ప్రాజెక్టులపై చర్చకు నేను ఓకే ..సీఎల్పీ నేత భట్టి సవాల్​

ప్రాజెక్టులపై చర్చకు నేను ఓకే ..సీఎల్పీ నేత భట్టి సవాల్​

నల్గొండ, వెలుగు :  నల్గొండ జిల్లాలోని ప్రాజెక్టులకు విషయంలో కాంగ్రెస్ ఏం చేసిందో.. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ఏం చేసిందో చర్చించేందుకు తాను  సిద్ధంగా ఉన్నానని, దీన్ని స్వీకరించే దమ్ము బీఆర్ఎస్​నాయకులు ఉందా? అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సవాల్​ విసిరారు. గురువారం చందంపేట మండలంలోని నక్కలగండి ప్రాజెక్టు నుంచి భట్టి పీపుల్స్ మార్చ్​ పాదయాత్ర ప్రారంభించారు. ముంపు బాధితులతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. నక్కలగండి తండా, మర్లపాడు తండా, కేశ్య తండాకు చెందిన నక్కలగండి ప్రాజెక్టు ముంపు బాధితులు తమ సమస్యలను భట్టి ఎదుట ఏకరవు పెట్టారు.  భూములు కోల్పోయి రోడ్డున్న పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. 

మాజీ ఎమ్మెల్యే బాలూనాయక్​ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడే ఎస్ఎల్​బీసీ సొరంగామార్గాన్ని పూర్తిచేసేందుకు రూ.1000 కోట్లు కేటాయిస్తే ఇప్పటికే నాలుగు లక్షల ఎకరాలకు నీళ్లు పారేవన్నారు. ఆ నిధులు ఇవ్వకుండా ఎవరు అడ్డుకున్నారు, ఎందుకు ఇవ్వలేదని మంత్రి జగదీశ్​రెడ్డి, మండలి చైర్మన్​గుత్తా సుఖేందర్​రెడ్డి పై ఫైర్​అయ్యారు. ఎంపీగా, ఎమ్మెల్సీగా, మండలి చైర్మన్​గా గుత్తా జిల్లా కోసం ఏం చేశారని నిలదీశారు. కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి రాగానే జిల్లాలో పెండింగ్​లో ఉన్న ప్రాజెక్టులన్నీ కంప్లీట్​ చేస్తామని పేర్కొన్నారు. నిర్వాసితుల కుటుంబాలకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. కాగా భట్టి యాత్ర 84వ రోజు నక్కలగండి ప్రాజెక్టు నుంచి బయలుదేరగా పాతూర్ తాండ  స్టేజ్ వద్ద నల్గొండ ఎంపీ, పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి స్వాగతం పలికి సంఘీభావం ప్రకటించారు.