గెలిస్తే మీ క్రెడిట్ ఓడితే మా తప్పా..బీఆర్ఎస్ మాజీల బాధ

గెలిస్తే మీ క్రెడిట్ ఓడితే మా తప్పా..బీఆర్ఎస్ మాజీల బాధ
  • వైఫల్యం ఎవరిది?
  • ఓటమికి కారణం ఎవరు..?
  • ఇప్పుడు తప్పు మాపై నెట్టేస్తే ఎలా
  • విన్నింగ్ క్రెడిట్ మీరు తీసుకొని మాపై నిందలా
  • లోక్ సభ సమీక్షల్లోనూ అవే కామెంట్స్
  •  పదేండ్ల పాలనపై అసంతృప్తి లేదా..?
  •  బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేల అంతర్మథనం

హైదరాబాద్: బీఆర్ఎస్ అధికారం కోల్పోవడానికి కారణం ఎవరు..? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత కదా..? మేమే బాధ్యులమా..? 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీకి విజయం సాధిస్తే కేసీఆర్ ఫేస్ తో అధికారంలోకి వచ్చామని చెప్పిన బీఆర్ఎస్ పెద్దలు ఇప్పుడు ఓడిపోగానే తప్పును మా మీదకు నెట్టేస్తారా..? ఇదేం పద్ధతి..? ఓటమికి మీ నిర్ణయాలు కారణం కాదా..? అన్నది గులాబీ దండులో హాట్ టాపిక్ గా మారింది. అచ్చా కరేతో హమ్ కరే.. బురా కరేతో బుడ్డా కరే అన్న పద్ధతి కరెక్ట్ కాదంటూ ఓటమి పాలైన గులాబీ  నేతలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఈ అంశాలపై నేతలు బహిరంగంగా మాట్లాడుకోవడం గమనార్హం. ధరణి, దళితబంధు, నియంతృత్వ విధానాలు పార్టీ ఓటమికి కారణం కాదా..? అని మాట్లాడుకోవడం కనిపించింది.  కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కవిత వ్యవహరించిన పలు వివాదాస్పద అంశాలనూ చర్చించుకుంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు.. ప్రజల్లో అప్రతిష్ట తెచ్చిపెట్టిన తీరు కూడా ఈ సందర్భంగా చర్చనీయాంశమవుతోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు? అవును మాకు అహంకారమే.. అంటూ చెప్పిన మాటలూ చర్చకు వస్తున్నాయి. గులుగుడు గులుగుడే.. గుద్దుడు.. గుద్దుడే అంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించడాన్ని తప్పుపడుతున్నారు. ఇంటెలిజెన్స్ రిపోర్టులను పక్కన పెట్టి మహాద్భుతం జరుగుతుందని, ఫలితాల మరుసటి రోజు వరకు చేసిన ట్వీట్లు కూడా ఈ సందర్భంగా చర్చకు వస్తున్నాయి. తీరా ఈవీఎంలు ఓపెన్ చేశాక.. ఇప్పుడు నిందలు తమపై నెట్టేస్తే ఎలా..? అంటున్నారు. క్యాబినెట్ లో కొనసాగిన వారు సైతం ఓడిపోయారంటే ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఏర్పడిందో అర్థం చేసుకోకుండా తప్పును తమపైకి నెట్టేయడం ఎందుకని ఫైర్ అవుతున్నారు. 

ఓటమి పోస్టుమార్టం చేయకుండా..

బీఆర్ఎస్ అధికారం కోల్పోయి నెలరోజులు గడుస్తున్నా.. ఓటమికి కారణాలపై పార్టీ పోస్టుమార్టం చేయలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ లో గెలిచినా.. కామారెడ్డిలో ఓటమి పాలయ్యారు. ఇందుకు కారణాలేంటి..? అధినేతే ఎందుకు ఓడినట్టు అనే విశ్లేషణను కామారెడ్డి వెళ్లి నిర్వహించలేదు. ఆ సెగ్మెంట్ నేతలతో హైదరాబాద్ లో కూడా చర్చించలేదు. మంత్రులు, కీలక నేతలు ఓటమి పాలయ్యారు. ఆ ఓటమి వెనుక కారణమేంటి..? అన్నదీ విశ్లేషించుకోలేదు. అవన్నీ పక్కన పెట్టి.. లోక్ సభ ఎన్నికలకు రెడీ అవుతుండటం చర్చనీయాంశమైంది. ఆ సమావేశాల్లో కూడా ఓటమికి కారణాలను మాజీ ఎమ్మెల్యేలపైకి నెట్టేస్తుండటం విమర్శలకు తావిస్తోంది.   

అప్పుడు నన్ను చేసి ఓటెయ్యాలని

ఎన్నికల ముందు ప్రచారంలో ఎమ్మెల్యేల సొంత ప్రచారాన్ని అగ్రనేతలే అదుపు చేశారు. కేసీఆర్ కేంద్రంగానే ప్రచారం జరగాలని సూచనలిచ్చారు. పార్టీ ప్రచారంలోనూ కేసీఆరే మా ధీమా అంటూ ఇంకెవరికీ ప్రాధాన్యం లేకుండా చేశారు. ప్రచార సభల్లో కేసీఆర్ కూడా తనను చూసే ఓటేయాలని పిలుపునిచ్చారు. అభ్యర్థులనే కాదు వారి వెనుక పార్టీని, నన్ను చూడాలని కేసీఆరే చెప్పారు. కొన్ని చోట్ల అభ్యర్థులపై వ్యతిరేకత ఉన్నా తమను చూసి ఓట్లేయాలని కేసీఆర్, కేటీఆర్ పదేపదే చెప్పారు. ఈ అంశాల ఆధారంగానే ఓటింగ్ జరిగింది. హైదరాబాద్ రీజియన్ మినహా కోర్ తెలంగాణ అంతా బీఆర్ఎస్ కు ఘోరంగా ఓటమి ఎదురైంది. భారీ మెజారిటీతో కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచారు. గతంలో కేసీఆర్ కు అండగా ఉన్న రూరల్ తెలంగాణలోనే బీఆర్ఎస్ కు ఈ ఫలితాలు ఎదురయ్యాయి. పైగా కేసీఆరే స్వయంగా రంగంలోకి దిగిన కామారెడ్డిలోనూ ట్రయాంగిల్ ఫైట్ లో ఆయనకే ఓటమి తప్పలేదు. ఇది కేసీఆర్ పాలనకు వచ్చిన ఫలితమని విశ్లేషణలు వచ్చినా, తమపై రిమార్క్ రావడాన్ని అగ్రనేతలు ఇష్టపడడం లేదు. ఓడిన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులపైనే నెపం నెట్టేస్తున్నారని నేతలు ఆవేదనతో ఉన్నారు. తమకు సన్నిహితంగా ఉన్న మాజీ నేతలు బద్నాం అయినా ఫరవాలేదు, తమ మీదికి మాత్రం మాట రావొద్దన్నట్లుగా అగ్రనేతలు వ్యవహరిస్తున్న తీరుపైనే నేతలు ఫీలవుతున్నారు.