టికెట్ల లొల్లి.. బీఆర్ఎస్​కు 19 చోట్ల అసంతృప్తుల సెగ!

టికెట్ల లొల్లి..  బీఆర్ఎస్​కు 19 చోట్ల అసంతృప్తుల సెగ!
  • రోజురోజుకూ ముదురుతున్న టికెట్ల లొల్లి 
  • పోటీకి సిద్ధమవుతున్న టికెట్లు దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు  
  • కొన్నిచోట్ల సీటు దక్కిన సిట్టింగులపై వ్యతిరేకత 
  • అభ్యర్థులకు వ్యతిరేకంగా లోకల్ లీడర్ల మీటింగ్స్

హైదరాబాద్, వెలుగు:  అధికార పార్టీ బీఆర్ఎస్​లో టికెట్ల లొల్లి రోజురోజుకు ముదురుతున్నది. అంతా సాఫీగానే జరిగిపోద్దని, ఎవరైనా ఒకరిద్దరు అసంతృప్తులు ఉంటే బుజ్జగించి సెట్​ చేసుకోవచ్చని ఆ పార్టీ వేసుకున్న ప్లాన్ రివర్స్ కొడుతున్నది. టికెట్ దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు సీటు ఆశించి భంగపడ్డ ముఖ్య నేతలు.. పైకి సీఎం కేసీఆర్ ఎలా చెబితే అలా అంటూనే తమ పని తాము చేసుకుపోతున్నారు. కొందరు బహిరంగంగానే తమ అసంతృప్తిని తెలియజేస్తుండగా, మరికొందరు తమ అనుచరుల వద్ద చెప్పుకుని వాపోతున్నారు. 

వరుసగా అనుచరులు, లోకల్ లీడర్లతో మీటింగ్ లు పెడుతూ భవిష్యత్ కార్యాచరణపై ఆలోచనలు చేస్తున్నారు. కొందరు పార్టీ మారి పోటీ చేసేందుకు రెడీ అవుతుండగా, మరికొందరు ఇండిపెండెంట్ గానే బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఇలా దాదాపు 19 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్​కు అసంతృప్తుల సెగ తగులుతున్నది. సిట్టింగులకు టికెట్లు ఇవ్వని స్టేషన్ ఘన్​పూర్, ఖానాపూర్, వేములవాడ, ఉప్పల్, వైరా, ఆసిఫాబాద్, అభ్యర్థులను ఖరారు చేయని జనగామ, నర్సాపూర్, టికెట్లు ప్రకటించిన మల్కాజ్ గిరి, ములుగు, కొత్తగూడెం, పాలేరు తదితర నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కు అసంతృప్తుల సెగ తగులుతోంది. 

మిగిలిన కొన్ని సీట్లలో టికెట్లు పొందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలపై స్థానిక లీడర్లు, కార్యకర్తలు గుర్రుగా ఉన్నారు. నాలుగు నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలకు సంబంధిత ఇన్ చార్జ్ మంత్రితో పడటం లేదు. ఇందులో ఉమ్మడి నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, మహబూబ్​నగర్​కు చెందినోళ్లు ఉన్నారు. ఇంకోవైపు కొన్ని నియోజకవర్గాల్లో సిట్టింగులకు కాకుండా తమకు దగ్గరున్నోళ్లకు టికెట్ ఇవ్వాలని కేటీఆర్, హరీశ్​రావు, కవిత సూచించారు. అయితే అవన్నీ కేసీఆర్ పక్కనపెట్టడంతో ఆయా నియోజకవర్గాల్లో టికెట్ వస్తుందని నమ్మకం పెట్టుకున్న నేతలు కొందరు.. అక్కడ నుంచి పోటీకి దిగుతున్నోళ్లకు సహకరించడం లేదు. ఇందులో జహీరాబాద్, కంటోన్మెంట్, ఉప్పల్ తదితర నియోజకవర్గాలు ఉన్నాయి. 

ఎక్కడేం జరుగుతున్నదంటే.. 

  • ఖమ్మం జిల్లాలో మొన్నటి వరకు సైలెంట్​గా ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. సడెన్​గా పొలిటికల్​ హీట్​ పెంచారు. పాలేరు నుంచి ఆయనకు టికెట్ దక్కలేదు. పైగా పార్టీ నుంచి ఎలాంటి హామీ కూడా రాలేదని తెలిసింది. దీంతో ఆయన ఖమ్మంలో భారీ కార్ల ర్యాలీతో బల ప్రదర్శన చేశారు. తప్పకుండా ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. 
  • మల్కాజ్​గిరి టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకు కేటాయించగా, ఆయన తన కొడుకు కూడా టికెట్ (మెదక్ నుంచి) ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మెదక్, మేడ్చల్, మల్కాజ్ గిరి నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమావేశమైన మైనంపల్లి.. వారం పాటు మల్కాజ్ గిరిలో పర్యటించి, ప్రజల అభిప్రాయం తీసుకుంటానని చెప్పారు. ఆ తర్వాత తన నిర్ణయం చెబుతానని ప్రకటించారు. తండ్రీకొడుకు ఇద్దరూ వేరే పార్టీలో చేరి పోటీ చేయడమా? లేక ఇండిపెండెంట్ గా బరిలోకి దిగడమా? అనే దానిపై నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది. 
  • ఈసారి టికెట్ దక్కని స్టేషన్ ఘన్​పూర్ ఎమ్మెల్యే రాజయ్య.. ఆరునూరైనా ప్రజా జీవితంలోనే ఉంటానని స్పష్టం చేశారు. ‘పంట పండించి కుప్ప పోసిన తర్వాత ఎవరో వస్తా అంటే ఊరుకుంటానా’ అని కామెంట్ చేశారు. 
  • ఖనాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్​కూడా ఈసారి టికెట్ దక్కలేదు. అక్కడ టికెట్ కేటాయించిన అభ్యర్థికి వ్యతిరేకంగా ఆమె మాట్లాడుతున్నారు. ఆయన గిరిజనుడు కాదని, దీనిపై కోర్టులో కేసు వేస్తానని అంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ టికెట్​కోసం కూడా రేఖానాయక్ అప్లికేషన్ పెట్టుకున్నారు. 
  • టికెట్ దక్కని ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాశ్ రెడ్డి కూడా ఏం చేయాలనే దానిపై తన అనుచరులతో మంతనాలు జరుపుతున్నట్టు తెలిసింది. 
  • వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబుకు పౌరసత్వం వివాదం కారణంగా టికెట్ కేటాయించలేదని కేసీఆర్ ప్రకటించారు. అయితే అలాంటిదేమైనా ఉంటే తాను చూసుకుంటానని, టికెట్ ఇవ్వకపోవడం ఏమిటని తన అనుచరుల వద్ద రమేశ్ బాబు వాపోయినట్టు తెలిసింది. దీంతో ఆయనను బుజ్జగించేందుకు కేబినేట్ హోదాతో సలహాదారు పోస్టు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. అయినప్పటికీ చెన్నమనేని పోటీకే ఆసక్తి చూపుతున్నారని, లేదంటే తాను సూచించిన వ్యక్తికే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని సమాచారం. 
  • ఈసారి ములుగులో బడే నాగజ్యోతికి టికెట్​ఇచ్చారు. అయితే అక్కడి బీఆర్ఎస్ నేతలు ఆమె ఎంట్రీపై వ్యతిరేకత చూపుతున్నారు. 
  •  ఆసిఫాబాద్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆత్రం సక్కును పక్కనపెట్టి, కోవా లక్ష్మీకి టికెట్ ఇచ్చారు. ఇక్కడ కూడా క్యాడర్​లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. వైరా టికెట్​విషయంలోనూ ఇట్లనే జరుగుతోంది.
  •  జనగామ టికెట్ ఇంకా ప్రకటించనప్పటికీ.. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, పల్లా రాజేశ్వర్​రెడ్డి మధ్య పోటీ నెలకొంది. టికెట్ దక్కదనే ప్రచారంతో పల్లాపై ముత్తిరెడ్డి విమర్శలు గుప్పిస్తున్నారు. తన విషయంలో కేసీఆర్​సరైన నిర్ణయమే తీసుకుంటారని చెబుతూనే, క్యాడర్​తో మీటింగ్​లు పెడుతున్నారు. 
  •   కొత్తగూడెంలో సిట్టింగ్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావుకు టికెట్ ఇచ్చారు. అయితే ఆయనపై స్థానిక బీఆర్ఎస్​లీడర్లు కోపంతో ఉన్నారు. మరోవైపు ఇక్కడ టికెట్ ఆశించి భంగపడ్డ డీహెచ్ శ్రీనివాసరావు.. టికెట్ రాకపోయినా, ఎమ్మెల్యేను ఓడించగల సత్తా తనకు ఉందని తన అనుచరులతో చెప్పినట్టు తెలిసింది.