, యువత ఆకాంక్షలు నెరవేర్చాలి

విద్యార్థి, యువత  ఆకాంక్షలు నెరవేర్చాలి

రాష్ట్రంలో గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చలేదు. ఉద్యమకారులు కలగన్న ఆశయాలు, ఆకాంక్షలు నెరవేర్చకుండా నియంత పాలన చేసింది. విద్యార్థి, నిరుద్యోగ యువజన రంగాలను కేసీఆర్  ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును ప్రధానంగా నిరుద్యోగ యువత భరించలేకపోయింది.

విద్యార్థులు, నిరుద్యోగ యువత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టింది. ముఖ్యంగా ఉద్యోగాల భర్తీలో  కేసీఆర్​ సర్కారు చూపిన నిర్లక్ష్యాన్ని గ్రామాల్లో, పట్టణాల్లో ప్రతి ఓటరును  ఆలోచింపచేసేలా చేశారు.  సకల జనులు ఏకమై ఒకటే నినాదంతో  ‘మార్పు రావాలి’ అంటూ ఎన్నో ఆశలతో కాంగ్రెస్, సీపీఐ కూటమికి ఓటు వేసి గెలిపించి రాష్ట్రంలో అధికారం అప్పగించారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజులకే  ఖాళీగా ఉన్న ఉద్యోగాలపై  సమీక్ష నిర్వహించారు. దీంతో నిరుద్యోగుల్లో మళ్లీ  ప్రభుత్వ ఉద్యోగాలపై ఆశలు నెలకొన్నాయి.  దశాబ్ద కాలంపాటు  ప్రతిపక్షంలో ఉండి నిరుద్యోగ యువత బాధలు,  వారు పడిన కష్టాలు చూసిన కాంగ్రెస్ పార్టీ నేడు అధికారంలోకి వచ్చింది. ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్,  నిరుద్యోగ భృతి అమలు కోసం యావత్ తెలంగాణ నిరుద్యోగ యువత ఎదురు చూస్తున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజులకే  సీఎం రేవంత్​ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలపై సమీక్ష చేయడం పట్ల నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. 

కాంగ్రెస్​ సర్కారుపై నిరుద్యోగుల ఆశలు

బీఆర్ఎస్ ఓటమి చెందాక టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామా చేయడంతో నిరుద్యోగులు సంబురాలు చేసుకున్నారు.  తమ జీవితాలను చిన్నాభిన్నం చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పడం,  టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామాతో  నిరుద్యోగుల ఆనందం అంబరాన్ని తాకింది.  కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో జరిగిన టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీపై జరుగుతున్న దర్యాప్తును వేగవంతం చేయాలి. బాధ్యులను శిక్షిస్తేనే  టీఎస్పీఎస్సీ పట్ల నిరుద్యోగ యువతకు నమ్మకం, విశ్వాసం కలుగుతుంది.  కాంగ్రెస్​ ప్రభుత్వం టీఎస్పీఎస్సీ బోర్డును ప్రక్షాళన చేయాలనేది ప్రతి ఒక్కరి ఆకాంక్ష.  గత బీఆర్ఎస్​ ప్రభుత్వం ఇదిగో  నోటిఫికేషన్, అదిగో  నోటిఫికేషన్ అంటూ నిరుద్యోగులను మోసం చేసింది.  అప్పులు చేసి పోటీ పరీక్షలకు కోచింగ్​ తీసుకుని, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇక వచ్చేలా లేవని నిరాశ చెంది వందలాది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 

గత ప్రభుత్వం చేసిన తప్పులను కాంగ్రెస్ ప్రభుత్వం చేయకుండా, ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సత్వరం చర్యలు తీసుకోవాలి. నోటిఫికేషన్లకి సంబంధించి  ప్రణాళికతో కూడిన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని నిరుద్యోగ యువత కోరుతున్నారు.  జాబ్ క్యాలెండర్లలో ఉద్యోగ నోటిఫికేషన్లు, పోటీ పరీక్షల ఫలితాలు వచ్చేవరకు నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలి.  ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో సమీక్షించి వాటిని  త్వరగా భర్తీ చేసి నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపాలి. 

ప్రభుత్వ వర్సిటీలకు పెద్దపీట వేయాలి

పేద, మధ్యతరగతి విద్యార్థుల చదువులకు ప్రభుత్వం అందించే ఫీజు రీయింబర్స్​మెంట్, స్కాలర్​షిప్​బకాయిలను ప్రభుత్వం చెల్లించాలి. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా విడుదల చేస్తే ఇబ్బందులు ఉండవని రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు భావిస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో ఉద్యమానికి ఊపిరినిచ్చిన యూనివర్సిటీల పట్ల గత బీఆర్ఎస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించింది.

  ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్వీర్యం చేసే విధంగా రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీలకు రెడ్ కార్పెట్ పరిచింది.  బడ్జెట్లో యూనివర్సిటీలకు ప్రత్యేక నిధులు కేటాయించకుండా, ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, ఇతర పోస్టులు భర్తీ చేయకుండా జాప్యం చేసింది. విద్యార్థులకు స్కాలర్​షిప్,  మెస్ ఛార్జీలు ఇవ్వకుండా వారిని బాధకు గురిచేసింది.  దాదాపు పదేండ్ల పాలనలో ఒక్కనాడు కూడా యూనివర్సిటీలకు  ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి వచ్చింది లేదు. విద్యార్థుల సమస్యలు విన్నది లేదు, పరిష్కరించింది లేదు. సమస్యల కోసం ఉద్యమిస్తే కేసులు పెట్టడం, ఉద్యమాలను అణచివేయడంతో యూనివర్సిటీ విద్యార్థులు స్వరాష్ట్రంలో పడరాని పాట్లు పడ్డారు. తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఓటు ద్వారా కేసీఆర్​సర్కారుకి తగిన బుద్ధి చెప్పారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరాలంటే కాంగ్రెస్ గెలవాల్సిందే అని నిర్ణయించుకుని, రాష్టంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో యూనివర్సిటీ విద్యార్థులు కీలక పాత్ర పోషించారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం యూనివర్సిటీలకు పెద్దపీట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యమంత్రి రెవంత్​రెడ్డి ప్రతి యూనివర్సిటీని సందర్శించి,  సమీక్షించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలి. యూనివర్సిటీలకు కావలసిన నిధులు, ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులు, ఇతర పోస్టులను భర్తీ చేయాలని విద్యార్థి లోకం కోరుకుంటున్నది.  రాష్ట్రంలో విద్యార్థి, నిరుద్యోగ యువత కలలుగన్న ఆశయాలు, ఆకాంక్షలను కాంగ్రెస్​ ప్రభుత్వం నెరవేర్చాలి. యువత ఆశయాలను, లక్ష్యాలను నెరవేర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయాలి.  విద్యార్థులు, నిరుద్యోగ యువతకు అండగా నూతన ప్రభుత్వం నిలబడాలని ప్రతి విద్యార్థి, నిరుద్యోగి తల్లిదండ్రులు ఆకాంక్షిస్తున్నారు.

విద్యారంగంపై బీఆర్ఎస్​ చిన్నచూపు

ప్రాథమిక హక్కు అయిన విద్యారంగం పట్ల గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా చిన్నచూపు చూసింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించింది. దీంతో చాలా మందిలో ప్రభుత్వ విద్య బలోపేతం అయితది అనే కొత్త ఆశ ఏర్పడ్డది. కేసీఆర్​ సర్కారు ప్రభుత్వ విద్యకు తక్కువ ప్రాధాన్యత ఇచ్చి ప్రైవేట్, కార్పొరేట్ విద్యకు పెద్దపీట వేసింది. ఎవరైతే విద్యను ప్రైవేటీకరణ చేస్తున్నారో వారినే ప్రభుత్వంలో భాగస్వాములను చేసింది. విద్యావ్యాపారం చేస్తున్నవారిని మంత్రులను, ఎమ్మెల్యే లను చేయడం చూసి ప్రజలంతా విస్తుపోయారు. తెలంగాణలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ విద్య పరిరక్షణ, బలోపేతం కోసం చిత్తశుద్ధితో కృషి చేయాలి. యావత్ తెలంగాణ ప్రజానీకం ఇదే కోరుకుంటున్నారు. ప్రభుత్వ విద్యాసంస్థలను ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు సందర్శించి స్వయంగా సమస్యలు తెలుసుకోవాలి.  పాలకులు ఆ దిశగా ముందుకువెళ్లాలి.

 ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, సంక్షేమ హాస్టళ్లలో  మౌలిక సదుపాయాలు కల్పించాలి. అందులో బాత్రూంలు,  భోజన వంట గదులు, తాగునీటి సౌకర్యం, పక్కా భవనాల నిర్మాణం చేపట్టాలి.  రాష్ట్రంలోని అనేక మండలాల్లో, జిల్లాల్లో పూర్తి స్థాయి ఎంఈఓ, డిఈఓలు లేక  పాలనాపరమైన ఇబ్బందులు కలుగుతున్నాయి. అదేవిధంగా  పాఠశాలల్లో ఉపాధ్యాయులు,  కాలేజీల్లో ప్రిన్సిపాల్స్,  సంక్షేమ హాస్టళ్లలో  వార్డెన్స్ లేక ఇంఛార్జిల  పాలన వల్ల  విద్యావ్యవస్థ ముందుకు సాగడం లేదు. దీనికి కాంగ్రెస్​ సర్కారు స్వస్తి పలకాలి.  పూర్తిస్థాయి విద్యాధికారులు, ప్రిన్సిపల్స్, వార్డెన్స్, నాన్ టీచింగ్ సిబ్బందిని నియమిస్తే విద్యారంగ ప్రమాణాలు మెరుగుపడతాయి.  ప్రభుత్వ విద్య సజావుగా సాగుతుంది. 


- కసిరెడ్డి మణికంఠ రెడ్డి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు